AI&ML: బ్యాంకింగ్‌ సేవలు.. ఆరు మార్గాలు

సాంకేతిక అభివృద్ధి మానవ జీవన గమనాన్ని సులభతరం చేసింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI), మెషిన్‌ లెర్నింగ్‌ (ML) సాయంతో వినియోగదారులకు మరింత చేరువ..

Updated : 15 Jul 2022 20:15 IST

సాంకేతికత సాయంతో వినూత్న మార్పులు

ఇంటర్నెట్ డెస్క్‌: సాంకేతిక అభివృద్ధి మానవ జీవన గమనాన్ని సులభతరం చేసింది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (AI), మెషిన్‌ లెర్నింగ్‌ (ML) సాయంతో ఖాతాదారులకు మరింత చేరువ అయ్యేందుకు బ్యాంకులు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే హెచ్‌ఎస్‌బీసీ తన శాఖలో పెప్పర్‌ రోబోను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ రోబో బ్యాంకుకు వచ్చే ఖాతాదారుడిని ఆహ్వానించి అసిస్టెంట్‌గా ఏం కావాలో తెలుసుకుంటుంది. రోబోకు సాంకేతికత సాయంతో ఫేషియల్‌ రికగ్నిషన్‌ ఫీచర్‌ను అదనంగా జోడించడంతో మరింత మెరుగ్గా భావ వ్యక్తీకరణ చేస్తుంది. కరోనా కాలంలో టెక్నాలజీ ఎంతో సాయంగా నిలిచింది. లాక్‌డౌన్ వేళ అన్ని మూసేసినా ఆన్‌లైన్‌లో సేవలు అందడంతో చాలా మంది నిశ్చితంగా ఉండగలిగారు. 

సాధారణంగా మనుషుల చేసే పనులను  యంత్రాలతో చేయించేందుకు AI సాంకేతికత ఎంతో ఉపకరిస్తుంది. రానున్న కాలంలో వినియోగదారుడి భాషను అర్థం చేసుకోవడం, నిర్ణయాలు తీసుకోవడం, సమస్యలను పరిష్కరించడం వంటి పనులను రోబోలే చేయనున్నాయి. కేవలం విధులను నిర్వర్తించడమే కాకుండా అనుభవాల నుంచి నేర్చుకోవడం ఎలా అనేదానికి ML టెక్నాలజీ దోహదం చేస్తుంది. బ్యాంకింగ్‌ రంగంలో ఖాతాదారులకు సంబంధించిన సమాచారం ఉంటుంది. కంప్యూటర్లు ఆ డేటాను క్రమబద్ధీకరించడం, వర్గీకరించడం, విశ్లేషించడం చేయగలవు. ఖాతాదారుల మునుపటి ప్రవర్తన ఆధారంగా కంప్యూటర్‌ అంచనా వేస్తుంది. గతంలో నిర్ణయించిన ప్రమాణాల ఆధారంగా నిర్ణయాలు తీసుకోగలదు. 

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్‌ లెర్నింగ్‌ (ML)సాంకేతికతను కొంతమేర బ్యాంకుల్లో  చాలా సంవత్సరాలుగా వినియోగిస్తున్నారు. గత కొన్ని ఏళ్లుగా వినియోగదారులు బ్యాంకింగ్‌, ఆన్‌లైన్‌ సేవలపై ఎక్కువగా ఆధారపడటంతో చాలా బ్యాంకులు తమ శాఖలను తగ్గించుకున్నాయి. 2020లో కరోనా మహమ్మారి దెబ్బకు చాలా స్థానిక బ్యాంకులు తమ శాఖలను ఎక్కువ భాగం మూసేశాయి. దాదాపు 57 మిలియన్ల మంది మొబైల్‌ బ్యాంకింగ్ ఉపయోగిస్తున్నారని, తమ రోజువారీ బ్యాంకింగ్‌ పనులను పూర్తి చేయడానికి ఇదెంతో ఉపయుక్తమైందని పలువురు అధికారులు పేర్కొన్నారు. ప్రస్తుతం రోజువారీగా బ్యాంకింగ్‌ రంగంలో AI, ML సాంకేతికతను ప్రముఖంగా ఎనిమిది సేవల్లో వినియోగిస్తున్నారు. అవేంటో ఓసారి చూద్దామా....

టెలిఫోన్‌ బ్యాంకింగ్‌: మీరు ఎప్పుడైనా బ్యాంక్‌ కస్టమర్‌ సర్వీస్‌ నెంబర్‌కు కాల్‌ చేస్తే తప్పనిసరిగా మీ గుర్తింపును ధ్రువీకరించుకోవాలి. ప్రామాణికం కోసం పిన్‌ నంబర్‌ను గాని, మీ స్వరాన్ని గుర్తించడం వంటి వాటిని AI చేస్తుంది. అప్పుడే మీరు కస్టమర్‌ కేర్‌ ఏజెంట్‌తో మాట్లాడగలరు.

వెబ్‌సైట్లు, మొబైల్‌ బ్యాంకింగ్‌: ప్రస్తుతం చాలా బ్యాంకులు ఆన్‌లైన్‌, మొబైల్‌ బ్యాంకింగ్‌, యాప్స్‌తో లావాదేవీలను నిర్వహించుకునే అవకాశం కల్పించాయి. బిల్‌ పేమెంట్స్‌, సొమ్మును పంపడం, బ్యాలెన్స్‌ను చెక్‌ చేసుకోవడంలాంటివి. లావాదేవీలు భద్రంగా ఉండేలా చూసేందుకు AI సాంకేతికత ఉపయోగపడుతుంది. కొన్ని విదేశీ బ్యాంకులు ఖాతాను తెరిచేందుకు ఆన్‌లైన్‌లోనే అవకాశం కల్పించాయి.  గుర్తింపు కోసం ఒక్క సెల్ఫీ తీసుకుని అప్‌లోడ్‌ చేసేస్తే సరిపోతుంది. దీని వల్ల బ్యాంకు దగ్గరకు వెళ్లి రోజుల తరబడి వెరిఫికేషన్‌ కోసం సమయం వృథా చేయాల్సిన పని ఉండదు.

చాట్‌బాట్స్‌: బ్యాంక్‌ ఆన్‌లైన్‌ పోర్టల్‌గానీ, మొబైల్‌ యాప్‌ను ఓపెన్‌ చేస్తే AI సౌజన్యంలోని చాట్‌బాట్‌ స్వాగతం పలుకుతుంది. సమాచారం అందించడంలో సహాయ పడుతుంది. లావాదేవీలకు సంబంధించి ఏదైనా సమస్యను గురించి ప్రశ్నిస్తే వెంటనే రియల్‌టైమ్‌లో సమాధానాలు కూడా ఇస్తుంది. మీతో జరిపిన సంభాషణలను దాయడం వల్ల వ్యక్తిగత సేవలను మరింత మెరుగ్గా అందించేందుకు తోడ్పడుతుంది. మీకు అనువైన ఉత్పత్తుల గురించి సలహాలు, సూచనలు ఇస్తుంది.

రిటైల్‌ పేమెంట్స్‌: షాపింగ్‌ చేసి ఏదైనా పేమెంట్‌ చేయాలంటే క్రెడిట్‌, డెబిట్‌ కార్డులను ఎక్కువగా వాడుతుంటాం. అయితే ఈ మధ్య కాలంలో కాంటాక్ట్‌లెస్‌ షాపింగ్‌ చేస్తున్నాం. మొబైల్‌ యాప్‌ ద్వారానే చెల్లింపులు చేస్తున్నారు. గూగుల్‌ పే, ఫోన్‌పే వంటి యాప్‌ల ద్వారా బయోమెట్రిక్‌ ఫేస్‌, ఫింగర్‌ప్రింట్‌ స్కానింగ్‌ టెక్నాలజీతో భద్రంగా లావాదేవీలను నిర్వహించుకోవచ్చు.

రుణాలు ఇవ్వడం: ఒకప్పుడు రుణం కావాలంటే అదో పెద్ద తతంగం. కొద్ది మొత్తం కావాలన్నా బ్యాంకుకు వెళ్లి చాలా చోట్ల సంతకాలు పెట్టాల్సి ఉండేది. ఇప్పుడంతా ఆన్‌లైన్‌లోనే. క్రెడిట్‌ కార్డు, రుణాలు, మార్టిగేజ్‌ వంటి వాటి కోసం చాలా సంస్థలు ఆన్‌లైన్‌ బాటనే ఎంచుకుంటున్నాయి. AI టెక్నాలజీ సాయంతో ప్రాసెస్‌ అంతా బ్యాంకులు నిర్వర్తిస్తున్నాయి. రుణాలు ఇచ్చేవారు, తీసుకునేవారు వేగంగా నిర్ణయం తీసుకోవచ్చు.

పెట్టుబడులు: పెట్టుబడులు అంటే వెంటనే గుర్తుకొచ్చేవి స్టాక్‌ మార్కెట్లు. పెద్ద ఎత్తున డేటాను నిర్వహించే చాలా బ్యాంకులు షేర్‌ మార్కెట్లలో ఖాతాదారులతో పెట్టుబడులు పెట్టిస్తూ లాభాలను అందిస్తున్నాయి.  పరిశ్రమల్లో వచ్చే మార్పులను గమనిస్తూ మెరుగైన అంచనాలను కట్టడంలో AI సాంకేతిక ఎంతో ఉపయోగపడుతుంది. పెట్టుబడి దారులు ట్రేడ్స్‌ను నిశితంగా గమనిస్తూ లాభాలను ఆర్జించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని