WhatsApp: ఒకే నెంబర్‌తో ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్లలో వాట్సాప్‌..!

ఒకే అకౌంట్‌ను రెండు స్మార్ట్‌ఫోన్లలో వాడే సదుపాయాన్ని వాట్సాప్‌ తీసుకొస్తున్నట్లు వాబీటాఇన్ఫో తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

Updated : 11 May 2022 16:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌:  ఒకేసారి ఒకటి కన్నా ఎక్కువ డివైజ్‌లలో వాట్సాప్‌ను ఉపయోగించుకునేలా ‘మల్టీడివైజ్ సపోర్ట్‌’ (multi-device support) ఫీచర్‌ను వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ ఫీచర్‌ సాయంతో యూజర్లు ప్రైమరీ అకౌంట్‌ కాకుండా ల్యాప్‌టాప్, ట్యాబ్‌, డెస్క్‌టాప్‌లలో లాగిన్‌ అయ్యే సదుపాయాన్ని కల్పించింది. అయితే, తాజాగా ఒకే వాట్సాప్‌ అకౌంట్‌ను రెండు స్మార్ట్‌ఫోన్లలో వాడే సదుపాయాన్ని కూడా తీసుకొస్తున్నట్లు సమాచారం. ఈ విషయాన్ని వాబీటాఇన్ఫో తన వెబ్‌సైట్‌లో వెల్లడించింది.

వాబీటాఇన్ఫో తెలిపిన వివరాల ప్రకారం.. వాట్సాప్‌ ‘మల్టీ డివైజ్‌ సపోర్టు’ సేవలను విస్తరించనుంది. ఇప్పటికే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌కు అదనపు హంగులు జోడించాలని వాట్సాప్‌ భావిస్తోంది. యూజర్లు ప్రైమరీ మొబైల్‌ల్లోనే కాకుండా మరో ఫోన్‌/ట్యాబ్‌లో వాట్సాప్‌ ఓపెన్‌ చేసే సదుపాయాన్ని త్వరలోనే  తీసుకురానుంది. ఈ ఫీచర్‌ సాయంతో వాట్సాప్‌ అకౌంట్‌ను మరో ఫోన్‌కు లింక్ చేసుకొని ఉపయోగించుకోవచ్చు. వాట్సాప్‌ బీటా 2.22.10.13 వెర్షన్‌లలో ఈ ఫీచర్‌ పనిచేయనుందని సమాచారం. దీనికోసం వాట్సాప్‌ ప్రైమరీ అకౌంట్‌ ఉన్న మొబైల్‌ నుంచి లింక్ చేయాలనుకున్న స్మార్ట్‌ఫోన్‌లో క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. సెకండరీ మొబైల్‌లో వాట్సాప్‌ ఓపెన్ చేసినప్పుడు  ‘రిజిస్టర్ డివైజ్ యాజ్‌ కంపానియన్ ’(Register device as companion) అనే ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకోవాలని వాబీటాఇన్ఫో పేర్కొంది. అయితే, ఈ ఫీచర్‌ ఇంకా ప్రయోగాత్మక దశలో ఉందని.. ఫైనల్‌ వెర్షన్‌ అందుబాటులోకి వచ్చే సమయానికి కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని వాబీటాఇన్ఫో వెల్లడించింది. కాగా.. ఒకేసారి రెండు స్మార్ట్‌ఫోన్‌లలో కనెక్ట్ అయినప్పుడు యూజర్ డేటాకు వాట్సాప్ ఎలాంటి భద్రత కల్పిస్తుందనే దానిపై స్పష్టత రాలేదు.


మల్టీ డివైజ్‌ ఫీచర్ ఎలా ఉపయోగించాలి?

వాట్సాప్ మల్టీ డివైజ్‌ ఫీచర్ ఉపయోగించాలంటే మందుగా మీ ఫోన్లో కుడివైపు మూడు చుక్కలపై క్లిక్ చేస్తే లింక్‌ డివైజ్‌ (ప్రస్తుతం బీటా యూజర్స్‌కి మాత్రమే అందుబాటులో ఉంది) అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఫింగర్ లేదా పాస్‌వర్డ్ అథెంటికేషన్ అడుగుతుంది. (ఈ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసుకుంటే) తర్వాత మీరు లాగిన్ అవ్వాలనుకుంటున్న డివైజ్‌లో వాట్సాప్‌ వెబ్ ఓపెన్‌ చేసి స్క్రీన్ మీద కనిపిస్తున్న క్యూఆర్‌ కోడ్‌ని స్కాన్ చేస్తే మీ వాట్సాప్‌ ఖాతా అందులో కూడా ఓపెన్ అవుతుంది. అలా మీరు ఒకేసారి వాట్సాప్ ఖాతా ఉన్న ఫోన్ కాకుండా మరో నాలుగు డివైజ్‌లలో యాక్సిస్ చెయ్యొచ్చు. ఒకవేళ మీ ఫోన్ స్విచ్‌ఆఫ్ అయినా మీరు లాగిన్ అయిన నాలుగు డివైజ్‌ల నుంచి వాట్సాప్‌ను ఉపయోగించుకోవచ్చు. అలానే మీ కాంటాక్ట్ లిస్ట్‌, ఛాట్‌ హిస్టరీ అన్ని వేర్వేరుగా సదరు డివైజ్‌లకు కనెక్ట్ అవుతాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని