WhatsApp: వాట్సాప్‌లో బగ్‌.. యాప్‌ను అప్‌డేట్ చేశారా?

వాట్సాప్‌ మెసేజింగ్ యాప్‌లో బగ్‌ ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సైబర్‌ దాడులను ఆరికట్టేందుకు కృషి చేసే సీఈఆర్‌టీ-ఇన్‌ తెలిపింది... 

Published : 29 Sep 2022 16:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రపంచవ్యాప్తంగా మెసేజింగ్‌ కోసం ఎక్కువ మంది ఉపయోగించేది వాట్సాప్‌ యాప్‌. కేవలం మెసేజింగ్‌ మాత్రమే కాదు, వాయిస్‌/వీడియో కాలింగ్‌, ఫైల్‌ షేరింగ్‌, పేమెంట్ ఇలా ఎన్నో రకాల అడ్వాన్స్‌డ్‌ ఫీచర్లు ఈ యాప్‌లో ఉన్నాయి. తాజాగా వాట్సాప్‌ యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచన చేసింది. ఈ యాప్‌లో సెక్యూరిటీ లోపం ఉందని తెలిపింది. ఈ బగ్‌ కారణంగా సైబర్‌ నేరగాళ్లు సులువుగా వాట్సాప్‌ను హ్యాక్‌ చేసి యూజర్‌ డేటాను దొంగలించే అవకాశం ఉందని హెచ్చిరించింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో సైబర్‌ దాడులను అరికట్టేందుకు కృషి చేసే కంప్యూటర్‌ ఎమర్జెన్సీ రెస్పాన్స్‌ టీమ్‌ (CERT-In) వాట్సాప్‌ ఆండ్రాయిడ్‌, ఐఓఎస్ వెర్షన్లలో వీడియో కాలింగ్‌ ఫీచర్‌లో ఈ బగ్‌ ఉన్నట్లు తెలిపింది.

ఈ బగ్‌ సాయంతో హ్యాకర్స్‌ యూజర్‌ వాట్సాప్‌ ఖాతాల్లోకి ఆర్బిటరీ కోడ్‌ను ప్రవేశపెట్టి డివైజ్‌లను తమ ఆధీనంలోకి తీసుకుంటున్నట్లు గుర్తించామని వాట్సాప్‌ తన రిపోర్ట్‌లో పేర్కొంది. హ్యాకర్స్‌ తమ కంట్రోల్‌లోకి తీసుకున్న డివైజ్‌ల నుంచి యూజర్‌ ప్రమేయం లేకుండా వీడియో కాల్ చేసి మాల్‌వేర్‌ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపింది. తర్వాత హ్యాకర్స్‌ యూజర్‌ వ్యక్తిగతడేటాను సేకరించడంతోపాటు, వాట్సాప్‌లో యూజర్‌ యాక్టివిటీని ట్రాక్‌ చేస్తున్నారని వెల్లడించింది. దీనిపై యూజర్లు అప్రమత్తంగా ఉండాలని, ఒకవేళ తమ ప్రమేయం లేకుండా ఫోన్‌ నుంచి వీడియో కాల్‌ చేసినట్లు గుర్తిస్తే వెంటనే యాప్‌ను డిలీట్‌ చేసి కొత్తగా ఇన్‌స్టాల్ చేసుకోవమని సూచించింది. ఈ సమస్యకు ముందస్తు పరిష్కారంగా వాట్సాప్ అప్‌డేట్‌ను విడుదల చేసింది. యూజర్లు వెంటనే తమ డివైజ్‌లలో వాట్సాప్‌ను అప్‌డేట్ చేసుకోవాలని సూచించింది. ఈ అప్‌డేట్‌లను ప్లే స్టోర్‌, యాప్‌ స్టోర్‌ నుంచి చేసుకోవచ్చు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని