WhatsApp: వీడియోకాలింగ్‌కు వాట్సాప్‌ కొత్త ‘అవతార్’‌!

మెటా కంపెనీ తన సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో సరికొత్త ఫీచర్స్‌ను యూజర్లకు పరిచయం చేస్తోంది. తాజాగా మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌లో కూడా అవతార్‌ ఫీచర్‌ను పరిచయం చేయనుంది.

Published : 30 Jun 2022 17:14 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మెటా (Meta) కంపెనీ తన సోషల్‌ మీడియా ఫ్లాట్‌ఫామ్‌లలో సరికొత్త ఫీచర్స్‌ను యూజర్లకు పరిచయం చేస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో యూజర్ల కోసం ఇన్‌స్టాగ్రామ్‌ (Instagram)లో అవతార్‌ ఫీచర్‌ను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp)లో కూడా అవతార్‌ ఫీచర్‌ను పరిచయం చేయనుంది. యూజర్లు వీడియోకాల్‌ చేసే సమయంలో వీటిని ఉపయోగించుకోవచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్‌ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) వెల్లడించింది.

అవతార్‌ ఫీచర్‌ ఎలా..? 

ఈ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత యూజర్లు వీడియో కాల్ చేసినప్పుడు స్క్రీన్‌ మీద స్విచ్‌ టు అవతార్‌ (Swith To Avatar) అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే యూజర్‌ ప్రొఫైల్ ఫొటో స్థానంలో యానిమేటెడ్‌ అవతార్‌ కనిపిస్తుంది. అంటే యూజర్లు వీడియోకాల్ చేసేప్పుడు ప్రొఫైల్‌ ఫొటో స్థానంలో యానిమేటెడ్ అవతార్‌లను రీప్లేస్‌ చేసుకోవచ్చు. ఇవి 2డీ లేదా 3డీ రూపంలో ఉంటాయని సమాచారం. ఈ ఫీచర్‌తో యూజర్లు సరికొత్త వీడియో కాలింగ్ అనుభూతి పొందుతారని వాట్సాప్‌ భావిస్తోంది. ఇప్పటికే గూగుల్ డ్యుయో వీడియో కాలింగ్‌లో యానిమేటెడ్‌ అవతార్‌లతోపాటు ఫిల్టర్‌ ఫీచర్లను అందిస్తోంది.       

ఖాతా బ్యాన్‌ అయిందా..?

వాట్సాప్‌ ద్వారా జరిగే మోసాలు, వేధింపులను కట్టడి చేసేందుకు నకిలీ ఖాతాలను గుర్తించి తొలగిస్తుంది. అయితే వీటిలో కొన్ని ఖాతాలను వాట్సాప్‌లోని ఏఐ ఆధారిత వ్యవస్థ తొలగిస్తుంటుంది. కొన్నిసార్లు యూజర్లు వాట్సాప్‌ నిబంధనలు అతిక్రమించనప్పటికీ ఇతర యూజర్ల నుంచి అందిన ఫిర్యాదుల ఆధారంగా ఖాతా తొలగింపు ప్రక్రియ జరుగుతుంది. ఇలాంటి సందర్భాల్లో తమ అకౌంట్‌లను పునరుద్ధరించమని కోరేందుకు వీలుగా ఖాతాదారులకు కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం ఖాతాదారులు వాట్సాప్‌కు కొన్ని ప్రాథమిక ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. వాటిని వెరిఫై చేసిన అనంతరం వాట్సాప్‌ ఖాతాలను పునరుద్ధరిస్తుంది. ముందుగా ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకొస్తారని సమాచారం.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని