WhatsApp: వాట్సాప్‌ డిలీట్ ఫర్ ఎవ్రీవన్‌.. కొత్తగా మరో టైమ్ లిమిట్‌!

వాట్సాప్‌ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్‌లో కీలక మార్పులు చేయనుంది. దాంతోపాటు కమ్యూనిటీస్‌ ఫీచర్‌ను బీటా యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకొచ్చింది.

Published : 03 Feb 2022 02:31 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ఈ రోజుల్లో వాట్సాప్‌ (WhatsApp) యాప్‌ లేని స్మార్ట్‌ఫోన్‌ ఉండదు. సరదా సంభాషణల నుంచి అధికారిక సమాచార మార్పిడి వరకు అన్నీ వాట్సాప్‌ ద్వారానే జరుగుతున్నాయి. అందుకే వాట్సాప్ కూడా ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను పరిచయం చేయడంతోపాటు, ఉన్నవాటిని మెరుగుపరుస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. తాజాగా ‘డిలీట్‌ ఫర్‌ ఎవ్రీవన్‌’ (Delete For Everyone) ఫీచర్‌లో సైతం వాట్సాప్‌ కీలక మార్పులు చేయనుంది. ఇందులో భాగంగా టైమ్‌ లిమిట్‌ మరింత పెంచనుంది. దీంతో యూజర్ పంపిన మెసేజ్‌లను రెండు రోజుల 12 గంటల తర్వాత (రెండున్నర రోజులు) కూడా తమ చాట్‌ పేజీతోపాటు అవతలి వ్యక్తి చాట్ పేజీ నుంచి డిలీట్ చేయొచ్చు.

మెసేజ్‌ డిలీట్ అయిన తర్వాత యూజర్స్‌ చాట్ పేజీలో ‘దిస్ మెసేజ్‌ వాజ్‌ డిలీటెడ్‌’ అనే సందేశం కనిపిస్తుంది. ప్రస్తుతం డిలీట్ ఫర్ ఎవ్రీవన్‌లో ఏదైనా సందేశాన్ని తొలగించాలంటే 1 గంట 8 నిమిషాలు 16 సెకన్ల వరకు వెసులుబాటు ఉంది. దీనికి అదనంగా కొత్త టైమ్‌ లిమిట్‌ను తీసుకొస్తున్నారు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటా ఇన్ఫో) తెలిపింది. దీంతోపాటు గ్రూప్స్‌కు భిన్నంగా కొత్తగా కమ్యూనిటీస్ పేరుతో కొత్త ఫీచర్‌ను తీసుకొస్తున్నట్లు వాట్సాప్ గతేడాది వెల్లడించింది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ను బీటా యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వాబీటా ఇన్ఫో తెలిపింది.

కమ్యూనిటీ ఫీచర్‌తో గ్రూప్‌ అడ్మిన్‌లు వేర్వేరు గ్రూపులను ఒక చోటకి చేర్చవచ్చు. అంతేకాకుండా ఈ ఫీచర్‌ గ్రూప్‌ అడ్మిన్స్‌కి మరిన్ని అదనపు ఫీచర్లను ఇస్తుంది. అలానే ఒక కమ్యూనిటీలో వేర్వేరు గ్రూపులు ఏర్పాటు చేసుకోవడంతోపాటు వాటికి ఎండ్‌-టు-ఎండ్‌ ఎన్‌క్రిప్షన్ రక్షణ ఉంటుందని వాబీటా ఇన్ఫో వెల్లడించింది. దాంతోపాటు కమ్యూనిటీలకు అడ్మిన్‌గా ఉన్నవాళ్లు కమ్యూనిటీలో ఉన్న అన్ని గ్రూప్స్‌లోకి కూడా మెసేజ్‌లు పంపొచ్చు. గ్రూప్స్‌లోలానే కమ్యూనిటీ అడ్మిన్‌లు ఇతరులను ఇన్వైట్‌ లింక్‌, క్యూఆర్‌ కోడ్ లేదా మాన్యువల్‌గా కమ్యూనిటీలలోకి ఆహ్వానించవచ్చు. అయితే, కమ్యూనిటీలోకి వచ్చిన కొత్త వ్యక్తి అన్ని గ్రూప్‌లకు మెసేజ్‌ పంపలేరు. కమ్యూనిటీ సభ్యులు ఇతర సభ్యులతో సంభాషించాలా.. వద్దా.. అనేది కమ్యూనిటీ అడ్మిన్‌ నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. త్వరలోనే కమ్యూనిటీ ఫీచర్‌ను వాట్సాప్‌ పూర్తిస్థాయిలో యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని