New Emojis: కొత్త ఎమోజీలు వస్తున్నాయ్‌.. ఇదిగో జాబితా!

యూనికోడ్‌ కన్సార్టియం ఎమోజీ 15.0 పేరుతో మరో 31 కొత్త ఎమోజీలను ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్లకు పరిచయం చేయనుంది. మరి కొత్త ఎమోజీల జాబితాలో ఏమేం ఉన్నాయో చూద్దామా... 

Updated : 17 Jul 2022 15:12 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మనసులోని భావాలను అవతలి వారికి తెలిజేయాలంటే పదాలను పదబంధాలుగా మార్చి రాయాల్సిందే. అది గతం.. ఇది డిజిటల్‌ యుగం.. ఎలాంటి భావాన్నైనా ఎమోజీలతో ఇట్టే వ్యక్తపరచవచ్చు. సంతోషం, బాధ, కోపం, ఏడుపు వంటి ఎన్నో రకాల భావాలను పదాల అవసరం లేకుండా ఒక్క ఎమోజీతో అవతలి వారికి చెప్పేస్తున్నారు. ప్రస్తుత ఆన్‌లైన్‌ యుగంలో వీటి  ప్రాధాన్యం అంతకంతకీ పెరుగుతోంది. మొబైల్‌, కంప్యూటర్‌, ట్యాబ్‌ మెసేజింగ్‌ యాప్‌ల ద్వారా జరిపే రోజువారీ సంభాషణల్లో ఎమోజీలను విరివిగా వినియోగిస్తున్నారు. ఇప్పటిదాకా దాదాపు 3,633 అధికారికంగా గుర్తించిన ఎమోజీలు అందుబాటులో ఉన్నట్లు సమాచారం. భవిష్యత్తులో వీటి సంఖ్య మరింత పెరగనుంది. తాజాగా యూనికోడ్‌ కన్సార్టియం ఎమోజీ 15.0 పేరుతో మరో 31 కొత్త ఎమోజీలను ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్లకు పరిచయం చేయనుంది. 2022-23 మధ్య కాలంలో కొత్త ఎమోజీలు యూజర్లకు అందుబాటులోకి వస్తాయని తెలిపింది. జులై 17న ప్రపంచ ఎమోజీ డే. ఈ సందర్భంగా యూనికోడ్ కన్సార్టియం కొత్త ఎమోజీలకు సంబంధించిన ప్రకటన చేసింది. మరి కొత్త ఎమోజీల జాబితాలో ఏమేం ఉన్నాయో చూద్దామా... 

యూనికోడ్ కన్సార్టియం కొత్తగా తీసుకొస్తున్న వాటిలో షేకింగ్‌ ఫేస్‌, లైట్‌ బ్లూ, గ్రే, పింక్‌ రంగుల్లో హార్ట్‌ సింబల్‌, గాడిద, దుప్పి, బ్లాక్‌ బర్డ్‌, జెల్లీ ఫిష్‌, విసన కర్ర, అల్లం, బఠాని కాయ, ఫ్లూట్‌, మరకాస్‌ సంగీత వాయిద్యం, వైఫై సింబల్‌, హైసింత్‌ పువ్వు, గూస్‌ (పెద్ద బాతు), పక్షి రెక్క, ఖందా (సిక్కు మత చిహ్నం )తోపాటు ఐదు వర్ణాలలో నెడుతున్నట్లు చూపించే పది చేతి సింబల్స్‌ ఉన్నాయి. ఈ ఎమోజీ జాబితాను యూనికోడ్ కన్సార్టియం యాపిల్, గూగుల్ సంస్థలకు పంపుతుంది. వీటిని పరిశీలించిన అనంతరం ఆయా కంపెనీలు తమ అభిప్రాయాలు, సూచనలను కన్సార్టియం దృష్టికి తీసుకొస్తాయి. దానికి తగినట్లుగా మార్పులు చేసి యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది కన్సార్టియం సూచించిన ఎమోజీల సంఖ్య చాలా తక్కువ. గతేడాది  112 కొత్త ఎమోజీలను కన్సార్టియం పరిచయం చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని