WhatsApp: వాట్సాప్‌ కొత్త ఫీచర్‌‌.. మీ నంబర్‌కు మీరే మెసేజ్‌ చేసేలా!

వాట్సాప్‌ సెల్ఫ్‌ మెసేజింగ్ అనే ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. మరి ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందో తెలుసుకుందాం...

Published : 01 Sep 2022 19:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌లో సెల్ఫ్‌ మెసేజ్‌ పంపాలన్నా, నోట్‌ రాసుకోవాలన్నా లేదా ఏదైనా సమాచారం సేవ్‌ చేసుకోవాలన్నా.. డమ్మీ గ్రూపు క్రియేట్ చేసుకుని దాన్ని నోట్‌పాడ్‌లా వాడుకునే వాళ్లు. దీనికి ప్రత్యామ్నాయంగా వాట్సాప్‌ సెల్ఫ్‌ మెసేజింగ్ అనే ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేయనుంది. ఇకపై డమ్మీ గ్రూపు క్రియేట్ చేయకుండా యూజర్లు తమ నంబర్‌ నుంచి తమ వాట్సాప్‌ ఖాతాకే మెసేజ్‌ చేసుకోవచ్చు. డమ్మీ గ్రూపుతో పాటు చాలా మంది యూజర్లు తమ నంబర్‌ను కాంటాక్ట్ లిస్ట్‌లో సేవ్‌ చేసుకుని దాని ద్వారా నోట్‌ లేదా సెల్ఫ్‌ మెసేజింగ్ చేసేవారు. మల్టీడివైజ్‌ ఫీచర్‌ వచ్చిన తర్వాత ఈ విధానం ఉపయోగించడం సాధ్యపడటంలేదు. ఈ నేపథ్యంలోనే వాట్సాప్‌ సెల్ఫ్‌ మెసేజింగ్ ఫీచర్‌ను తీసుకొస్తుంది. ముందుగా ఈ ఫీచర్‌ను డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో పరిచయం చేయనున్నట్లు సమాచారం. 

ఎలా పనిచేస్తుంది?

యూజర్‌ డెస్క్‌టాప్‌లో లాగిన్‌ అయిన తర్వాత, మల్టీడివైజ్‌ ఫీచర్‌ ద్వారా మరో డివైజ్‌ (ఫోన్‌, ట్యాబ్‌, పీసీ) నుంచి లాగిన్‌ అయినప్పుడు, డెస్క్‌టాప్‌ చాట్‌ లిస్ట్‌లో యూజర్‌ ఫోన్‌ నంబర్‌ కనిపిస్తుందట. దానిపై క్లిక్ చేసి సెల్ఫ్‌ మెసేజింగ్‌ చేయొచ్చని వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో తెలిపింది. ప్రస్తుతం పరీక్షల దశలోఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్‌ త్వరలో ఒకే ఖాతాను రెండు వేర్వేరు ఫోన్లలో ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించనుంది. ఈ ఫీచర్‌ ద్వారా సెల్ఫ్ మెసేజింగ్ ఫీచర్‌ను ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్లకు పరిచయం చేయనుంది.

బగ్‌ రిపోర్ట్‌, సబ్‌స్క్రిప్షన్‌ వెర్షన్‌

దీంతోపాటు వాట్సాప్‌ రిపోర్ట్‌ బగ్‌ పేరుతో మరో కొత్త ఫీచర్‌ యూజర్లకు అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉన్న ఈ ఫీచర్‌ ద్వారా యూజర్లు యాప్‌లో తాము గుర్తించిన లోపాలను సెట్టింగ్స్‌లోకి వెళ్లి  వాట్సాప్‌కు ఫిర్యాదు చేయొచ్చు. ఇదేకాకుండా మెటా సంస్థ వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్‌ సబ్‌స్క్రిప్షన్‌ వెర్షన్లను తీసుకొస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే స్నాప్‌చాట్ (స్నాప్‌చాట్+), ట్విటర్‌ (ట్విటర్‌ బ్లూ)లు ఈ తరహా సేవలను అందిస్తున్నాయి. సబ్‌స్క్రిప్షన్ వెర్షన్ల ద్వారా యూజర్లు కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను ఆయా సంస్థలు అందిస్తున్నాయి.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని