Whatsapp: వాట్సాప్‌లో ఇక పేమెంట్స్‌ మరింత సులువు... ఛాట్‌ చేసినంత ఈజీగా!

యూపీఐ పేమెంట్స్‌ చేసే సౌలభ్యం మరింత సులభతరం చేసింది వాట్సాప్‌.

Published : 01 Oct 2021 02:13 IST

దిల్లీ: వాట్సాప్‌ ద్వారా యూపీఐ పేమెంట్స్‌ చేసే సౌలభ్యం ఇది వరకే అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ సౌకర్యాన్ని మరింత సులభతరం చేసింది వాట్సాప్‌. ఇంతకుముందు ఎవరికైనా వాట్సాప్‌ ద్వారా పేమెంట్‌ చేయాలంటే సంబంధిత ఛాట్‌లోకి వెళ్లి.. పిన్‌ సింబల్‌ క్లిక్‌ చేసి పేమెంట్స్‌లోకి వెళ్లాల్సి వచ్చేది. ఇకపై ఛాట్‌ కంపోజర్‌లోనే రూపీ సింబల్‌ను క్లిక్‌ చేయడం ద్వారా పేమెంట్స్‌ను పూర్తి చేయొచ్చని వాట్సాప్‌ తెలిపింది. అంతేకాకుండా వాట్సాప్‌లో కెమెరాను ఉపయోగించి ఇకపై క్యూఆర్‌ కోడ్లను కూడా స్కాన్‌ చేయొచ్చని పేర్కొంది. ఈ మేరకు వాట్సాప్‌ ఇండియా డైరెక్టర్స్‌ మనేశ్‌ మహాత్మే ఓ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఈ విషయాన్ని వెల్లడించారు. రోజూ వాట్సాప్‌ యూజర్లు వందలాది సందేశాలు పంపుకుంటున్నట్లే.. సులువుగా పేమెంట్లు చేసేందుకు వీలుగా రూపీ సింబల్‌ను యాడ్‌ చేసినట్లు తెలిపారు. త్వరలో అందరికీ ఈ సదుపాయం అందుబాటులోకి రానుందని చెప్పారు.

పేమెంట్స్‌ సేవలను ప్రారంభించేందుకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ (ఎన్‌పీసీఐ) వాట్సాప్‌కు గతేడాది అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. దీంతో తొలుత 20 మిలియన్‌ మందికి యూపీఐ చెల్లింపుల సదుపాయం కల్పిస్తున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. ఈ సంఖ్యను దశలవారీగా పెంచుతామని మహాత్మే తెలిపారు. అలాగే, త్వరలో కొన్ని మార్కెటింగ్‌ ప్రయత్నాలను కూడా మొదలు పెట్టనున్నామని ఈ సందర్భంగా చెప్పారు. గత కొద్దిరోజులుగా వాట్సాప్‌లో కూడా గూగుల్‌ ప్లే తరహాలో స్క్రాచ్‌ కార్డులు తీసుకొస్తారని వార్తలు వస్తున్నాయి. వాటికి బలం చేకూరుస్తూ తాజాగా ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో వాట్సాప్‌లో కూడా త్వరలో స్క్రాచ్‌ కార్డులు కూడా రాబోతున్నాయని తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని