Whatsapp Down: వాట్సాప్‌ బ్యాక్‌.. 2 గంటల తర్వాత సేవలు అందుబాటులోకి

వాట్సాప్‌ సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి తిరిగి సేవలు అందుబాటులోకి వచ్చాయి.

Updated : 25 Oct 2022 15:21 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ (WhatsApp) సేవలు తిరిగి ప్రారంభం అయ్యాయి. మధ్యాహ్నం 2.30 గంటల నుంచి తిరిగి సేవలు అందుబాటులోకి వచ్చాయి. దాదాపు 2 గంటల పాటు సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు అసౌకర్యానికి లోనయ్యారు. సేవలు తిరిగి ప్రారంభమయ్యాయని, అసౌకర్యానికి చింతిస్తున్నామంటూ వాట్సాప్‌ యూజర్లకు క్షమాపణ చెప్పింది. అయితే, సేవలు నిలిచిపోవడానికి గల కారణాన్ని మాత్రం వెల్లడించలేదు. 

మంగళవారం మధ్యాహ్నం 12.30 నుంచి వాట్సాప్‌ సేవలపై ఫిర్యాదులు మొదలయ్యాయి. గ్రూపుల్లో మెసేజులు వెళ్లడం లేదని, వ్యక్తిగత మెసేజులు పంపిస్తే బ్లూటిక్‌ రావడం లేదని పలువురు వినియోగదారులు సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేశారు. వాట్సాప్‌ వెబ్‌కి కనెక్ట్‌ చేస్తున్నప్పుడు ‘కనెక్టింగ్‌’ అని కొన్నిసార్లు, నెట్‌వర్క్‌ కనెక్టివిటీ లేదు అని కొన్నిసార్లు వస్తున్నట్లు యూజర్లు పేర్కొన్నారు.

భారత్‌ సహా ఇతర దేశాల్లోనూ వాట్సాప్‌ సేవలకు అంతరాయం ఏర్పడింది. యూజర్ల ఫిర్యాదు నేపథ్యంలో సేవల అంతరాయంపై వాట్సాప్‌ మాతృ సంస్థ మెటా స్పందించింది. సేవలను పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తున్నామని తెలిపింది. కాసేపటి తర్వాత సేవలు పునరుద్ధరించినట్లు పేర్కొంది. మరోవైపు వాట్సాప్‌ పనిచేయకపోవడంపై నెటిజన్లు ఫన్నీ మీమ్స్‌ సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేశారు. వాట్సాప్‌ యూజర్లంతా ట్విటర్‌ వైపు పరుగులు తీస్తున్నారని ఒకరు కామెంట్‌ పెడితే.. వాట్సాప్‌కు గ్రహణం పట్టిందంటూ మరొకరు ట్వీట్‌ చేశారు.








Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని