WhatsApp: వాట్సాప్‌లో డివైజ్‌ రీనేమ్‌ ఫీచర్‌.. ఆ ఖాతాదారులకు మాత్రమే!

మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను యూజర్ల కోసం తీసుకురానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మల్టీడివైజ్‌ ఫీచర్‌కు అనుబంధంగా ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. 

Published : 06 Jun 2022 14:33 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మెసేజింగ్ యాప్‌ వాట్సాప్‌ మరో కొత్త ఫీచర్‌ను యూజర్ల కోసం తీసుకురానుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న మల్టీడివైజ్‌ ఫీచర్‌కు అనుబంధంగా ఈ కొత్త ఫీచర్‌ను పరిచయం చేయనుంది. దీంతో బిజినెస్‌ ఖాతా కలిగిన యూజర్లు తమ వాట్సాప్‌ ఖాతాకు లింక్‌ అయిన డివైజ్‌ల పేర్లను మార్చుకోవచ్చు. మల్టీడివైజ్‌ ఫీచర్‌ అందుబాటులోకి వచ్చిన చాలా మంది బిజినెస్‌ యూజర్లు తమ వాట్సాప్‌ ఖాతాతో వేర్వేరు డివైజ్‌లలో లాగిన్‌ అవుతున్నారు. ఈ క్రమంలో కొన్నిసార్లు యూజర్లు ఆయా డివైజ్‌ల నుంచి లాగౌట్ చేయడం మరిచిపోతున్నారు. దీంతో ఇతరులు వారి ఖాతాలను ఉపయోగించే అవకాశం ఉంది.

ఈ సమస్యకు పరిష్కారంగా యూజర్లు ఉపయోగించే డివైజ్‌లకు తమకు నచ్చిన పేరును మార్చుకుంటే, ఒకవేళ లాగౌట్‌ చేయడం మర్చిపోయినా.. మొబైల్‌లో మల్టీడివైజ్‌ ఫీచర్‌లోకి వెళ్లి సులువుగా సదరు డివైజ్‌ నుంచి లాగౌట్‌ చేయవచ్చని వాట్సాప్‌ అభిప్రాయపడుతోంది. ఈ ఫీచర్‌లో యూజర్లు ఒకేసారి పది డివైజ్‌లకు తమకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ బీటా యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుందని వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటా ఇన్ఫో) తెలిపింది. ఈ ఫీచర్‌ కోసం యూజర్లు వాట్సాప్‌ సెట్టింగ్స్‌లో లింక్‌ డివైజ్‌లోకి వెళితే డివైజ్‌ సెక్షన్‌లో నేమ్‌ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసి డివైజ్‌ పేరు మార్చుకోవచ్చు. 

ఇటీవలే వాట్సాప్‌ బిజినెస్‌ యూజర్లకు మల్టీడివైజ్‌ ఫీచర్‌ పరిధిని నాలుగు డివైజ్‌ల నుంచి పది డివైజ్‌లకు పెంచింది. అయితే పది డివైజ్‌ల ఫీచర్‌ను కావాలంటే మాత్రం యూజర్లు వాట్సాప్‌ ప్రీమియంకు సబ్‌స్క్రైబ్‌ చేసుకోవాల్సిందే. ప్రస్తుతం బిజినెస్‌ ఖాతాదారులకు మాత్రమే అందుబాటులో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో సబ్‌స్క్రిప్షన్‌ ఆధారిత సేవల్లో భాగంగా సాధారణ వాట్సాప్‌ యూజర్లకు కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని