WhatsApp: వాట్సాప్ సూపర్‌ ఫీచర్‌.. డిలీట్ ఫర్‌ మీ చేసినా నో ప్రాబ్లమ్‌!

వాట్సాప్ యూజర్లకు సూపర్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో యూజర్లు డిలీట్ ఫర్‌ మీ చేసిన ఇకపై బాధపడాల్సిన అవసరంలేదు. కేవలం ఐదు సెకన్ల వ్యవధిలో మెసేజ్‌ను అన్‌డూ చేయొచ్చు. 

Updated : 19 Dec 2022 21:29 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వాట్సాప్‌ (WhatsApp)లో ఒకరికి పంపాల్సిన మెసేజ్‌ మరొకరికి పంపితే, డిలీట్ ఫర్ ఎవ్రీవన్‌ (Delete For Everyone) ఫీచర్‌తో తొలగించవచ్చు. కానీ, కొన్నిసార్లు పొరపాటున డిలీట్ ఫర్‌ ఎవ్రీవన్‌కు బదులు డిలీట్ ఫర్ మీ ఆప్షన్‌పై క్లిక్‌ చేస్తుంటారు. దాంతో సదరు మెసేజ్‌ పంపిన వ్యక్తి ఫోన్‌ నుంచి డిలీట్ అయిపోతుంది. కానీ, అవతలివారి ఫోన్‌లో కనిపిస్తూనే ఉంటుంది. దీంతో ఆ మెసేజ్‌ అవతలి వ్యక్తి ఫోన్‌ నుంచి ఎలా డిలీట్ చేయాలా? అని కంగారు పడిపోతుంటాం. ఈ సమస్యకు పరిష్కారంగానే వాట్సాప్ ఓ సూపర్‌ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. వాట్సాప్ యాక్సిడెంటల్‌ డిలీట్ (Accidental Delete) పేరుతో తీసుకొచ్చిన ఈ ఫీచర్‌తో డిలీట్ ఫర్‌ మీ చేసిన మెసేజ్‌ను తిరిగి పొంది డిలీట్ ఫర్‌ ఎవ్రీవన్‌ చేయొచ్చు. ఇంతకీ ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందంటే..?

వాట్సాప్‌లో డిలీట్ ఫర్‌ మీపై క్లిక్ చేసిన వెంటనే మీకు స్క్రీన్‌ మీద యాక్సిడెంటల్‌ డిలీట్‌ అని పాప్‌-అప్‌ బార్‌ కనిపిస్తుంది. అందులో అన్‌డూ అనే ఆప్షన్‌పై క్లిక్ చేస్తే మీరు డిలీట్ చేసిన మెసేజ్‌ తిరిగి స్క్రీన్‌పై కనిపిస్తుంది. మరోసారి దాన్నిసెలెక్ట్‌ చేసి డిలీట్ ఫర్‌ ఎవ్రీవన్‌ చేస్తే మీతోపాటు, అవతలి వ్యక్తి ఫోన్‌ నుంచి కూడా మెసేజ్‌ డిలీట్ అయిపోతుంది. అయితే, ఈ యాక్సిడెంటల్‌ డిలీట్ బార్‌ కేవలం ఐదు సెకన్లపాటు మాత్రమే ఉంటుంది. ఆ సమయంలోపు అన్‌డూపై క్లిక్ చేస్తేనే, మెసేజ్‌ తిరిగి స్క్రీన్‌పై కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ యూజర్లందరికీ అందుబాటులో ఉంది. ఒకవేళ ఇప్పటికీ రాకుంటే.. మీ వాట్సాప్ యాప్‌ను అప్‌డేట్ చేసుకొని ఈ ఫీచర్‌ను పొందొచ్చు. 

ఇదేకాకుండా, వాట్సాప్ మరో కొత్త ఫీచర్‌ను కూడా పరీక్షిస్తోంది.  కెప్ట్‌ మెసేజెస్ (Kept Messages) పేరుతో తీసుకురాబోతున్న ఫీచర్‌తో యూజర్లు తమకు డిస్‌అప్పియర్ ఫీచర్‌ ద్వారా రిసీవ్ చేసుకున్న  మెసేజ్‌లను డిలీట్ కాకుండా స్టోర్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ ఎలా పనిచేస్తుందనేది తెలియాల్సివుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న కెప్ట్‌ మెసేజెస్‌ ఫీచర్‌ ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు అందుబాటులో ఉంది. దీంతోపాటు డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో రీసెంట్ గ్రూప్స్‌ (Recent Groups) పేరుతో మరో ఫీచర్‌ను కూడా పరిచయం చేయనుంది. ఈ ఫీచర్‌తో యూజర్లు కాంటాక్టు పేరుతో కామన్‌ గ్రూపు వివరాలు తెలుసుకోవచ్చు. ఉదాహరణకు యూజర్‌ కాంటాక్టులో వ్యక్తి పేరు డెస్క్‌టాప్‌ యాప్‌ సెర్చ్‌బార్‌లో టైప్‌ చేస్తే.. రిజల్ట్‌లో సదరు వ్యక్తి, యూజర్‌ కామన్‌గా ఉన్న గ్రూపు వివరాలు చూపిస్తుంది. ఈ ఫీచర్‌ను కూడా పరీక్షల అనంతరం సాధారణ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని