WhatsApp: త్వరలో మరో ‘ఆరు’ ఫీచర్లు

యూజర్ల కోసం ఫీచర్లను అప్‌డేట్‌ చేయడంలో వాట్సాప్‌ ఎప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలో మరికొన్ని ఫీచర్లను యాడ్‌ చేసేందుకు వాట్సాప్‌ ప్రయత్నాలు చేస్తోంది..

Published : 28 Jun 2021 14:36 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యూజర్ల కోసం ఫీచర్లను అప్‌డేట్‌ చేయడంలో ప్రముఖ మెస్సేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ ఎప్పుడూ ముందుంటుంది. ఈ క్రమంలో మరికొన్ని ఫీచర్లను యాడ్‌ చేసేందుకు వాట్సాప్‌ ప్రయత్నాలు చేస్తోంది. మీ చాట్‌ లిస్ట్‌లకు న్యూ లుక్‌ తేవడంతో పాటు, వాయిస్‌ నోట్‌ వేవ్‌ఫామ్స్, స్టిక్కర్‌ ప్యాక్స్, మిస్‌డ్‌ గ్రూప్‌ కాల్స్‌, రీడ్‌ లేటర్‌, న్యూ ఫ్లాష్‌ కాల్స్‌ వంటి ఫీచర్లను తీసుకురానుంది. అయితే ఎప్పుడు అందుబాటులోకి వస్తాయో వాట్సాప్‌ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. మరి ఆ ఫీచర్ల గురించి తెలుసుకుందామా..!

ఇక లైన్‌ రాదు.. స్టిక్కర్స్‌కు షార్ట్‌కట్‌

ప్రస్తుతం మీరు వాయిస్‌ మెసేజ్‌ను రికార్డ్‌ చేసి పంపారు. వాయిస్‌ మెసేజ్‌ ప్లే అయ్యేటప్పుడు ఎలా వస్తుంది..? స్ట్రైట్‌ లైన్‌ కనిపిస్తుంటుంది. ఇకపై లైన్‌ కాకుండా వేవ్స్‌ వచ్చేలా ఫీచర్‌ను యాడ్‌ చేయబోతోంది. అయితే ఇప్పటికే ఆండ్రాయిడ్‌ వెర్షన్స్‌ బీటా టెస్టర్స్‌లో ఫీచర్‌ ఉంది. ఐఓఎస్‌ యూజర్ల కోసం త్వరలో రానుంది. అలానే స్టిక్కర్‌ ప్యాక్స్‌ కోసం షార్ట్‌కట్‌లు రాబోతున్నాయి. సన్నిహితులకు స్టిక్కర్‌ ప్యాక్స్‌ను పంపించేందుకు షార్ట్‌కట్‌ ఉపయోగపడుతుంది. స్టిక్కర్‌ స్టోర్‌ కూడా ఎమోజీ సెక్షన్‌లోనే కనిపిస్తుంది. ఇప్పటికే ఐఫోన్‌ యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులో ఉండగా.. ఆండ్రాయిడ్‌ యూజర్లకు త్వరలో రానుంది. 

కొత్త లుక్‌లో చాట్‌ లిస్ట్‌

ఆండ్రాయిడ్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ)కు మార్పులు చేసేందుకు వాట్సాప్‌ రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌లో మార్పులు చేసింది. చాట్‌ లిస్ట్‌లో చాట్‌ సెల్స్‌ను వేరు చేసే లైన్‌ను తీసేయనుంది. యాప్‌ మొత్తం రీడిజైన్‌ కాదని, చిన్నపాటి యూఐ మార్పు మాత్రమేనని వాట్సాప్‌ చెబుతోంది. ఇటీవల ఆండ్రాయిడ్‌లో నోటిఫికేషన్స్‌కు సంబంధించి రంగును మార్చిన విషయం తెలిసిందే. దీని వల్ల డార్క్‌మోడ్‌లో నోటిఫికేషన్లు ఆకుపచ్చ రంగు బదులు నీలి రంగులో కనిపిస్తాయి. ఇలాంటి మార్పునే లైట్‌మోడ్‌కూ పరిచయం చేయనుంది. అలాగే న్యూ బీటా అప్‌డేట్‌లో వాట్సాప్‌ లోగో, బ్యాడ్జ్, రిప్లే, ‘మార్క్‌ యాజ్‌ రీడ్‌’ బటన్స్‌ కూడా నీలిరంగులో కనిపించనున్నాయి. కలర్‌ స్కీమ్‌ కేవలం ఆండ్రాయిడ్‌ వెర్షన్‌ను బట్టి ఆధారపడి ఉంటుంది. 


మిస్డ్‌ గ్రూప్‌ కాల్‌

ఇదొక మంచి ఫీచర్‌గా చెప్పొచ్చు. గ్రూప్‌ కాలింగ్‌ నుంచి మీకు ఆహ్వానం అందిన సమయంలో మీరు వేరే పనిలో బిజీగా ఉన్నప్పుడు, ఆ గ్రూప్‌ కాలింగ్‌లో జాయిన్‌ అయ్యేందుకు వీలు పడటం కుదరదు. అలాంటప్పుడు వారితో మాట్లాడలేకపోతున్నామనే బాధ ఉంటుంది. ఇలాంటి వారి కోసం వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను యాడ్‌ చేయబోతోంది. ఆ గ్రూప్‌ కాల్‌ ఎండ్‌ అయ్యేలోపు మీరు దానిలో జాయిన్‌ అయ్యే అవకాశం కల్పించనుంది. దీని వల్ల మధ్యలోనైనా సంభాషించే వీలు కలుగుతుంది. గతేడాది ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌లో వాట్సాప్‌ తీసుకొచ్చింది. ఇప్పుడు ఐఓఎస్‌ యూజర్ల కోసం టెస్ట్‌ చేస్తోంది. మరి కొన్ని రోజుల్లో ఈ ఫీచర్‌ రావొచ్చు.


రీడ్‌ లేటర్‌.. న్యూ ఫ్లాష్‌ కాల్స్‌

‘రీడ్‌ లేటర్‌’ఫీచర్‌పై వాట్సాప్‌ ముమ్మరంగా పని చేస్తున్నట్లు నిపుణులు పేర్కొన్నారు. ఆర్కివ్‌డ్‌ చాట్స్‌ ఫీచర్‌ స్థానంలో రీడ్‌ లేటర్‌ తీసుకొచ్చేలా వాట్సాప్‌ ప్రయత్నాలు చేస్తోంది. ప్రస్తుతం ఆర్కివ్‌డ్‌ చాట్‌ ఆప్షన్‌ను ఎనేబుల్‌ చేసినప్పుడు చాటింగ్‌ గ్రూప్‌ చివరికి వెళ్లిపోతుంది. ఆ గ్రూప్‌నకు ఏదైనా మెసేజ్‌ వచ్చినప్పుడు మాత్రమే మళ్లీ పైకి వచ్చి కనిపిస్తుంది. ఇప్పుడు ‘రీడ్‌ లేటర్‌’ ఫీచర్‌తో ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాలని వాట్సాప్‌ భావిస్తోంది. అలాగే న్యూ ఫ్లాష్‌ కాల్స్‌ ఫీచర్‌ను వాట్సాప్‌ అందుబాటులోకి తీసుకురానుంది. ఆటోమేటిక్‌ వెరిఫికేషన్‌ ద్వారా ఒక్క కాల్‌తో వాట్సాప్‌ను వేగంగా లాగిన్‌ అయ్యేందుకు వీలు కలుగుతుంది. ఇప్పటికే ఆండ్రాయిడ్‌ బీటా వెర్షన్‌లో ఉండగా.. మరికొన్ని రోజుల్లో అందరికీ అందుబాటులోకి రానుంది.

 మరో ‘ఐదు’ ఫీచర్లు త్వరలో

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని