WhatsApp: వాట్సాప్‌లో ఎస్సెమ్మెస్‌ ఫీచర్‌.. బిజినెస్ ఖాతాదారుల కోసం డైరెక్టరీ!

వాట్సాప్‌ యూజర్స్ కోసం మరో రెండు కొత్త ఫీచర్స్‌ను పరిచయం చేయనుంది. వీటిలో ఒకటి సాధారణ ఎస్సెమ్మెస్ తరహా ఫీచర్‌ కాగా.. బిజినెస్ ఖాతాదారుల కోసం బిజినెస్ డైరెక్టరీని అందుబాటులోకి తీసుకురానుంది. 

Published : 27 Dec 2021 21:09 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: వాట్సాప్‌లో టెక్ట్స్, ఫొటో లేదా ఇతర మీడియా ఫైల్ పంపాలంటే చాట్ పేజ్‌ ఓపెన్ చేసి మెసేజ్ టైప్‌ చేయడం లేదా మీడియా ఫైల్‌ అటాచ్ చేసి సెండ్ బటన్ క్లిక్ చేస్తాం. ఒకవేళ ఎస్సెమ్మెస్ తరహాలో మెసేజ్ పంపేముందు కాంటాక్ట్‌లను సెలెక్ట్ చేసుకుంటే ఒకే మెసేజ్‌ లేదా ఫైల్‌ను సులువుగా షేర్ చేయొచ్చు. వాట్సాప్ త్వరలోనే ఈ కొత్త ఫీచర్‌ను యూజర్స్‌కు పరిచయం చేయనుంది. దీని ద్వారా యూజర్స్ ఎవరికి మెసేజ్ పంపాలనుకుంటున్నది ముందుగానే సెలెక్ట్ చేయొచ్చు. ఇందుకోసం వాట్సాప్‌ ఇంటర్‌ఫేస్‌లో కీలక మార్పులు చేయనుందట. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే యూజర్స్‌కు అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది.

ప్రస్తుతం వాట్సాప్‌లో షేరింగ్ ఫీచర్‌ అందుబాటులో ఉన్నప్పటికీ ముందుగా మెసేజ్‌ను ఎవరికైనా పంపిన తర్వాత మాత్రమే షేర్ చేయగలం. అది కూడా ఐదుగురికి మాత్రమే. బ్రాడ్‌కాస్ట్ ఫీచర్‌లో కూడా ముందుగా బ్రాడ్‌కాస్ట్ లిస్ట్ తయారు చేయాల్సిందే. అయితే ఇది ప్రతిసారీ సాధ్యంకాకపోవచ్చు. అందుకే మెసేజ్‌ పంపేముందే కాంటాక్ట్‌ను ఎంపిక చేసుకునేలా సాధారణ ఎస్సెమ్మెస్‌ తరహా ఫీచర్‌ను వాట్సాప్ పరిచయం చేయనుంది. 

దానితోపాటు యూజర్‌ టెక్ట్స్, ఫొటో, వీడియో, గిఫ్‌లను ఇతరులతో షేర్‌ చేస్తూనే స్టేటస్‌లో అప్‌డేట్ చేసుకునేందుకు వీలుగా మరో ఫీచర్‌ను వాట్సాప్ త్వరలో అందుబాటులోకి తీసుకురానుంది. ఇందుకోసం యూజర్స్ మీడియా ఫైల్స్‌ను సెలెక్ట్ చేసినప్పడు స్టేటస్‌ అప్‌డేట్ ఆప్షన్‌ కూడా కనిపించేలా ఇంటర్‌ఫేస్‌లో మార్పులు చేయనుంది.  

అలానే వాట్సాప్ బిజినెస్ ఖాతాదారులకు మరో కొత్త ఫీచర్‌ కూడా అందుబాటులోకి రానుంది. దీని ద్వారా బిజినెస్ ఖాతాదారులు తమ దగ్గర్లోని రెస్టారెంట్లు, కిరాణా దుకాణాలు, షాపింగ్ మాల్స్‌కు సంబంధించిన సమాచారం తెలుసుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్ బిజినెస్ యాప్‌లో బిజినెస్ డైరెక్టరీ పేరుతో ఫీచర్‌ను యాడ్ చేయనుంది. ప్రస్తుతం ఈ ఫీచర్‌ ఆండ్రాయిడ్ బీటా యూజర్స్‌కు అందుబాటులో ఉంది. త్వరలోనే పూర్తిస్థాయిలో యూజర్స్‌కు పరిచయం చేయనున్నట్లు వాబీటాఇన్ఫో తెలిపింది.

Read latest Tech & Gadgets News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని