WhatsApp: 17 లక్షల భారతీయఖాతాలపై వాట్సాప్ నిషేధం.. కారణమిదే!

వాట్సాప్‌ భారత యూజర్లకు షాకిచ్చింది. సుమారు 17 లక్షల ఖాతాలపై నిషేధం విధించింది. ఈ మేరకు వాట్సాప్ రూపొందించిన యూజర్ సేఫ్టీ రిపోర్ట్‌లో ఈ విషయాన్ని వెల్లడించింది. 

Updated : 02 Jan 2022 19:37 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: భారతీయ యూజర్లకు వాట్సాప్‌ షాకిచ్చింది. సుమారు 17,59,000 వాట్సాప్ ఖాతాలపై నిషేధం విధించింది. అశ్లీల సమాచారం, నకిలీ వార్తల వ్యాప్తి, యూజర్స్‌ నుంచి అందిన ఫిర్యాదులు, వినతులు ఆధారంగా భారత ఐటీ నిబంధనలను అనుసరించి చర్యలు తీసుకున్నట్లు వాట్సాప్‌ తెలిపింది. ఈ ఖాతాలన్నీ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు గుర్తించామని వాట్సాప్‌ వెల్లడించింది. 

‘‘ 2021 భారత ఐటీ నిబంధనలను అనుసరించి 2021 నవంబరు నెలలో ఆరు నెలలకు సంబంధించి యూజర్‌ సేఫ్టీ రిపోర్టును పబ్లిష్ చేశాం. ఇందులో యూజర్స్ నుంచి అందిన ఫిర్యాదులు, వాటిపై వాట్సాప్ తీసుకున్న చర్యలు, యూజర్స్‌ భద్రతకు వాట్సాప్‌ ముందుస్తుగా తీసుకున్న చర్యలకు సంబంధించిన వివరాలు ఉన్నాయి’’ అని వాట్సాప్‌ తెలిపింది. 2021 అక్టోబరులో కూడా సుమారు 2 మిలియన్‌ ఖాతాలపై వాట్సాప్ నిషేధం విధించింది. మొత్తంగా 2021లో సుమారు 400 మిలియన్ల భారతీయ ఖాతాలపై వాట్సాప్ నిషేధం విధించింది. 

వాట్సాప్‌ను ఉపయోగించే యూజర్స్‌కు భద్రతపరంగా మెరుగైన సేవలందించేందుకు ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ రక్షణ కల్పిస్తున్నట్లు కంపెనీ తెలిపింది. అలానే త్వరలో ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), కటింగ్-ఎడ్జ్‌ టెక్నాలజీ ఆధారిత సేవలను పరిచయం చేయనున్నట్లు వెల్లడించింది. వాట్సాప్‌ నిషేధించిన 95 శాతం ఖాతాలు చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామని తెలిపింది. వీటిలో స్పామ్‌ మెసేజ్‌లు, బల్క్‌ మెసేజ్‌లు పంపే ఖాతాలు ఎక్కువగా ఉన్నాయని నివేదికలో పేర్కొంది.

2021 నవంబరులో సుమారు 602 ఖాతాలపై ఫిర్యాదులు అందగా, వాటిలో 149 ఖాతాలు సహాయం కోసం, 357 ఖాతాలపై బ్యాన్ అప్పీల్, 48  ఖాతాలు ప్రొడక్ట్ సపోర్ట్ కోసం, 27 ఖాతాలపై భద్రతపరమైన చర్యలకు సంబంధించి వినతులు అందినట్లు వాట్సాప్‌ రిపోర్టులో వెల్లడించింది. భారత ఐటీ నిబంధనల ప్రకారం 5 మిలియన్‌ యూజర్స్‌ ఉన్న ప్రతి కంపెనీ నెలవారీ రిపోర్ట్‌ను పబ్లిష్ చేయడంతోపాటు యూజర్స్ నుంచి వచ్చే ఫిర్యాదులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారనే వివరాలను అందులో పొందుపరచాలి.

Read latest Tech & Gadgets News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని