Pegasus: వాట్సాప్‌ ఏమందంటే..?

పెగాసస్‌ స్పైవేర్ భారత్‌తో సహా పలు దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని సాయంతో భారత్‌లో జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతల ఫోన్లు హ్యాక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీన్ని సైబర్ ఆయుధంగా ఉపయోగిస్తున్నారని, దీనివల్ల యూజర్‌ గోప్యతకు...

Published : 19 Jul 2021 21:39 IST

ఇంటర్నెట్‌డెస్క్: పెగాసస్‌ స్పైవేర్ భారత్‌తో సహా పలు దేశాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. దీని సాయంతో భారత్‌లో జర్నలిస్టులు, సామాజిక కార్యకర్తలు, కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతల ఫోన్లు హ్యాక్ చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దీన్ని సైబర్ ఆయుధంగా ఉపయోగిస్తున్నారని, దీనివల్ల యూజర్‌ గోప్యతకు భంగం కలుగుతుందని, ఈ స్పైవేర్‌ సేవలను నిలిపివేయాలని పలు టెక్ కంపెనీలు డిమాండ్ చేస్తున్నాయి. తాజాగా దీనిపై వాట్సాప్ చీఫ్ విల్ కాత్‌కార్ట్ స్పందించారు.

పెగాసస్ వంటి స్పైవేర్‌ను కట్టడి చేసి, యూజర్ భద్రతను పెంచేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న మానవహక్కుల కార్యకర్తలు, టెక్ సంస్థలు, ప్రభుత్వాలు కలిసి పనిచేయాలని కోరారు. ఈ మేరకు ఆయన వరుస ట్వీట్లు చేశారు. ‘‘2019లోనే మేం ఎన్‌ఎస్‌వో సంస్థపై ఫిర్యాదు చేశాం. దీనికోసం అప్పట్లో మేం సిటిజన్ ల్యాబ్‌తో కలిసి పనిచేసి 20కి పైగా దేశాల్లో సుమారు వందకిపైగా మానవ హక్కుల కార్యకర్తలు, జర్నలిస్టుల వాట్సాప్‌ ఖాతాలు హ్యాక్‌ గురైనట్లు గుర్తించాం. తాజా సమాచారం ప్రకారం ఈ సంఖ్య పెరగడం ఆందోళన కలిగిస్తోంది’’ అని ట్వీట్‌లో పేర్కొన్నారు. 

ఎన్‌ఎస్‌వో వంటి సంస్థలకు వ్యతిరేకంగా తమ స్వరాన్ని వినిపించినందుకు మైక్రోసాఫ్ట్, గూగుల్, సిస్కో, వీఎంవేర్, ఇంటర్నెట్ అసోసియేషన్‌లకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది మొబైల్ ఫోన్‌ను ప్రధాన కంప్యూటర్‌లా ఉపయోగిస్తుంటారు. దాని భద్రతకు సంబంధించి టెక్ కంపెనీలు, ప్రభుత్వాలు మరిన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది’’ అని మరో ట్వీట్‌లో వెల్లడించారు. అందుకే వాట్సాప్‌ ఎల్లప్పుడూ  ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ను సపోర్ట్ చేస్తుందని తెలిపారు. 

పెగాసస్‌ స్పైవేర్ సాయంతో వివిధ దేశాల్లోని జర్నలిస్టులు, రాజకీయనాయకులు, సీఈవోలు, సామాజిక కార్యకర్తల ఫోన్లను హ్యాక్ చేసినట్లు ది వైర్‌ పత్రికతో సహా పలు అంతర్జాతీయ పత్రికలు కథనాలను ప్రచురించాయి. దీంతో మరోసారి పెగాసస్‌ను కట్టడి చేయాలంటూ ఫేస్‌బుక్, వాట్సాప్‌ వంటి సంస్థలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే తమపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని ఎన్‌ఎస్‌వో గ్రూపు వాదిస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని