Xiaomi 12S Ultra: సోని సెన్సర్‌తో షావోమి ఫోన్‌ కెమెరా.. ఇక మొబైల్‌తోనే వీడియో షూట్‌!

షావోమి సంస్థ వచ్చే వారంలో ఒక కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. షావోమి తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫొటోగ్రఫీలో కొత్త మార్పుకు నాంది కానుందని టెక్‌ వర్గాలు అంటున్నాయి...

Published : 01 Jul 2022 02:04 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: షావోమి సంస్థ వచ్చే వారంలో ఒక కొత్త ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనుంది. ప్రతి నెలా మొబైల్ కంపెనీలు కొత్త మోడల్స్‌ను విడుదల చేస్తుంటాయి.. అందులో కొత్తేముంది అంటారా..? షావోమి తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌ ఫొటోగ్రఫీలో కొత్త మార్పుకు నాంది కానుందని టెక్‌ వర్గాలు అంటున్నాయి. షావోమి 12ఎస్‌ అల్ట్రా (Xiaomi 12S Ultra) పేరుతో తీసుకొస్తున్న ఈ ఫోన్‌లో ఒక అంగుళం సోనీ కెమెరా సెన్సర్‌ ఉపయోగించారు. ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్‌ కెమెరాలలో ఉపయోగిస్తున్న కెమెరా సెన్సర్‌లతో పోలిస్తే ఇది 1.7 రెట్లు పెద్దది. ఈ సెన్సర్‌తో భారత్‌ మార్కెట్లో విడుదలవుతున్న తొలి ఫోన్‌ కూడా ఇదే. ఇప్పటి వరకు ఈ సెన్సర్‌ను సోని ఎక్స్‌పీరియా ప్రో-1, ఆక్వాస్‌ ఆర్‌7లో మాత్రమే ఉపయోగించారు. అయితే ఈ ఫోన్లు భారత్‌లో అందుబాటులో లేవు. 

ఏమిటీ కెమెరా సెన్సర్‌?  

ఈ సెన్సర్‌తో కెమెరా పనితీరు మెరుగ్గా ఉండటమే కాకుండా.. తక్కువ లైటింగ్‌లో కూడా ఫొటోలు తీసుకోవచ్చని షావోమి చెబుతోంది. సోనీ ఐఎమ్‌ఎక్స్‌ 989 (Sony IMX989)గా పిలిచే ఈ సెన్సర్‌ను సోనీ సంస్థ తన ఆర్‌ఎక్స్‌100 7 (RX100 VII) కెమెరాలలో ఉపయోగిస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న మోడల్స్‌లో వీడియో కంటెంట్‌ క్రియేటర్స్‌, యూట్యూబర్స్‌కు దీన్ని అనువైన కెమెరాగా చెబుతుంటారు. ఈ కెమెరా సెన్సర్‌ను ఉపయోగించడం ద్వారా కంటెంట్‌ క్రియేటర్స్‌ ప్రత్యేకమైన కెమెరా అవసరంలేకుండా మొబైల్‌తోనే వీడియోలను షూట్‌ చేయొచ్చని షావోమి చెబుతోంది. దీనితోపాటు షావోమి జర్మనీకి చెందిన కెమెరా తయారీ సంస్థ లైకా (Leica)తో కూడా ఒప్పందం చేసుకుంది. ఇందులో భాగంగా షావోమి 12ఎస్‌ అల్ట్రా మోడల్‌లో సోని సెన్సర్‌తో లైకా కెమెరా సెటప్‌ను పరిచయం చేస్తోంది.

షావోమి 12ఎస్‌ అల్ట్రా ఫీచర్లు

ఈ ఫోన్‌లో 120 హెర్జ్‌ రిఫ్రెష్‌ రేట్‌తో 6.28 అంగుళాల అమోలెడ్‌ డిస్‌ప్లే ఇస్తున్నారు. స్నాప్‌డ్రాగన్‌ 8+ జెన్‌ 1 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. వెనుకవైపు 50 ఎంపీ ప్రధాన కెమెరాతోపాటు 13 ఎంపీ అల్ట్రావైడ్‌ యాంగిల్‌, 5ఎంపీ కెమెరాలు ఉన్నాయి. ముందుభాగంలో 32 ఎంపీ సెల్ఫీ కెమెరా అమర్చారు. 4,500 ఎంఏహెచ్‌ బ్యాటరీ, 120 వాట్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 8 జీబీ ర్యామ్‌/128 జీబీ స్టోరేజ్‌, 12 జీబీ/256 జీబీ వేరియంట్లలో లభిస్తుందని సమాచారం. ముందుగా జులై 4న చైనాలో, తర్వాత అంతర్జాతీయ మార్కెట్లో విడుదల చేయనున్నారు. దీని ధర భారత మార్కెట్లో ₹ 40 వేల నుంచి ₹ 50 వేల మధ్య ఉంటుందని అంచనా.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు