Xiaomi MiGU Headband: షావోమి హెడ్‌బ్యాండ్‌.. మనిషి మెదడును చదివేస్తుంది!

షావోమి ఎమ్‌ఐజీయూ హెడ్‌బ్యాండ్‌ పేరుతో తీసుకొస్తున్న గ్యాడ్జెట్‌తో ఇంట్లోని స్మార్ట్‌ ఉత్పత్తులను నియంత్రించవచ్చు. ఫ్యాన్‌, లైట్‌, టీవీ వంటి వాటితోపాటు ఇతర ఏఐ ఆధారిత ఉత్పత్తులను నియంత్రిస్తుందట.

Updated : 11 Aug 2022 17:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాంకేతికత అభివృద్ధి చెందుతున్న కొద్దీ వివిధ రకాల గ్యాడ్జెట్స్‌ అందుబాటులోకి వస్తున్నాయి. వాటిలో చాలా వరకు రోజువారీ జీవితంలో సాయపడుతుంటే, మరికొన్ని మనిషిని సోమరిని చేస్తాయేమో అనే సందేహాన్ని కలిగించేవి ఉన్నాయి. తాజాగా షావోమి తీసుకొస్తున్న గ్యాడ్జెట్‌ రెండో కోవకే చెందుతుంది. ఎంఐజీయూ హెడ్‌బ్యాండ్‌ (Xiaomi MiGU Headband) పేరుతో షావోమి తీసుకొస్తున్న గ్యాడ్జెట్‌తో ఇంట్లోని స్మార్ట్‌ ఉత్పత్తులను నియంత్రించవచ్చట. ఫ్యాన్‌, లైట్‌, టీవీ వంటి వాటితోపాటు ఇతర ఏఐ (ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్) ఆధారిత ఉత్పత్తులను నియంత్రిస్తుందట. అందులో కొత్తేముంది.. స్మార్ట్‌ఫోన్‌ నుంచి కూడా ఈ పనిచేయవచ్చు కదా అనుకోవచ్చు. కానీ, ఈ బ్యాండ్‌ మనిషి మెదడులోని ఆలోచనల ఆధారంగా పనిచేస్తుందట. ఇంట్లోని స్మార్ట్‌ ఉత్పత్తులను నియంత్రించడంతోపాటు, కారు డ్రైవింగ్‌లోనూ సాయపడుతుందని బ్యాండ్‌ డెవలపర్స్ చెబుతున్నారు.

‘‘షావోమి ఎంఐజీయూ హెడ్‌బ్యాండ్‌లో మూడు పాయింట్లు ఉంటాయి. ఎలక్ట్రికల్‌ సిగ్నల్స్‌ పొందేందుకు, యూజర్‌ ఈఈజీ (ఎలక్టోఎన్సెఫాలోగ్రఫీ) వేవ్‌ఫామ్స్‌ చదివేందుకు ఆ పాయింట్లు సాయపడతాయి. యూజర్ల మూడ్‌ ఆధారంగా వ్యక్తపరిచే ఎమోషన్స్‌ ద్వారా ఉత్పత్తి అయ్యే వేవ్‌ఫామ్స్‌ను హెడ్‌బ్యాండ్‌లోని ఆర్టిఫిషియల్‌ లేబుల్డ్‌ మెషీన్‌ గ్రహిస్తుంది. వాటి ఆధారంగా మనిషి చేయాలనుకుంటున్న పనిని హెడ్‌బ్యాండ్‌కు అనుసంధానమైన స్మార్ట్‌ గ్యాడ్జెట్స్‌ ద్వారా పూర్తి చేస్తుంది’’ అని షావోమి తెలిపింది. ప్రస్తుతం ఈ బ్యాండ్ పరీక్షల దశలో ఉంది. త్వరలోనే యూజర్లకు అందుబాటులోకి వస్తుంది. ఈ గ్యాడ్జెట్‌తో యూజర్ల స్మార్ట్‌లైఫ్ మరింత సౌకర్యవంతంగా ఉంటుందని షావోమి చెబుతోంది. దీని పనితీరు గురించి పూర్తిగా తెలుసుకోవాలంటే మరికొంత కాలం వేచి చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని