Published : 18/02/2021 11:29 IST

ఆండ్రాయిడ్‌ని భలేగా మారుస్తున్నారుగా!

ఇంటర్నెట్ డెస్క్‌:  ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్స్‌తో ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ ఓఎస్‌ను తీసుకొస్తూ యూజర్స్‌కి సరికొత్త అనుభూతిని అందిస్తుంది గూగుల్. ఈ ఏడాది ఆండ్రాయిడ్ 12ను తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటికే ఈ ఓఎస్‌కు సంబంధించి డెవలపర్స్ ప్రివ్యూ (ముందస్తుగా కొద్ది మంది టెక్ నిపుణులు ఓఎస్‌ను పరీక్షించి తమ అనుభవాలను తెలిపే ప్రక్రియ) మరి కొద్ది రోజుల్లో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో ఆండ్రాయిడ్ 12లో రానున్న ఫీచర్స్‌ ఇవేనంటూ వాటికి సంబంధించిన సమాచారం ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతోంది. అవేంటో మీరు చూసేయండి.. 


కొత్త వెర్షన్‌కి సరికొత్త పేరు

ఆండ్రాయిడ్ కొత్త వెర్షన్ ఓఎస్‌ తీసుకొచ్చిన ప్రతిసారీ, దాన్ని ఏదో ఒక తీపి పదార్ధం పేరుతో పిలుస్తారు. 2009లో విడుదల చేసిన ఆండ్రాయిడ్ 9 వెర్షన్‌ని ‘కప్‌కేక్‌’ అని పిలవడంతో ఈ సంప్రదాయం మొదలైంది. తర్వాతి కాలంలో దాన్ని అలాగే కొనసాగించారు. అయితే 2019లో ఈ సంప్రదాయానికి తెర దించుతూ తీపి పదార్ధం ముందు మరో కొత్త పదం చేర్చారు. అలా ఆండ్రాయిడ్ 10 ఓఎస్‌ని ‘క్వీన్‌ కేక్‌’ అని, ఆండ్రాయిడ్ 11ని ‘రెడ్ వెల్వేట్ కేక్‌’ అని పిలిచారు. తాజా సమాచారం ప్రకారం ఆండ్రాయిడ్ 12ని  ‘స్నో కోన్‘ అని పిలవనున్నారట. 


రంగు రంగుల కలబోతగా

గతంలో ఉపయోగించిన థీమ్ రంగులకు భిన్నంగా ఇందులో కొత్త థీమ్‌లో రంగులని పరిచయం చేయనున్నారు. ఇందుకోసం ‘థీమింగ్ సిస్టం’ ఫీచర్‌ను కొత్త వెర్షన్‌లో ఇస్తున్నారట. దీని వల్ల ఓఎస్‌ థీమ్‌ రంగుని యూజర్ తనకు నచ్చినట్లుగా మార్చుకోవచ్చు. ఇప్పటి వరకు పలువురు డెవలపర్స్‌ ఇసుక రంగుతో ఉన్న ఓఎస్‌ ఫొటోలను షేర్ చేశారు. అవికాకుండా ఇతర రంగులు ఏంటనేది తెలియాల్సివుంది.  


కొత్త యూఐతో నోటిఫికేషన్స్‌ 

అలానే నోటిఫికేషన్ సెంటర్‌లో కూడా మార్పులు చేస్తున్నారు. ‘మెటీరియల్ నెక్ట్స్‌’ డిజైన్ ఆకృతితో నోటిఫికేషన్ సెంటర్‌ను తీసుకొస్తున్నారు. ఇందులో యాప్‌ నోటిఫికేషన్లతో పాటు ఆండ్రాయిడ్ బిల్ట్‌-ఇన్‌ యాప్స్‌ అప్‌డేట్లు సరికొత్త యూజర్ ఇంటర్‌ఫేస్‌ (యూఐ)తో కనిపిస్తాయి. 


మెసేజింగ్‌ యాప్‌లకు విడ్జెట్స్‌

మెసేజింగ్ యాప్‌ల కోసం ప్రత్యేకంగా ‘కన్వర్సేషన్స్‌’ పేరుతో విడ్జెట్స్‌ తీసుకొస్తున్నారు. వీటిలో మనం యాప్‌ ద్వారా చివరిగా ఎవరితో సంభాషించామనేది తెలుస్తుంది. అలా ప్రతి యాప్‌కి ప్రత్యేక విడ్జెట్‌ ఉంటుందని సమాచారం. 


వన్‌ హ్యాండ్ మోడ్‌

ప్రస్తుతం మార్కెట్లో ఉన్న అన్ని ఫోన్లకు స్క్రీన్ పెద్దదిగా ఉంటుంది. దీంతో  కొన్ని సార్లు ఫోన్ ఉపయోగించడం కష్టంగా ఉంటుంది. అటువంటి వారి కోసం ఆండ్రాయిడ్ 12లో ‘వన్‌ హ్యాండ్ మోడ్‌’ ఫీచర్‌ పరిచయం చేస్తున్నారు. ఇది ఫోన్ స్క్రీన్ నిలువు సైజ్‌ను తగ్గిస్తుంది. దీని సాయంతో యూజర్‌ ఫోన్‌ను సులభంగా ఆపరేట్ చెయ్యొచ్చు.   


ప్రైవసీకి పెద్దపీట 

యాపిల్ ఐఓఎస్‌ తరహాలోనే గూగుల్  ఆండ్రాయిడ్ 12లో ప్రైవసీకి అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. ఇందుకోసం ఫోన్ పైభాగం చివర్లో యూజర్‌కి తెలిసేలా ఆరెంజ్‌, గ్రీన్‌ రంగుల్లో చిన్నపాటి గుర్తులు ఉంటాయి. ఆరెంజ్‌ రంగులో మైక్‌ సింబల్, గ్రీన్‌ రంగులో కెమెరా సింబల్ కనిపిస్తాయి. దీని వల్ల మీరు యాప్ ఉపయోగిస్తున్నప్పుడు మీ అనుమతి లేకుండా కెమెరా, ఫోన్ మైక్రోఫోన్‌ పనిచేస్తుంటే సులభంగా తెలిసిపోతుంది. 


ఆటోమేటిక్ స్క్రీన్‌షాట్ 

2019లో స్క్రోలింగ్ స్క్రీన్‌షాట్స్‌ ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు గూగుల్ ప్రకటించింది. అయితే ఆండ్రాయిడ్‌ 10, 11 వెర్షన్‌లో ఈ ఫీచర్‌ను తీసుకురాలేదు. తాజాగా స్క్రోలింగ్ స్క్రీన్‌షాట్స్‌ని ఆండ్రాయిడ్ 12లో పరిచయం చేయనున్నారట. దీని సాయంతో యూజర్ స్క్రీన్‌షాట్ తీసిన వెంటనే దానంతటదే ఫోన్ స్క్రీన్‌ కిందకు జరిగి మరో స్క్రీన్‌షాట్ తీసుకుని రెండింటిని కలిపి చూపిస్తుంది.  


డబుల్ ట్యాప్ చేస్తే చాలు

ఆండ్రాయిడ్‌ 11లో పిక్చర్‌-ఇన్‌-పిక్చర్ విండో ఫీచర్‌తో ఫొటో మూల నుంచి పట్టుకుని జరిపే ఫొటో సైజ్ మారిపోతుంది. కానీ ఆండ్రాయిడ్ 12లో ఫొటో మీద డబుల్ ట్యాప్ చేస్తే ఫొటో సైజ్ మారేలా మార్పులు చేశారు. 


యాప్ పెయిర్స్‌

గూగుల్ ప్రతిష్టాత్మకంగా తీసుకొస్తున్న మరో ఫీచర్ యాప్ పెయిర్స్‌. దీని సాయంతో యూజర్ ఒకేసారి  రెండు యాప్‌లను ఆపరేట్ చెయ్చొచ్చు. అంటే ఫోన్ స్క్రీన్ మీద రెండు యాప్‌లు ఒకేసారి కనిసిస్తాయి. 


గేమర్స్ కోసం 

ఆండ్రాయిడ్ యూజర్స్‌ కోసం గూగుల్ ప్లే గేమ్స్ ద్వారా రకాల రకాల గేమ్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే స్టాడియా, ఎక్స్‌బాక్స్ కంపెనీలు అందించే గేమింగ్ అనుభూతిని అందివ్వలేవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఆండ్రాయిడ్‌ 12లో ప్రత్యేక గేమ్‌ మోడ్‌ను ఇస్తున్నారు. దీని ద్వారా ఓఎస్‌ను గేమింగ్ ప్రియులకు చేరువచెయ్యొచ్చని గూగుల్ భావిస్తోంది. 


థర్డ్‌ పార్టీ యాప్‌ స్టోర్

ప్లేస్టోర్, గెలాక్సి స్టోర్ తరహాలోనే థర్డ్‌పార్టీ యాప్‌ డెవలపర్స్ కోసం ఆండ్రాయిడ్ 12లో కొత్తగా ప్లేస్టోర్‌ను తీసుకొస్తున్నారు. ఇది మాల్‌వేర్ యాప్‌ల నుంచి యూజర్స్‌ని కాపాడుతుందని గూగుల్ భావిస్తోంది.


అలాంటి యాప్స్‌ కోసం 

 ఫోన్‌లో మెమొరీ సరిపోక ఇబ్బందులు ఎదుర్కొనే వారి కోసం ఆండ్రాయిడ్ 12లో పరిష్కారం చూపనున్నారు. ఇందుకోసం ‘హైబర్‌నేటెడ్’ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నారు. ఎక్కువగా ఉపయోగించని యాప్‌లను ఈ హైబర్‌నేటెడ్ జాబితాలో చేరుస్తారు. అయితే ఈ ఫీచర్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియరాలేదు. 


పిక్సెల్ ప్రత్యేకం 

ఇవి కాకుండా గూగుల్ పిక్సెల్ ఫోన్ల కోసం ఆండ్రాయిడ్ 12లో ప్రత్యేకంగా కొన్ని ఫీచర్స్‌ తీసుకొస్తున్నారు. వీటిలో డబుల్ ట్యాప్‌తో మ్యూజిక్‌ కంట్రోల్‌ చేయడం, ఫోన్ కెమెరా ఆటో రొటేషన్ ఫీచర్స్ ఉన్నాయి.  


విడుదల ఎప్పుడంటే 

గత నాలుగు సంవత్సరాలుగా ఆండ్రాయిడ్‌ కొత్త వెర్షన్లను ఆగస్టు, సెప్టెంబరుల్లో విడుదల చేశారు. అలానే ఈ ఏడాది కూడా ఆయా నెలల్లోనే ఆండ్రాయిడ్ 12ని విడుదల చేస్తారని భావించారు. కానీ కొవిడ్-19 పరిస్థితుల నేపథ్యంలో అక్టోబరు లేదా నవంబరు నెలలో విడుదల చేస్తారని అంచనా. బీటా వెర్షన్‌ని మాత్రం ఫిబ్రవరి చివరి వారం లేదా మార్చి రెండో వారంలో విడుదల చేస్తారని టెక్ వర్గాల అంచనా. 

Read latest Technology News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News. Subscribe our Telegram Channel.

Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

బిజినెస్

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని