Xiaomi 11T Pro: షావోమి హైపర్‌ ఛార్జ్‌ టెక్‌.. ఎంఐయూఐ కొత్త ఫీచర్‌

Xiaomi 11T Pro: షావోమి సెప్టెంబరు 15న విడుదల చేయనున్న షావోమి 11టీ ప్రో మోడల్‌లో హైపర్ ఛార్జ్‌ టెక్నాలజీని తీసుకొస్తున్నారు. అలానే షావోమి ఎంఐయూఐ ఓఎస్‌లో ప్యూర్‌ మోడ్‌ను పరిచయం చేయనుంది. 

Updated : 12 Aug 2022 12:07 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: షావోమి త్వరలో మరో కొత్త మోడల్‌ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. షావోమి  11టీ పేరుతో తీసుకొస్తున్న ఈ మోడల్‌ను రెండు వేరియంట్లలో పరిచయం చేయనుంది. తాజాగా ఈ ఫోన్‌కి సంబంధించిన ఆసక్తికర ఫీచర్‌ గురించిన సమాచారాన్ని షావోమి వెల్లడించింది. ఈ ఫోన్‌ 120 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుందని షావోమి ట్వీట్ చేసింది. ఈ మోడల్‌ను సెప్టెంబరు 15న మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ఎంఐ 10టీ మోడల్‌కి కొనసాగింపుగా షావోమి 11టీని తీసుకొస్తున్నారు. ఎంఐ 10టీ మోడల్‌లో 33 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్ ఫీచర్‌ను ఇస్తే.. 11టీలో మాత్రం ఏకంగా 120 వాట్‌ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్ ఇస్తున్నారు. ఇందుకోసం షావోమి 11టీలో హైపర్ ఛార్జ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీని ఉపయోగించినట్లు సమాచారం. ఈ ఫోన్‌లో 5,000 ఎంఏహెచ్‌ బ్యాటరీ  ఇస్తున్నట్లు తెలుస్తోంది. 

షావోమి 11టీ, 11టీ ప్రో వేరియంట్లలో ఈ మోడల్‌ని తీసుకొస్తుందట. దాదాపు రెండు మోడల్స్‌లోనూ ఒకే విధమైన ఫీచర్స్ ఉంటాయని సమాచారం. షావోమి 11టీ ప్రో 120 హెర్జ్ రిఫ్రెష్‌ రేట్‌తో అమోలెడ్ డిస్‌ప్లే ఇస్తున్నారట. స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్ ఉపయోగించారని తెలుస్తోంది. వీటితోపాటు షావోమి పాడ్‌ 5 పేరుతో ట్యాబ్‌లను కూడా విడుదలచేయనుందని టెక్‌ వర్గాల సమాచారం. పూర్తి వివరాలు తెలియాలంటే విడుదల తేదీ వరకు వేచి చూడాల్సిందే.  

షావోమి ప్యూర్‌ మోడ్‌ వచ్చేస్తోంది! 

ఇదేకాకుండా షావోమి సైడ్‌లోడింగ్ యాప్స్‌కి సంబంధించి మార్పులు చేయనుంది. యాపిల్‌ ఐఓఎస్‌కి  భిన్నంగా ఆండ్రాయిడ్ ఈకోసిస్టమ్‌లోని కీలకమైన ఫీచర్‌ సైడ్‌లోడింగ్ యాప్స్‌. అంటే ఆయా కంపెనీల యాప్‌ స్టోర్‌ నుంచే డైరెక్టుగా యూజర్‌ యాప్‌(ఏపీకే)ను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అయితే వీటికి ఆండ్రాయిడ్ ప్లేస్టోర్ ప్రొటెక్షన్‌ ఉండదు కాబట్టి కొన్నిసార్లు మాల్‌వేర్ ఉన్న యాప్‌లను ఇన్‌స్టాల్ చేసుకుంటే యూజర్స్ చిక్కుల్లో పడే ప్రమాదం ఉంది. అందుకే షావోమి ప్యూర్‌ మోడ్‌ అనే కొత్త ఫీచర్‌ను తీసుకురావాలని భావిస్తోంది.

ప్రస్తుతం ప్రయోగాల దశలో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలోనే షావోమి ఎంఐయూఐ ఓఎస్‌లో పరిచయం చేయనుందట. ఈ ప్యూర్‌ మోడ్‌ షావోమి ఫోన్లలో సైడ్‌లోడింగ్ ఆండ్రాయిడ్ యాప్స్‌ని డిసేబుల్ చేస్తుంది. దాంతో యూజర్స్‌ ఏపీకేలను ఇన్‌స్టాల్ చేసుకోలేరు. ఏపీకే డౌన్‌లోడ్స్‌లో 40 శాతం భద్రతాపరమైన పరీక్షలను ఎదుర్కొలేదని షావోమి తెలిపింది. అలానే 10 శాతం ప్రమాదకరమైనవిగా గుర్తించినట్లు వెల్లడించింది, యూజర్‌కి మెరుగైన భద్రతపరమైన ఫీచర్స్‌ని అందించేందుకే ఈ ప్యూర్ మోడ్‌ని పరిచయం చేస్తున్నట్లు షావోమి ప్రకటించింది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని