Windows 11: కొత్త విండోస్‌లో రంగులు మార్చే బగ్‌.. మైక్రోసాఫ్ట్ ఏం చెప్పిందంటే?

విండోస్‌ 11 ఓఎస్‌లో మరో కొత్త బగ్‌ను గుర్తించారు. దీని వల్ల వీడియో, ఫొటో ఎడిటర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. మైక్రోసాఫ్ట్ ఈ బగ్‌ను త్వరలో సరిచేస్తామని తెలిపింది.

Published : 29 Dec 2021 21:06 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మైక్రోసాఫ్ట్ కంపెనీ కొత్తగా తీసుకొచ్చిన విండోస్‌ 11 ఓఎస్‌ని వరుస బగ్‌లు వెంటాడుతున్నాయి. తాజాగా మరో కొత్త బగ్‌ను గుర్తించారు. దీని వల్ల హెచ్‌డీఆర్ మానిటర్స్‌లో వైట్‌ కలర్‌ బ్రైట్‌ ఎల్లోగా కనిపిస్తుందని పలువురు యూజర్స్‌ పేర్కొన్నారు. దీనివల్ల వీడియో, ఫొటో ఎడిటర్స్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారట. అయితే ఈ సమస్యపై మైక్రోసాఫ్ట్‌ స్పందించింది. ‘‘విండోస్‌ 11 ఇన్‌స్టాల్ చేసిన తర్వాత హెచ్‌డీఆర్‌ మానిటర్స్‌లో వైట్‌ కలర్‌ బ్రైట్‌ ఎల్లోగా కనిపిస్తున్నట్లు గుర్తించాం. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో విన్‌32ఏపీఐలు తప్పుగా సమాచారాన్ని కలర్ రెండరింగ్ ప్రోగ్రాంకు పంపడం వల్ల ఈ సమస్య తలెత్తుతోంది. అయితే అన్ని రంగుల్లో ఈ సమస్య ఉత్పన్నం కావడంలేదు. మేం ఈ సమస్యపై దృష్టి సారించాం. వీలైనంత త్వరలో ఈ బగ్‌ను సరిచేస్తాం. విండోస్‌ 11 సెట్టింగ్‌ పేజ్‌, మైక్రోసాఫ్ట్‌ కలర్‌ కంట్రోల్ ప్యానెల్‌లోని కలర్‌ ప్రొఫైల్ ప్రోగ్రాంలు సరిగా పనిచేస్తాయని భావిస్తున్నాం. అప్పటి వరకు యూజర్స్ వాటిని ఉపయోగించుకోవచ్చు ’’అని మైక్రోసాఫ్ట్ బ్లాగ్‌లో వెల్లడించింది.  

గత కొద్ది రోజులుగా విండోస్‌ 11లోని పలు బగ్‌ల గురించి యూజర్స్ ఫిర్యాదులు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికే స్నిపింగ్ టూల్‌, టచ్‌ కీ బోర్డు, వాయిస్‌ టైపింగ్‌, ఎమోజీ ప్యానెల్‌, ఎస్‌ మోడ్‌ వంటి ఫీచర్లకు సంబంధించిన బగ్‌లను మైక్రోసాఫ్ట్ సరిచేసింది. అలానే కొద్ది వారాల క్రితం విండోస్‌ 11తో పనిచేసే కంప్యూటర్‌లలోని ఏఎమ్‌డీ రైజెన్‌ ప్రాసెసర్‌ పనితీరును నెమ్మదింపచేస్తున్నట్లు యూజర్స్ ఆరోపించారు. దీంతో ఈ బగ్‌కు పరిష్కారంగా విండోస్‌ 11 బిల్డ్‌ 220000.282 అనే అప్‌డేట్‌ను విడుదల చేసింది. గత ఓఎస్‌లతో పోలిస్తే విండోస్‌ 11లో మైక్రోసాఫ్ట్ ఎన్నో ఆకర్షణీయమైన ఫీచర్స్‌ను తీసుకొచ్చింది. వాటిలో ఆండ్రాయిడ్ యాప్స్‌ని నేరుగా విండోస్‌ 11లో ఉపయోగించుకోవడంతోపాటు స్టార్ట్ మెనూ స్క్రీన్‌ మధ్యలో ఉంచడం వంటివి ఉన్నాయి. 

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని