WhatsApp Updates: ఈ ఫోన్లలో వాట్సాప్ సేవలు బంద్‌.. 23 లక్షల ఖాతాలపై నిషేధం!

ఐఫోన్‌, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఓల్డ్‌ వెర్షన్‌ ఓఎస్‌లను ఉపయోగిస్తున్న యూజర్లకు చేదువార్త. అక్టోబరు నెల నుంచి కొన్ని పాత ఫోన్లలో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయి...

Updated : 03 Sep 2022 11:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐఫోన్‌, ఆండ్రాయిడ్ ఫోన్లలో ఓల్డ్‌ వెర్షన్‌ ఓఎస్‌లను ఉపయోగిస్తున్న యూజర్లకు చేదువార్త. అక్టోబరు నెల నుంచి కొన్ని పాత ఫోన్లలో వాట్సాప్‌ సేవలు నిలిచిపోనున్నాయి. భద్రత, గోప్యత, ఫీచర్ల పరంగా యూజర్లకు అత్యాధునిక సాంకేతికతను అందించడంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వాట్సాప్ తన సపోర్ట్‌ పేజీలో పేర్కొంది. ఈ నిర్ణయంతో ఐఓఎస్‌ 10, ఐఓఎస్‌ 11, ఆండ్రాయిడ్ 4.0.4 వెర్షన్‌ ఓఎస్‌లతో పనిచేస్తున్న ఫోన్లలో వాట్సాప్ పనిచేయదు. ప్రస్తుతం ఐఫోన్‌ 5, ఐఫోన్‌ 5సీ మోడల్స్‌ ఈ ఓఎస్‌లతో పనిచేస్తున్నాయి. యూజర్లు ఇప్పటికీ ఐఓఎస్‌ 10, ఐఓఎస్‌ 11 ఓఎస్‌ను ఉపయోగిస్తున్నట్లయితే ఐఫోన్‌ 12ఓఎస్‌కు అప్‌డేట్ చేసుకోవచ్చు. ఐఫోన్‌ 5ఎస్‌, ఐఫోన్‌ 6, ఐఫోన్‌ 6ఎస్‌ మోడల్స్‌ను మాత్రమే ఐఫోన్‌ 12 సపోర్ట్ చేస్తుంది. ఐఫోన్‌ 5, ఐఫోన్‌ 5సీ మోడల్స్‌లో ఐఓఎస్‌ 12 పనిచేయదు. ఆండ్రాయిడ్ యూజర్లు ఎవరైనా ఇప్పటికీ  ఆండ్రాయిడ్ 4.0.4 వెర్షన్‌ను ఉపయోగిస్తుంటే వారు కూడా వెంటనే తమ ఓఎస్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది.

మరోవైపు నకిలీ ఖాతాలపై వాట్సాప్ కఠిన చర్యలకు ఉపక్రమించింది. నిబంధనలకు అనుగుణంగా లేని, చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న సుమారు 23 లక్షల ఖాతాలను జులై నెలలో తొలగించినట్లు తెలిపింది. ‘‘యూజర్ల నుంచి అందిన ఫిర్యాదులను పరిశీలించిన అనంతరం, నకిలీ సమాచార వ్యాప్తిని అడ్డుకోవడం, సైబర్‌ సెక్యూరిటీని ప్రోత్సహించడం, ఎన్నికల సమగ్రతను కాపాడటంలో భాగంగా ఈ ఖాతాలపై చర్యలు తీసుకున్నాం ’’అని వాట్సాప్‌ ఒక ప్రకటనలో తెలిపింది. యూజర్లకు మెరుగైన సేవలు అందించడంలో భాగంగా ఫిర్యాదుల పరిశీలనకు డేటా సైంటిస్ట్‌, డేటా ఎనలిస్ట్, రీసెర్చర్‌, న్యాయ నిపుణులతో కూడిన బృందాన్ని వాట్సాప్‌  ఏర్పాటు చేసింది.

యూజర్లు తమకు ఏదైనా ఖాతా నుంచి వేధింపులు ఎదురవుతున్నా, ఎవరైనా యూజర్‌ వాట్సాప్‌ ద్వారా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారనే అనుమానం కలిగినా.. సదరు ఖాతా ప్రొఫైల్‌పై క్లిక్ చేసి కిందకు స్క్రోల్‌ చేస్తే రిపోర్ట్ ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే వాట్సాప్‌కు మీ నుంచి ఫిర్యాదు వెళుతుంది. వాట్సాప్‌ నిపుణుల బృందం మీ ఫిర్యాదును పరిశీలించి, దానికి సంబంధించిన సాక్ష్యాలను సమర్పించమని కోరుతుంది. వాటి ఆధారంగా సదరు ఖాతాలపై చర్యలు తీసుకుంటుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని