6G Network: 5Gకి 50 రెట్ల వేగంతో 6G... ఎప్పుడొస్తుందంటే?

6జీ నెట్‌వర్క్‌ స్పీడు, ఫీచర్లు, ప్రత్యేకతలు మీ కోసం...

Updated : 06 Sep 2022 16:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  5G... ఇప్పుడు ప్రపంచంలో ఎక్కడ చూసినా  ఈ మాటే వినిపిస్తోంది. మొబైల్‌ నెట్‌వర్క్‌లో దీనినో విప్లవంగా చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే 5G మొబైల్స్‌ మన దేశంలోకీ వస్తున్నాయి. అయితే దేశంలో 5G అందుబాటులోకి రాకపోయినా... 6G ముచ్చట్లు మొదలయ్యాయి. 6G ఫీచర్లు, స్పీడ్‌ ఇవీ అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. అవేంటో చదివేయండి!

మన దేశంలో 5జీ సర్వీసులు వచ్చే ఏడాది కల్లా అందుబాటులోకి వస్తాయని సమాచారం. దీనిపై స్పష్టమైన సమాచారం లేనప్పటికీ... 6జీకి సంబంధించిన పనులు దేశంలో మొదలయ్యాయనేది తాజా సమాచారం. ఇప్పటివరకు వస్తున్న సమాచారం ప్రకారం చూస్తే... 5జీ కంటే 6జీ వేగం 50 రెట్లు అధికంగా ఉంటుందని తెలుస్తోంది. కొత్త తరం నెట్‌వర్క్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే చర్యలు ప్రారంభించిందట. 6జీ నెట్‌వర్క్‌కు సంబంధించిన సాంకేతిక అవకాశాలను పరిశీలించమని సీ-డాట్‌కు టెలీకామ్‌ డిపార్ట్‌మెంట్‌ (డాట్‌) ఆదేశించిందని తెలుస్తోంది. 

ఇప్పటికే  దక్షిణ కొరియా, చైనా, యూఎస్‌లో 5జీ అందుబాటులో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 6జీ సేవలను ప్రపంచ దేశాలతోపాటు మన దేశంలోనూ ఏక కాలంలో ప్రారంభించేలా కేంద్రం ప్రయత్నాలు చేస్తోందట. శాంసంగ్‌, ఎల్‌జీ, హువావే లాంటి సంస్థలు ఇప్పటికే 6జీ మీద ప్రయోగాలు చేస్తున్నాయని సమాచారం. టెక్‌ నిపుణుల అంచనా ప్రకారం 2028 - 2030 మధ్యలో 6జీ నెట్‌వర్క్‌ వినియోగదారులకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తొలుత జపాన్‌లో తీసుకొస్తారట. ఆ తర్వాత దక్షిణ కొరియా, చైనా, ఫిన్‌లాండ్‌లో వస్తుందని సమాచారం. 

ప్రస్తుతం దేశంలో విరివిగా వినియోగిస్తున్న 4 జీ నెట్‌వర్క్‌ వేగం 100 ఎంబీపీఎస్‌. అయితే వచ్చే ఏడాది అందుబాటులోకి వస్తుంది అంటున్న 5జీ వేగం 20 జీబీపీఎస్‌. ఇందులో డేటా డౌన్‌లోడ్‌ వేగం 3.7 జీబీపీఎస్‌. ఎయిర్‌టెల్‌, వీఐ, జియో చేసిన ప్రయోగాల్లో గరిష్ఠంగా డౌన్‌లోడ్‌ వేగం 3 జీబీపీఎస్‌ వరకు నమోదైంది. ఇక 6జీ స్పీడ్‌ చూస్తే... ఏకంగా 1000 జీబీపీఎస్‌ ఉంటుందని అంచనా వేస్తున్నారు. బెర్లిన్‌లో ఇటీవల ఎల్‌జీ 6జీ ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించింది. ఈ క్రమంలో 6జీబీ మెమొరీ ఉన్న ఓ సినిమాను 6జీ నెట్‌వర్క్‌పై 51 సెకన్లలోనే డౌన్‌లోడ్‌ చేశారట. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని