WhatsApp: వాట్సాప్‌ ఖాతాను నిషేధించారా..? ఇలా పునరుద్ధరించుకోండి! 

నకిలీ వాట్సాప్‌ ఖాతాలను ఉపయోగిస్తున్నారనే కారణంతో వాట్సాప్‌ పలువురు యూజర్స్ ఖాతాలపై నిషేధం విధిస్తుంది. దీంతో ఈ ఖాతాల పునురుద్ధరణ చేసుకునేందుకు సైబర్‌ నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. అవేంటో చూద్దాం. 

Updated : 06 Dec 2021 06:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాట్సాప్‌ (WhatsApp) ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు తీసుకొస్తున్నప్పటికీ.. నకిలీ వాట్సాప్‌లలో ఉండే అదనపు ఫీచర్స్‌ కోసం కొంతమంది యూజర్స్‌ వాటిని ఉపయోగిస్తూనే ఉన్నారు. దీంతో నకిలీ వాట్సాప్‌లను ఉపయోగించే యూజర్స్ ఖాతాలపై వాట్సాప్ తాత్కాలికంగా నిషేధం విధిస్తుంది. అయితే ఈ నకిలీ వాట్సాప్‌లను వినియోగం డేటా ప్రైవసీకి భంగం కలిగిస్తుందని సైబర్‌ నిపుణులు పేర్కొన్నారు. ఇవి వాట్సాప్‌లో ఉండే ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ భద్రతను కలిగి ఉండవని వెల్లడించారు. అందుకే వాట్సాప్‌ ప్లస్‌ (WhatsApp Plus), జీబీ వాట్సాప్‌ (GB WhatsApp) వంటి వాటిని ఉపయోగించవద్దని సూచిస్తున్నారు. మరి ఈ నకిలీ వాట్సాప్‌ ఉపయోగించే యూజర్స్‌ ఖాతాలపై వాట్సాప్ నిషేధం విధిస్తే ఎలా? తిరిగి సాధారణ వాట్సాప్‌ ఖాతా ఎలా పొందాలనేది తెలుసుకుందాం. 

* తెలిసో, తెలియక మీరు నకిలీ వాట్సాప్‌లను ఉపయోగిస్తుంటే మీ ఖాతా వాట్సాప్‌ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు భావించి దానిపై తాత్కాలిక నిషేధం విధిస్తుంది. ఇలాంటి సందర్భాల్లో పూర్తి నిషేధం విధించకుండా వాట్సాప్‌ ఖాతాను పునరుద్ధరించుకోవచ్చు. 

* నకిలీ వాట్సాప్‌ యాప్‌లను ఉపయోగిస్తూ.. ఖాతా నిషేధానికి గురైతే, ఒరిజినల్‌ వాట్సాప్ ఖాతాను డౌన్‌లోడ్ చేసే ముందుగా చాట్ హిస్టరీ బ్యాకప్‌ చేసుకోమని టెక్ నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం నకిలీ వాట్సాప్‌లో సెట్టింగ్స్‌ > హెల్ప్ > యాప్‌ ఇన్ఫోపై క్లిక్ చేయాలి. 

* అందులో తాత్కాలికంగా నిషేధం విధించిన టైమ్‌ అయ్యేవరకు చూడాలి. తర్వాత చాట్ > బ్యాకప్ చాట్‌పై క్లిక్ చేయాలి. బ్యాకప్ పూర్తయిన తర్వాత ఫోన్‌ సెట్టింగ్స్‌ > స్టోరేజ్‌ > ఫైల్స్‌పై క్లిక్ చేయాలి. అందులో జీబీ వాట్సాప్‌ లేదా వాట్సాప్ ప్లస్ అనే ఫోల్డర్‌ కనిపిస్తుంది. 

* దాన్ని సెలెక్ట్ చేసిన తర్వాత కుడివైపు పైభాగంలో మోర్ ఆప్షన్‌పై క్లిక్ చేస్తే రీనేమ్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ఫోల్డర్ పేరును వాట్సాప్‌గా మార్చాలి. 

* ఈ ప్రక్రియ పూర్తియిన తర్వాత గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఒరిజినల్ వాట్సాప్ డౌన్‌లోడ్  చేసుకోవాలి. అందులో మీ ఫోన్ నంబర్ వెరిఫై చేసిన తర్వాత బ్యాకప్‌పై క్లిక్ చేస్తే రీస్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే మీరు బ్యాకప్‌ చేసిన చాట్ హిస్టరీ మొత్తం రీస్టోర్ అవుతుంది. అలా మీరు తిరిగి మీ ఒరిజినల్ వాట్సాప్‌ను పొందొచ్చు. 

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని