WhatsApp: కొత్త మల్టీ-డివైజ్‌.. అప్‌డేట్‌తో ‘పుష్‌’ బగ్‌ ఫిక్స్‌.. అదృశ్యం కాకుండా మెసేజ్‌లు!

ఐప్యాడ్‌ వినియోగదారుల కోసం వాట్సాప్ త్వరలో ప్రత్యేక వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి మల్టీ-డివైస్ 2.0పై వాట్సాప్‌ పని చేస్తోంది.

Published : 30 May 2022 02:27 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌లో ‘డిస్‌అప్పియరింగ్ మెసేజ్‌’ ఫీచర్‌ ఇప్పటికే అందరికీ అందుబాటులోకి ఉన్న సంగతి తెలిసిందే. నిర్దిష్ట కాంటాక్ట్‌కు ఈ ఫీచర్‌ను ఎనేబుల్‌ చేస్తే.. ఎంచుకున్న సమయానికి అనుగుణంగా మెసేజ్‌లను వాటంతటవే ఆటోమేటిక్‌గా వాట్సాప్‌ డిలీట్‌ చేస్తుంది. అయితే, ఈ ఫీచర్‌ ద్వారా కొన్ని ముఖ్యమైన మెసేజ్‌లు కూడా డిలీట్‌ అవుతున్నాయి. దీనికి చెక్‌ పెట్టేలా వాట్సాప్‌ కొత్త ఫీచర్‌ను తీసుకురానున్నట్లు సమాచారం. 

ఈ మేరకు కాంటాక్ట్‌లు, గ్రూపుల్లో వచ్చే ముఖ్యమైన మెసేజ్‌లను ప్రత్యేకంగా ఓ జాబితా చేసుకోవచ్చు. ఇందుకు యూజర్లకు త్వరలో కొత్త ఫీచర్‌ను పరిచయం చేయాలని వాట్సాప్‌ యోచిస్తోంది. తద్వారా ముందే ఎంపిక చేసుకున్న మెసేజ్‌లు చాట్‌ నుంచి డిస్‌అప్పియరింగ్‌ అయినా.. సేవ్‌ చేసిన జాబితాలో అందుబాటులో ఉంటాయి. గ్రూపుల్లోని ప్రతిఒక్కరూ మెసేజ్‌లను అన్‌-కీప్‌ చేసే అవకాశం ఉంది కాబట్టి.. ఈ ఫీచర్‌ను మరింత సులభతరం చేయడానికి వాట్సాప్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు వాట్సాప్‌ కమ్యూనిటీ బ్లాగ్ వాబీటా ఇన్ఫో పేర్కొంది.

ఐప్యాడ్‌ యూజర్ల కోసం.. 

అలాగే ఐప్యాడ్‌ వినియోగదారుల కోసం వాట్సాప్ త్వరలో ప్రత్యేక వెర్షన్‌ను విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి మల్టీ-డివైజ్‌ 2.0పై వాట్సాప్‌ పని చేస్తోంది. ఇది ఐప్యాడ్‌లకు సపోర్ట్ చేసే సామర్థ్యంతో వస్తుంది. కొనేళ్లుగా ఐప్యాడ్‌ వినియోగదారులకు ప్రత్యేక వాట్సాప్‌ అప్లికేషన్‌ అంటూ ఏదీ లేదు. ఇందుకు యూజర్ల నుంచి వచ్చిన డిమాండ్‌ నేపథ్యంలో ప్రత్యేక వెర్షన్‌ను వాట్సాప్‌ విడుదల చేయనుంది. ఈ మల్టీ-డివైజ్‌ 2.0 వాట్సాప్‌ ద్వారా భవిష్యత్తులో ఒకే ఖాతాను మొబైల్‌, టాబ్లెట్‌కు లింక్‌ చేసుకొని వాడుకోవచ్చు. అయితే, ఈ ఐప్యాడ్ వెర్షన్ ఎప్పుడు విడుదల చేస్తారన్నది వాట్సాప్‌ ఇంకా వెల్లడించలేదు.

ఒక్క అప్‌డేట్‌తో చెక్‌..

డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో పుష్‌ నోటిఫికేషన్‌ల సమస్యలకు వాట్సాప్‌ చెక్ పెట్టింది. ఒక్క అప్‌డేట్‌తో బగ్‌ను ఫిక్స్‌ చేసింది. చాలా మంది వినియోగదారులు తమ డెస్క్‌టాప్‌లో పుష్‌ నోటిఫికేషన్లు స్వీకరించలేకపోయారు. ఇందుకు సంబంధించి పలువురు వాట్సాప్‌కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో డెస్క్‌టాప్ తాజా వెర్షన్‌ అప్‌డేట్‌లో సమస్యను వాట్సాప్‌ అధికారికంగా పరిష్కరించింది. మీరూ డెస్క్‌టాప్‌ వెర్షన్‌ వాడుతున్నట్లయితే ఈ కొత్త అప్‌డేట్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోండి.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని