WhatsApp: వాట్సాప్‌లో అదిరిపోయే కొత్త ఫీచర్‌.. పాత చాట్‌ను క్షణాల్లో వెతికేయవచ్చు!

తాజాగా యూజర్లు సులువుగా తమ చాట్స్‌ను గుర్తించేలా ‘చాట్‌ ఫిల్టర్‌’ అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. దీనిలో కాంటాక్ట్స్‌, గ్రూప్స్‌, నాన్‌-కాంటాక్ట్స్‌, అన్‌రీడ్‌ చాట్స్‌ అనే నాలుగు క్యాటగిరీలు ఉంటాయి.

Published : 13 May 2022 15:34 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒకే రకం వంటకాన్ని రోజూ తింటే ఏమనిపిస్తుంది? ఏదో తెలియని అసంతృప్తి కలుగుతుంది. అదే విధంగా ఒకే రకమైన టెక్నాలజీని వాడినా అంతే. తెగ బోరు కొడుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే సోషల్‌ మీడియా వేదికలు యూజర్ల కోసం కొత్త ఫీచర్లను జోడించే పనిలో పడ్డాయి. వీటిలో అన్నింటికంటే ముందు వరుసలో ‘వాట్సాప్‌’ ఉంటుందనే దానిలో ఎటువంటి సందేహం లేదు. ఇటీవలే యూజర్ల కోసం రియాక్షన్‌ ఫీచర్‌ను తీసుకురాగా.. తాజాగా మరో కొత్త ఫీచర్‌ను యూజర్లకు అందించే పనిలో పడింది.

యూజర్ల చాటింగ్‌ అనుభవాన్ని ఎప్పటికప్పుడు మెరుగుపరచడానికి వాట్సాప్‌ కొత్త ఫీచర్లను తీసుకువస్తోంది. తాజాగా యూజర్లు సులువుగా తమ చాట్స్‌ను గుర్తించేలా ‘చాట్‌ ఫిల్టర్‌’ అనే కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనున్నట్లు వాబీటాఇన్ఫో తెలిపింది. దీనిలో కాంటాక్ట్స్‌, గ్రూప్స్‌, నాన్‌-కాంటాక్ట్స్‌, అన్‌రీడ్‌ చాట్స్‌ అనే నాలుగు కేటగిరీలు ఉంటాయి. యూజర్లు కావాల్సిన దానిని వెతికే పని లేకుండా సులువుగా గుర్తించేలా అన్నింటినీ ఒకే ట్యాబ్‌లో అందించనుంది. దీంతో మనకు కావాల్సిన పాత చాట్‌ మెసేజ్‌లను క్షణాల్లో వెతకొచ్చు. ఆర్కైవ్‌ చాట్‌ (archive chat)ని ఉపయోగించే యూజర్లకూ ఈ ఫీచర్ బాగా ఉపయోగపడనుంది. అయితే, వాట్సాప్‌లో ఈ కొత్త ఫీచర్ ఎప్పుడు వస్తుందనే దానిపై స్పష్టత రాలేదు. ఈ ఫీచర్‌ అప్‌డేటెడ్‌ ఆండ్రాయిడ్, ఐఓఎస్‌, డెస్క్‌టాప్‌ యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వస్తుందని వాబీటాఇన్ఫో తెలిపింది. దీనికి సంబంధించి స్క్రీన్‌షాట్‌ను కూడా విడుదల చేసింది.

వాబీటాఇన్ఫో తెలిపిన వివరాల ప్రకారం.. చాట్‌ ఫిల్టర్‌ ఫీచర్‌ ప్రస్తుతం బిజినెస్‌ అకౌంట్‌ వాడే యూజర్లకు మాత్రమే అందుబాటులోకి వస్తుంది. దీంతో పాత చాట్‌లను త్వరగా కనుక్కోవచ్చు. వాట్సాప్‌ బీటా వెర్షన్‌ 2.2216.40 వాడే యూజర్లతో పాటు బీటా డెస్క్‌టాప్‌ యూజర్లకూ తొలుత ఈ ఫీచర్‌ అందుబాటులోకి రానుంది. ఈ ఫీచర్‌ ఇంకా పరీక్ష దశలో ఉంది. త్వరలో యూజర్ల ముందుకు రానుంది.

ఇదిలా ఉండగా.. వాట్సాప్‌లో ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ చేసేందుకు వీలుగా వాట్సాప్‌ పేమెంట్స్‌ను పరిచయం చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఫ్రాడ్‌ నెంబర్లను సులువుగా గుర్తించేందుకు ‘లీగల్‌’ పేర్లను గుర్తించడం ప్రారంభించింది. యూజర్ల పేర్లు, బ్యాంకు ఖాతాలతో ఉన్న పేర్లు సరిగ్గా ఉన్నాయా లేదా అని పోల్చి చూడనుంది. నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) మార్గదర్శకాల ప్రకారం మోసపూరిత ఆన్‌లైన్‌ పేమెంట్స్‌ను చెక్ పెట్టడానికి దీనిపై వాట్సాప్‌ కృషి చేస్తుందని మెటా యాజమాన్యం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని