WhatsApp: వాట్సాప్‌ వెబ్‌లో లింక్‌ ప్రివ్యూ సమస్య.. కొత్త అప్‌డేట్ ఎప్పుడంటే?

వాట్సాప్‌లో లింక్‌ ప్రివ్యూ సమస్యకు త్వరలోనే అప్‌డేట్ విడుదల చేయనున్నట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాబీటాఇన్ఫో వెల్లడించింది. 

Published : 07 Apr 2022 15:19 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ రోజుల్లో వాట్సాప్‌ లేని స్మార్ట్‌ఫోన్‌ చాలా అరుదు. రోజులో ఎన్నో రకాల సందేశాలు, సమాచారం, ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్స్‌ వాట్సాప్‌లో ఒకరి నుంచి మరొకరి చేరిపోతుంటాయి. అందుకే వాట్సాప్‌ కూడా యూజర్ల కోసం ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లను పరిచయం చేస్తుంటుంది. అలా కొద్దిరోజుల క్రితం వాట్సాప్‌ను ఒకేసారి నాలుగు డివైజ్‌లలో ఉపయోగించుకునేందుకు వీలుగా మల్టీ డివైజ్‌ ఫీచర్‌ను పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఈ ఫీచర్‌తో యూజర్లకు కొత్త సమస్య తలెత్తింది. మల్టీ డివైజ్‌ ఫీచర్‌ అప్‌డేట్‌ చేసిన తర్వాత డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో, యూజర్లు వాట్సాప్‌ చాట్ పేజీలో యూఆర్‌ఎల్ లింక్‌ షేర్‌ చేస్తే గతంలో మాదిరి లింక్‌ ప్రివ్యూ రావడంలేదు. దీనిపై పలువురు యూజర్లు వాట్సాప్‌కు ఫిర్యాదు చేయడంతో, ఈ బగ్‌ను సరిచేసే దిశగా మెసేజింగ్ యాప్‌ చర్యలు ప్రారంభించినట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి కొత్త అప్‌డేట్‌ను ఐఓఎస్‌, ఆండ్రాయిడ్ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుందట. ఈ మేరకు వాట్సాప్‌కు సంబంధించిన అప్‌డేట్లను వెల్లడించే కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో అనే సంస్థ వెల్లడించింది. 

ఇవేకాకుండా వాట్సాప్‌ మరికొన్ని కొత్త ఫీచర్లను కూడా పరిచయం చేయనుంది. వాట్సాప్‌లో వచ్చిన కొన్ని మెసేజ్‌లను పూర్తిగా చూడకుండానే చాట్ లిస్ట్‌లోని వారికి, గ్రూపులలో ఫార్వార్డ్ చేసేస్తుంటాం. అలా స్పామ్‌ మెసేజ్‌లు కూడా ఫార్వార్డ్ అవుతుంటాయి. దీనికి పరిష్కారంగా మెసేజ్‌లను ఒకరి కంటే ఎక్కువ మందికి ఫార్వార్డ్‌ చేయకుండా కొత్త నిబంధనను అమల్లోకి తీసుకురానుంది. దీంతో స్పామ్‌ మెసేజ్‌లకు చెక్‌ పెట్టవచ్చని వాట్సాప్ భావిస్తోంది. ప్రస్తుతం ఆండ్రాయిడ్ బీటా యూజర్లకు ఈ ఫీచర్‌ అందుబాటులో ఉంది. అలానే కాంటాక్ట్‌ లిస్ట్‌లో నంబర్‌ సేవ్‌ చేయకుండానే వాట్సాప్‌ మెసేజ్‌ పంపేందుకు వీలుగా కొత్త ఫీచర్‌ను తీసుకురానుంది. దీంతో యూజర్లు వాట్సాప్‌లో ఇతరుల పంపిన నంబర్‌పై క్లిక్ చేయగానే చాట్‌, డయల్‌, యాడ్‌ టు కాంటాక్ట్ అనే మూడు ఆప్షన్లతో పాప్‌-అప్‌ విండో కనిపిస్తుంది. వాటిలో యూజర్‌ తనకు నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని