WhatsApp Last Seen: వాట్సాప్‌ లాస్ట్‌సీన్.. అనుమతించిన వారికి మాత్రమే!

వాట్సాప్ త్వరలో మరో కొత్త ఫీచర్‌ను యూజర్‌కి పరిచయం చేయనుంది. వాట్సాప్‌లో లాస్ట్‌సీన్‌లో ఉన్న ఎవ్రీవన్‌, మై కాంటాక్ట్స్‌, నోబడీ ఆప్షన్లకు తోడుగా మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌ అనే ఫీచర్‌ను తీసుకురానుంది. దీంతో యూజర్స్ తమ లాస్ట్‌సీన్‌ను ఎవరు చూడాలనేది నిర్ణయించుకోవచ్చు. 

Updated : 24 Nov 2022 14:05 IST

ఇంటర్నెట్‌డెస్క్: ఇతర మెసేజింగ్ యాప్‌లకు పోటీగా వాట్సాప్‌ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌ని పరిచయం చేస్తోంది. ఇటీవల వరుసగా యూజర్ గోప్యతకు సంబంధించిన ఫీచర్స్‌ను ఎక్కువగా విడుదల చేస్తోంది. వీటిలో ప్రొఫైల్‌ ప్రైవసీ సెట్టింగ్‌, బ్యాకప్‌ డేటా ఎండ్‌-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్‌, పేమెంట్ వెరిఫికేషన్‌ వంటి ఎన్నో రకాల ఫీచర్స్‌ ఉన్నాయి. తాజాగా యూజర్‌ ప్రైవసీకి సబంధించి మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. వాట్సాప్‌ లాస్ట్‌సీన్‌లో ఉన్న ఎవ్రీవన్‌, మై కాంటాక్ట్స్‌, నోబడీ ఆప్షన్లకు అదనంగా కొత్తగా ‘మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌’ అనే ఆప్షన్‌ను పరిచయం చేయనుంది. ఇప్పటి వరకు వాట్సాప్‌లో వచ్చిన మెసేజ్‌, ఫొటో, వీడియో, ఆడియో లేదా డాక్యుమెంట్‌లను చివరగా ఎప్పుడు చూశామనేది ఇతరులు చూడొచ్చు. కొత్తగా తీసుకొస్తున్న మై కాంటాక్ట్ ఎక్సెప్ట్‌ ఆప్షన్‌తో యూజర్‌ అనుమతించిన వారు మాత్రమే లాస్ట్‌సీన్‌ను చూడగలరు.

గతంలో లాస్ట్‌సీన్‌ని యూజర్‌ తన కాంటాక్ట్‌ లిస్ట్‌లోని వ్యక్తులు మాత్రమే చూడాలని భావిస్తే.. మిగతా వారికి కనిపించకుండా ‘మై కాంటాక్ట్స్‌’ ఆప్షన్‌, ఎవరైనా చూడొచ్చనుకుంటే ‘ఎవ్రీవన్‌’, ఎవరూ చూడకూడదనుకుంటే ‘నోబడీ’ ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు. ఒకవేళ కాంటాక్ట్‌ లిస్ట్‌లోని నిర్దిష్టమైన వ్యక్తి చూడకూడదనుకుంటే మాత్రం కొత్తగా రాబోతున్న ‘మై కాంటాక్ట్స్‌ ఎక్సెప్ట్‌’ ఆప్షన్‌ సెలెక్ట్‌ చేసి ఎవరైతే చూడకూడదు అనుకుంటున్నారో వారిని సెలెక్ట్ చేస్తే సరిపోతుంది. ప్రస్తుతం పరీక్షల దశలో ఉన్న ఈ ఆప్షన్‌ను త్వరలోనే యూజర్స్‌కి అందుబాటులోకి తీసుకురానున్నట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాట్సాప్‌ బీటా ఇన్ఫో (వాబీటాఇన్ఫో) తెలిపింది. అంతకుముందే ఈ ఆప్షన్‌ను పరీక్షించదలచుకున్న ఆండ్రాయిడ్ యూజర్స్‌ వాట్సాప్ బీటా v2.21.23.14 వెర్షన్‌కి అప్‌డేట్ చేసుకోవచ్చు. త్వరలో ఇదే ఫీచర్‌ను ప్రొఫైల్‌ ఫొటోకు కూడా తీసుకురానున్నట్లు వాబీటాఇన్ఫో చెబుతోంది. 

Read latest Gadgets & Technology News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని