WhatsApp: ఈ సమాచారం వాట్సాప్‌లో షేర్ చేశారో.. చిక్కుల్లో పడ్డట్లే!

వ్యక్తిగత చాట్ లేదా గ్రూపులో షేర్ చేసే సమాచారంపై వాట్సాప్‌ యూజర్లకు కొన్ని సూచనలు చేసింది. దాని ప్రకారం ఆయా కేటగిరీలోని కంటెంట్‌ను ఇతరులతో షేర్‌ చేస్తే జైలుపాలయ్యే అవకాశం కూడా ఉంది. మరి, వాట్సాప్‌ చేసిన సూచనలపై ఓ లుక్కేద్దాం...

Updated : 03 Aug 2022 11:37 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫొటో/వీడియో/ఆడియో/టెక్ట్స్‌.. ఫార్మాట్‌ ఏదైనా వాట్సాప్‌లో షేర్‌ చేయొచ్చు. ఉదయం లేచిన దగ్గర్నుంచి.. రాత్రి పడుకునే వరకు ఎంతో సమాచారం వాట్సాప్‌ వేదికగా బదిలీ అవుతుంది. వీటిలో ఫ్రెండ్స్‌ చెప్పుకొనే కబుర్ల నుంచి ప్రజల అవగాహన కోసం షేర్ చేసే కంటెంట్‌ కూడా ఉంటుంది. కొన్నిసార్లు గ్రూపులో లేదా ఇతరుల నుంచి వచ్చే సమాచారం పూర్తిగా చదవకుండా యథావిధిగా ఇతరులకు ఫార్వార్డ్ చేస్తుంటాం. వాటిలో నకిలీ/మాల్‌వేర్‌/విద్వేషపూరితమైన సమాచారం ఉంటే, మీరు చిక్కుల్లో పడ్డట్లే. వాట్సాప్‌లో ఫార్వార్డ్ అయ్యే సమాచారం ద్వారా సైబర్‌మోసాలకు, నకిలీ సమాచార వ్యాప్తికి చెక్ పెట్టేందుకు వాట్సాప్‌ యూజర్లకు కొన్ని సూచనలు చేసింది. దాని ప్రకారం కింద పేర్కొన్న కేటగిరీలోని కంటెంట్‌ను ఇతరులతో షేర్‌ చేస్తే జైలుపాలయ్యే అవకాశం కూడా ఉంది. మరి, వాట్సాప్‌ చేసిన సూచనలపై ఓ లుక్కేద్దాం..

  • కొంతమంది వాట్సాప్‌ గ్రూపులో అశ్లీల కంటెంట్ షేర్ చేస్తుంటారు. సామాజిక మాధ్యమాల్లో అడల్ట్ కంటెంట్ షేర్ చేయడం చట్టరీత్యా నేరం. అలాంటి కంటెంట్‌ గురించి గ్రూపు సభ్యులెవరైనా ఫిర్యాదు చేస్తే, అది షేర్‌ చేసిన వ్యక్తితోపాటు, గ్రూపు అడ్మిన్‌పై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. అలాంటి సమాచారం వాట్సాప్‌లో ఎవరు షేర్ చేసినా వెంటనే దాన్ని డిలీట్ చేయడం ఉత్తమం. ఇతరుల నుంచి వచ్చినా దాన్ని షేర్‌ చేయొద్దని వాట్సాప్‌ సూచిస్తోంది.   
  • వాట్సాప్‌లో షేర్ అయ్యే కొన్ని టెక్ట్స్‌/వీడియో/ఆడియో మెసేజ్‌లు ఎంతో ఆసక్తి కలిగిస్తాయి. చదివేందుకు, చూసేందుకు లేదా వినేందుకు బావున్నాయని, వాటిని అలాగే స్నేహితులు లేదా ఇతర గ్రూపులోకి ఫార్వార్డ్ చేస్తాం. అలా షేర్‌ చేసిన సమాచారానికి కాపీరైట్‌ ప్రొటెక్షన్‌ ఉంటే మీరు చిక్కుల్లో పడ్డట్లే. అది తమ మేధో సంపత్తిగా చెబుతూ.. ఎవరైనా వ్యక్తి లేదా సంస్థ మీకు కాపీరైట్‌ ఉల్లంఘన నోటీసులు ఇచ్చే అవకాశం లేకపోలేదు. అందుకే కాపీరైట్‌ ప్రొటెక్షన్‌ ఉన్న సమాచారం షేర్‌ చేయకపోవడం ఉత్తమం. 
  • కొంతమంది తమ స్నేహితులను ఆటపట్టించడం కోసం వారికి తెలియకుండా ఫొటో/వీడియోలు తీసి తెలియని నంబర్ల నుంచి పంపుతుంటారు. దాంతో తమ వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిందంటూ సదరు వ్యక్తిపై ఫిర్యాదు చేయొచ్చు. సరదా కోసం చేసే ఇలాంటి పనులు మిమ్మల్ని చిక్కుల్లో పడేస్తాయి. మరోవైపు సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేసే ఫొటో/వీడియోలను యూజర్‌ అనుమతి లేకుండా కొంతమంది ఆకతాయిలు సేకరిస్తున్నారు. వాటిని అశ్లీలంగా ఎడిట్ చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్నారు. అవగాహన లోపంతో కొంతమంది వాటిని షేర్‌ చేస్తున్నారు. చట్టప్రకారం ఇలా చేయడం నేరం. అందుకే వాటి జోలికి అస్సలు పోవద్దని వాట్సాప్ యూజర్లకు సూచిస్తోంది. 
  • ఉగ్రవాదులు, అసాంఘిక శక్తులకు సంబంధించిన లేదా వారి చర్యలను ప్రోత్సహించే విధంగా ఉండే సమాచారం వాట్సాప్‌లో షేర్ చేయడం నేరం. దేశ భద్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం సంఘవిద్రోహశక్తులకు సంబంధించిన కంటెంట్‌ షేరింగ్‌పై నిఘా పెడుతుంది. ఒకవేళ మీకు ఏదైనా వ్యక్తి లేదా గ్రూపు నుంచి అలాంటి మెసేజ్ వస్తే సదరు ఖాతాపై ఫిర్యాదు చేయవచ్చు. 
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని