WhatsApp Beta: బీటా యూజర్స్‌.. వాట్సాప్‌లో సమస్యా.. ఇలా చేయండి!

వాట్సాప్‌ ఇటీవల విడుదల చేసిన బీటా అప్‌డేట్‌ వల్ల ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ డివైజ్‌లలో వాట్సాప్‌ క్రాష్‌ అవుతోందని వాబీటాఇన్ఫో తెలిపింది. మరి ఈ సమస్యను ఎలా అధిగమించాలో తెలుసుకుందాం. 

Updated : 12 Aug 2022 14:37 IST

ఇంటర్నెట్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది యూజర్స్‌ ఉపయోగిస్తున్న ఏకైక మెసేజింగ్ యాప్‌ వాట్సాప్. యూజర్‌ ఫ్రెండ్లీ ఫీచర్స్‌ ఉండటంతో అన్ని వయసుల వారు సులువుగా ఉపయోగించగలుగుతున్నారు. అయితే వాట్సాప్‌ ఏవైనా కొత్త ఫీచర్స్‌ను యూజర్స్‌ పరిచయం చేసే ముందు వాటిని బీటా వెర్షన్‌లో విడుదల చేస్తుంది. దీంతో ఆసక్తిగల యూజర్స్‌ బీటాలో రిజిస్టర్ చేసుకుంటే సాధారణ యూజర్స్‌ కంటే ముందుగానే కొత్త ఫీచర్స్‌ను ఉపయోగించవచ్చు. అలా కొత్త ఫీచర్స్‌ ఎలా పనిచేస్తున్నాయి, వాటిలో ఏవైనా సమస్యలున్నాయా అనే సమాచారాన్ని బీటా యూజర్స్‌ నుంచి వాట్సాప్ సేకరిస్తుంది. తాజాగా వాట్సాప్‌ విడుదల చేసిన బీటా వెర్షన్‌ అప్‌డేట్‌లో ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్స్‌ ఫోన్లలో యాప్‌ పనిచేయడం ఆగిపోతుందని పలువురు యూజర్స్ ఫిర్యాదు చేశారు. ఇంతకీ ఆ బీటా వెర్షన్‌ ఏంటీ? దాన్ని ఇన్‌స్టాల్ చేసుకుంటే ఎందుకు వాట్సాప్ క్రాష్‌ అవుతుంది? ఈ సమస్యను ఎలా పరిష్కరించుకోవాలో చూద్దాం. 

కొద్దిరోజుల క్రితం వాట్సాప్ బీటా యూజర్స్‌ కోసం ఆండ్రాయిడ్‌లో 2.21.24.11, ఐఓఎస్‌లో 2.21.240.14 వెర్షన్ అప్‌డేట్లను విడుదల చేసింది. ఈ వెర్షన్‌ను అప్‌డేట్ చేసుకున్న యూజర్స్‌కు స్టేటస్‌ అప్‌డేట్‌, గ్రూప్‌ చాట్‌లలో మెసేజ్‌లు పంపేప్పుడు సమస్య ఉత్పన్నం కావడంతోపాటు వాట్సాప్ పూర్తిగా పనిచేయడం ఆగిపోతుందని వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. ఈ కొత్త బీటా వెర్షన్‌ ఉపయోగిస్తున్న ఆండ్రాయిడ్ 12 యూజర్స్‌ ఫోన్లలో వాట్సాప్ క్రాష్ అవుతుందట. ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్స్‌కు వాబీటాఇన్ఫో కీలక సూచన చేసింది. 


ఐఓఎస్‌ యూజర్స్‌

2.21.240.14 బీటా వెర్షన్‌ను అప్‌డేట్ చేసిన యూజర్స్ తమ ఐఫోన్లలో ముందుగా చాట్ హిస్టరీని బ్యాకప్‌ చేయాలి. తర్వాత టెస్ట్‌ ఫ్లైట్‌ (ఐఓఎస్‌ యూజర్లు మొబైల్‌ యాప్‌లను పరీక్షించేందుకు ఉపయోగించే యాపిల్ ఆన్‌లైన్‌ సర్వీస్‌)లోకి వెళ్లి వాట్సాప్ మెసేంజర్ లేదా వాట్సాప్ బిజినెస్‌ సెలెక్ట్‌ చేయాలి. తర్వాత ప్రీవియస్ బిల్డ్స్‌లోకి వెళ్లి ఇన్‌స్టాల్ ఏ ప్రీవియస్‌ బీటా బిల్డ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఒకవేళ యాప్‌ స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసిన వాట్సాప్‌ ఉపయోగిస్తుంటే యాప్‌ను అప్‌డేట్ చేసే ప్రతిసారీ మీ చాట్ హిస్టరీని తప్పనిసరిగా బ్యాకప్‌ చేసుకోవాలి. దానివల్ల వాట్సాప్ ఎప్పడు పనిచేయకపోయినా.. బీటా వెర్షన్‌ను డిలీట్ చేసి సాధారణ వెర్షన్‌ను డౌన్‌లోడ్‌ చేసి ఉపయోగించవచ్చు. అలానే బ్యాకప్‌ చేసిన చాట్ హిస్టరీని రీస్టోర్ చేయొచ్చు.  


ఆండ్రాయిడ్ యూజర్స్‌ 

ఆండ్రాయిడ్ యూజర్స్‌ ప్రస్తుతం ఉపయోగిస్తున్న బీటా వెర్షన్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేసి సాధారణ వెర్షన్‌ను ఏపీకే మిర్రర్‌ (వాట్సాప్ వెబ్‌సైట్) నుంచి ఇన్‌స్టాల్ చేసుకోవాలి. అయితే ఈ ప్రాసెస్ చేసే ముందు యూజర్స్ తప్పనిసరిగా తమ వాట్సాప్ చాట్ హిస్టరీని బ్యాకప్ చేసుకోవాలని వాబీటా సూచిస్తోంది. ఒకవేళ మీరు చాట్ హిస్టరీని బ్యాకప్‌ చేసుకోకుండా బీటా వెర్షన్‌ ప్రయత్నించాలనుకుంటే ఆండ్రాయిడ్ డీబగ్ బ్రిడ్జ్ సాయంతో మీ డేటా బ్యాకప్‌ చేసుకోవచ్చు. అయితే ఈ పద్ధతి ఆండ్రాయిడ్‌ 10 ఆపై వెర్షన్లతో పనిచేస్తున్న ఫోన్లలో మాత్రమే సాధ్యమని తెలిపింది. 

* ఇందుకోసం ముందుగా ఫోన్ సెట్టింగ్స్‌లోని డెవలపర్స్‌ ఆప్షన్‌లో ఉన్న యూఎస్‌బీ డీబగ్గింగ్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసి మీ ఫోన్‌ని యూఎస్‌బీ సాయంతో కంప్యూటర్‌కు కనెక్ట్ చేయాలి. 

* తర్వాత మీ కంప్యూటర్‌లో ఏడీబీ టూల్స్‌ డౌన్‌లోడ్ చేయాలి. అదే ఫోల్డర్‌లో ఏపీకే మిర్రర్‌ నుంచి డౌన్‌లోడ్ చేసిన app.apk వాట్సాప్ ఫైల్‌ను పేస్ట్‌ చేసి ఫైల్‌ పేరు ఏపీకేగా మార్చాలి. ఆ ఫోల్డర్‌లోనే రైట్ క్లిక్ చేసి విండోస్ టెర్మినల్‌ను ఓపెన్ చేయాలి. అందులో ఏడీబీ డివైజ్‌లో మీ ఫోన్ కనెక్ట్ అయిందో లేదో చెక్ చేయాలి. తర్వాత ఈ కింది కమాండ్స్‌ టైప్‌ చేయాలి. 

adb push app.apk/data/local/tmp/app/apk

adb shell pm install-r-d/data/local/tmp/app.apk

* పై కమాండ్స్ టైప్‌ చేసిన తర్వాత మీ ఫోన్‌లో డేటా మొత్తం బ్యాకప్‌ అవుతుంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని