Messaging Apps: వాట్సాప్‌ వద్దనుకుంటున్నారా..?ప్రత్యామ్నాయాలు ఇవిగో..!

వాట్సాప్‌కు బదులుగా పలువురు ఇతర యాప్‌ల వైపు చూస్తున్నారు. వీరిలో మీరూ ఉన్నట్లయితే..

Published : 18 Feb 2022 13:55 IST

గతేడాది వాట్సాప్‌ తీసుకొచ్చిన కొత్త ప్రైవసీ నిబంధనలపై తీవ్రస్థాయిలో వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో వెనక్కి తగ్గిన వాట్సాప్‌ కొత్త ప్రైవసీ నిబంధనల్లో మార్పు చేసింది. ప్రైవసీ నిబంధనలను ఓకే చేయాలా?వద్దా అనేది వినియోగదారులకు వదిలేసింది. అయినప్పటికీ వాట్సాప్‌కు బదులుగా పలువురు ఇతర యాప్‌ల వైపు చూస్తున్నారు. వ్యక్తిగత భద్రతను దృష్టిలో పెట్టుకొని ప్రత్యామ్నాయాల కోసం అన్వేషిస్తున్నారు. వీరిలో మీరూ ఉన్నట్లయితే ఇది మీ కోసమే.. 

సిగ్నల్

ఎలాన్‌ మస్క్‌ ట్వీట్‌తో సిగ్నల్‌ (Signal) యాప్‌కు మంచి ఆదరణ లభించింది. యాప్‌లో స్క్రీన్‌షాట్‌లు తీసుకోకుండా స్క్రీన్‌ సెక్యూరిటీ వంటి ఫీచర్లతో ఈ యాప్‌ అధిక రక్షణ కల్పిస్తుంది. పైగా ప్రకటనల కోసం ఎవరూ ఎలాంటి డీల్‌ చేసుకోలేరు. గరిష్ఠంగా 40 మంది యాక్టివ్‌ యూజర్లతో సురక్షితంగా వీడియో కాల్స్‌ మాట్లాడుకోవచ్చు. వాట్సాప్‌ వంటి మెసేజింగ్‌ యాప్‌లలో ఒకేసారి 8 మంది సభ్యులతో మాత్రమే వీడియో కాల్‌ చేసుకోవచ్చు.


టెలిగ్రామ్

వాట్సాప్‌కు ప్రస్తుతానికి గొప్ప పోటీదారు టెలిగ్రామ్ ‌(Telegram) మాత్రమే. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. టెలిగ్రామ్‌లో గరిష్టంగా లక్ష మంది వ్యక్తులతో పబ్లిక్ ఛానెల్‌లు, సూపర్ గ్రూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. ఫలానా తేదీ తర్వాత వాటంతటవే అదృశ్యమయ్యేలా ఇందులో సందేశాలు పంపుకోవచ్చు. సరదా మినీ-గేమ్స్‌ కూడా ఈ యాప్‌లో అందుబాటులో ఉన్నాయి. పైగా వినియోగదారుల సంభాషణలకు ట్రిపుల్‌ లేయర్‌ కాన్ఫిగరేషన్‌ భద్రత ఉంటుంది. అయితే, టెలిగ్రామ్‌లో వీడియో కాలింగ్ ఫీచర్ లేకపోవడం కాస్త ఆలోచించాల్సిన విషయం.


ఐమెసేజ్‌

యాపిల్‌ ఐఫోన్‌ వినియోగదారులకు ఐమెసేజ్‌ (iMessage) యాప్‌ ఇన్‌బిల్ట్‌గా లభిస్తుంది. ఇది ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లు, మెరుగైన ఇంటర్‌ఫేస్‌తో అప్‌డేట్‌ అవుతుంది. భావోద్వేగాలను తెలియజేయడానికి మెమోజీలనూ క్రియేట్ చేసుకోవచ్చు. ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్ట్ ద్వారా మీ సంభాషణలకు పూర్తి భద్రత లభిస్తుంది. మొత్తంగా చెప్పాలంటే ఇది పూర్తిగా వాట్సాపే.


డిస్‌కార్డ్

ఒకప్పుడు డిస్‌కార్డ్ (Discord) యాప్‌ను గేమర్ల కోసమే తీర్చిదిద్దారు. కానీ, ఇప్పుడు చాలా మంది రోజువారీ పనుల కోసం దీనిని వినియోగిస్తున్నారు. వాయిస్‌ మేసేజ్‌లు, జిఫ్‌లు, ఎమోట్‌, ఎమోజీలతో పాటు ఇతర డాక్యుమెంట్లను ఇతర యూజర్లతో పంచుకోవచ్చు. ఈ మేరకు ఒక సందేశాన్ని 8ఎంబీ వరకు షేర్‌ చేయవచ్చు. డిస్‌కార్డ్‌ నైట్రో (Discord nitro) యాప్‌లో సబ్‌స్క్రిప్షన్‌ తీసుకుంటే ఈ పరిమితి 100ఎంబీ వరకు ఉంటుంది.


గూగుల్‌ చాట్‌

గూగుల్‌ చాట్‌ (Google Chat)ను యాక్సెస్‌ చేయడం చాలా సులువు. యాప్ సరిగ్గా వాట్సాప్‌ వలె పని చేస్తుంది. వన్‌ క్లిక్ మీటింగ్‌లు, ఫైల్ షేరింగ్, సులభంగా ఖాతా మార్పిడి వంటి వాటిని ఈజీగా షెడ్యూల్ చేయడానికి గూగుల్ చాట్‌ అనుమతిస్తుంది.


బ్రిడ్జ్‌ఫై

బ్రిడ్జ్‌ఫై (Bridgefy) అనేది పూర్తి ఆఫ్‌లైన్‌ మెసేజింగ్‌ యాప్‌. పీర్-టు-పీర్ బ్లూటూత్ మెష్ నెట్‌వర్క్‌ ద్వారా 330 అడుగుల వరకు సందేశాలను పంపవచ్చు. యాప్‌ డౌన్‌లోడ్ చేయడానికి తప్పితే దీన్ని వాడటానికి ఎటువంటి ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు. పని ప్రాంతాల్లో సౌకర్యవంతంగా ఉన్నప్పటికీ.. మీ పరిధిలో ఇతర బ్రిడ్జ్‌ఫై వినియోగదారులు లేకుంటే ఇది నిష్ప్రయోజనమే.


కిక్‌

కిక్‌ (Kik) మెసేజింగ్ యాప్‌ని యాక్టివేట్ చేయడానికి మొబైల్ నంబర్ అవసరం లేదు. కేవలం ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేస్తే చాలు. వాయిస్ కాల్‌లు, స్టిక్కర్లు, మీడియా షేరింగ్, గ్రూప్ చాట్‌ల ఇది మద్దతు నిస్తుంది.

- ఇంటర్నెట్‌ డెస్క్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని