Instagram: యూజర్ల ‘బర్త్‌ డే’లపై ఇన్‌స్టా కన్ను.. ఎందుకోసమంటే?

ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ల పుట్టిన రోజును సేకరించే పనిలో పడింది. ఎప్పుడూ లేనిది ఇదేంటీ కొత్తగా?

Updated : 09 May 2022 20:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఫొటో షేరింగ్‌ యాప్‌ ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్ల పుట్టిన రోజును సేకరించే పనిలో పడింది. ఎప్పుడూ లేనిది ఇదేంటీ కొత్తగా? అని కొంత మంది యూజర్లు ఆశ్చర్యానికి గురవుతున్నారు. అసలు ఈ సమాచారం దేనికోసమంటూ నెట్టింట్లో చర్చిస్తున్నారు. ఇప్పటికే దీనిపై పలువురు యూజర్లు యాప్‌లో ‘రిపోర్ట్‌’ ద్వారా ప్రశ్నిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి. మరి దీనికి అసలు కారణం ఏమై ఉంటుంది?

ఎందుకోసమంటే?

ఇన్‌స్టాగ్రామ్‌ ఇంతవరకు యూజర్లను తమ పుట్టిన రోజును నమోదు చేయాలని అడగలేదు. వయసుతో సంబంధం లేకుండానే ఖాతా తెరుచుకునే వెసులుబాటు కల్పించింది. అయితే, కొద్దికాలం నుంచి ఇన్‌స్టాగ్రామ్‌ ఏజ్‌ వేరిఫికేషన్‌ ప్రాసెస్‌ను తప్పనిసరి చేయాలని చూస్తోంది. తాజాగా దీనిపై సన్నాహాలు ముమ్మరం చేసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 13 ఏళ్లలోపు ఉన్న మైనర్‌ యూజర్ల సంఖ్యను తగ్గించాలని నిర్ణయం తీసుకుంది. అందుకోసమే పుట్టినరోజు సమాచారాన్ని ప్రతి ఒక్కరూ నమోదు చేయాలని యూజర్లను కోరుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌ తీసుకున్న ఈ నిర్ణయంతో చాలా వరకు ఫేక్‌ ఐడీలకు చెక్‌ పడే అవకాశం ఉంది.

 

‘‘మీరు ఎప్పటిలాగే ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించాలంటే ముందుగా మీ పుట్టినరోజు తేదీలను నమోదు చేసుకోండి. ఇన్‌స్టా కమ్యూనిటీ భద్రతకు ఇది సాయపడుతుందని భావిస్తున్నాం. మీ వివరాలు పబ్లిక్‌ ప్రొపైల్‌లో షేర్‌ అవ్వవు’’ అని బర్త్‌ డే పేజీలో ఇన్‌స్టాగ్రామ్‌ పేర్కొంది.

కొంతమంది తప్పుడు తేదీలను ఎంటర్‌ చేసి ఇన్‌స్టాను వాడొచ్చు కదా అనే సందేహం కలగవచ్చు. అయితే, ఫేక్‌ బర్త్‌డేలను గుర్తించడంపైనా ఇన్‌స్టా ప్రత్యేకంగా దృష్టి సారించింది. మనం నమోదు చేసిన తేదీలను ఫేస్‌బుక్‌ డేటా నుంచి క్రాస్‌ చెక్‌ చేయనుంది. ఒకవేళ తప్పుడు తేదీలను ఎంటర్‌ చేసినా ఇన్‌స్టా యాప్‌ సైన్‌ అప్‌ అవ్వదు. కాబట్టి ఫేసుబుక్‌లో ఎంటర్ చేసిన పుట్టిన రోజు తేదీనే ఇన్‌స్టాలో నమోదు చేసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని