WhatsApp: వాట్సాప్ కొత్త ఫీచర్‌.. మెసేజ్‌ ఎవరు పంపారో సులభంగా తెలుస్తుంది

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్ యూజర్స్‌కు అందుబాటులోకి రానుంది. దీని సాయంతో యూజర్స్‌ మెసేజ్ ఎవరు పంపారనేది సులభంగా తెలుసుకోవచ్చు.

Published : 06 Jan 2022 16:16 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాట్సాప్‌లో మన గురించి ఇతరులకు తెలిసేలా ప్రొఫైల్‌ ఫొటో/డీపీ (డిస్‌ప్లే పిక్చర్‌)గా ఫొటో, గ్రాఫిక్‌ ఇమేజ్‌ లేదా కొటేషన్స్ పెడుతుంటాం. తాజాగా వాట్సాప్‌ ఈ ఫీచర్‌లో కీలక అప్‌డేట్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఇకమీదట వాట్సాప్‌లో ఎవరి నుంచైనా మెసేజ్‌ వస్తే వారి ప్రొఫైల్‌ ఫొటో ఆండ్రాయిడ్ ఫోన్‌లోని లాక్‌ స్క్రీన్‌ నోటిఫికేషన్స్‌లో, ఐఫోన్‌లోని నోటిఫికేషన్‌ సెంటర్‌లో కనిపిస్తుంది. కొత్త ఏడాదిలో వాట్సాప్‌ నుంచి వస్తున్న మొదటి ఫీచర్‌ ఇదేనని టెక్‌ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఐఓఎస్‌ బీటా యూజర్స్‌కు అందుబాటులో ఉంది. త్వరలోనే పూర్తి స్థాయిలో యూజర్స్‌కు పరిచయం చేయనున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. వాట్సాప్‌లో మెసేజ్‌ నోటిఫికేషన్‌ తరహాలోనే ఈ ఫీచర్ పనిచేస్తుందని వాబీటాఇన్ఫో వెల్లడించింది. దీంతో ఎవరు మెసేజ్‌ పంపారనేది సులభంగా తెలుస్తుంది. గతంలో ఎవరైనా వాట్సాప్ మెసేజ్‌ పంపితే వారి నంబర్‌/పేరు, మెసేజ్ మాత్రమే కనిపించేవి. తాజాగా అప్‌డేట్‌తో వారి ప్రొఫైల్‌ ఫొటో కూడా కనిపిస్తుంది. 

ఇప్పటికే ప్రొఫైల్‌ ఫొటో ప్రైవసీకి సంబంధించి వాట్సాప్ కొత్త ఫీచర్‌ను పరిచయం చేసింది. ఈ ఫీచర్‌తో మన ప్రొఫైల్‌ ఫొటో ఎవరు చూడాలనేది మనమే నిర్ణయించవచ్చు. ఇందుకోసం వాట్సాప్‌ సెట్టింగ్స్‌లో ప్రైవసీలోకి వెళ్లి ప్రొఫైల్‌ ఫొటో ఫీచర్‌ ఓపెన్ చేస్తే అందులో ఎవ్రీవన్ (Everyone)‌, మై కాంటాక్ట్స్ (My Contacts)‌, నోబడీ (Nobody) అనే మూడు ఆప్షన్లు ఉంటాయి. వాటిలో ఎవ్రీవన్‌ సెలెక్ట్ చేస్తే ఎవరైనా మీ ప్రొఫైల్‌ ఫొటోను చూడొచ్చు. మై కాంటాక్ట్స్‌ సెలెక్ట్ చేస్తే మీ కాంటాక్ట్‌ లిస్ట్‌లోని వారు మాత్రమే చూస్తారు. నోబడీ సెలెక్ట్ చేస్తే మీ కాంటాక్ట్‌ లిస్ట్‌ వారితో సహా ఇతరులెవరూ డీపీని చూడలేరు. 2022లో వాట్సాప్ మరిన్ని కొత్త ఫీచర్స్‌ను యూజర్స్‌కు పరిచయం చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ జాబితాలో ఎమోజీ రియాక్షన్‌, కమ్యూనిటీస్‌, ట్రాన్స్‌స్క్రైబింగ్ వాయిస్ మెమొస్‌, డిలీట్ మెసేజ్ టైమ్‌ లిమిట్‌, గ్రూప్‌ అడ్మిన్‌లకు మెసేజ్‌ డిలీట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని