WhatsApp: వాట్సాప్‌ తాజా అప్‌డేట్స్‌.. ఎమోజీ రియాక్షన్‌, గ్రూప్‌ అడ్మిన్‌ కొత్త ఫీచర్‌!

వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసింది. దీంతో యూజర్లు ఇతరుల స్టేటస్‌ అప్‌డేట్‌లకు సులువుగా రిప్లై ఇవ్వొచ్చు. 

Published : 05 May 2022 18:56 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా వాట్సాప్‌ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను యూజర్లకు అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇటీవలే లొకేషన్‌ స్టిక్కర్‌, చాట్‌ లిస్ట్‌ స్టేటస్ అప్‌డేట్ వంటి ఫీచర్లను పరిచయం చేయనున్నట్లు వెల్లడించింది. తాజాగా ఎమోజీ రియాక్షన్‌ ఫీచర్‌ను యూజర్లకు పరిచయం చేసినట్లు మెటా సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ఫేస్‌బుక్‌లో తెలిపారు. దీంతో వాట్సాప్ యూజర్లు కూడా ఇన్‌స్టాగ్రామ్‌ తరహాలోనే వాట్సాప్‌ స్టేటస్‌ అప్‌డేట్‌కు ఎమోజీలతో తమ స్పందన తెలియజేయవచ్చు. వాట్సాప్‌లో ఇతరుల స్టేటస్‌ అప్‌డేట్‌పై క్లిక్ చేసిన వెంటనే స్క్రీన్‌ మీద పలు రకాల ఎమోజీ రియాక్షన్స్‌ కనిపిస్తాయి. వాటిలో మీకు నచ్చిన దానిపై క్లిక్ చేస్తే సదరు స్టేటస్‌పై మీ స్పందన అవతలి వారికి తెలుస్తుంది. ఈ ఫీచర్‌ పూర్తిస్థాయిలో యూజర్లకు పరిచయం చేసినప్పటికీ కొద్దిమంది యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వచ్చింది. కొద్ది రోజుల్లో యూజర్లు అందరికీ అందుబాటులోకి వస్తుందని సమాచారం. 

ఇదేకాకుండా మరో కొత్త ఫీచర్‌ను వాట్సాప్‌ యూజర్లకు పరిచయం చేయనుంది. దీంతో గ్రూప్‌ అడ్మిన్‌లుగా ఉన్న వ్యక్తులు, గ్రూపు సభ్యులు షేర్ చేసే మెసేజ్‌లను సులువుగా తొలగించవచ్చు. గ్రూపులోని సభ్యులు ఏదైనా తప్పుడు సమాచారాన్ని షేర్‌ చేస్తే గ్రూప్‌ అడ్మిన్‌ సదరు మెసేజ్‌ను డిలీట్ చేయొచ్చు. దీంతో గ్రూపు సభ్యులకు అడ్మిన్‌ మెసేస్‌ డిలీట్ చేసినట్లు చాట్‌ స్క్రీన్‌ మీద కనిపిస్తుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్‌, డెస్క్‌టాప్ యూజర్లకు అందుబాటులోకి రానుందని సమాచారం. వీటితోపాటు కొత్తగా కమ్యూనిటీ, 2జీబీ ఫైల్ షేరింగ్‌, లొకేషన్‌ స్టికర్‌, చాట్‌ లిస్ట్‌ స్టేటస్‌ అప్‌డేట్ వంటి ఫీచర్లను వాట్సాప్‌ త్వరలోనే యూజర్లకు పరిచయం చేయనుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని