మెసేజ్‌కి ‘టైమ్‌’ సెట్‌ చేసుకోవచ్చు!

గూగుల్‌ మెసేజింగ్‌ యాప్‌లో ఇప్పడు మెసేజ్‌లు షెడ్యూల్‌ చేసుకోవచ్చు... 

Published : 01 Mar 2021 16:32 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సోషల్‌  మీడియా వచ్చాక... మొబైల్‌లో మెసేజ్‌లను వాడేవారి సంఖ్య బాగా తగ్గిందనే చెప్పాలి. వాట్సాప్‌, టెలీగ్రామ్‌, మెసెంజర్‌లో పాష్‌ లుక్‌, ఆసక్తికర ఫీచర్లు ఉండటంతో యువత వాటివైపు మళ్లుతోంది. ఓటీపీలు, బ్యాంకు లావాదేవీల మెసేజ్‌లు, పార్సిల్‌ ట్రాకింగ్‌ మెసేజ్‌లు లాంటివే ఇప్పుడు ఎక్కువగా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో మెసేజ్‌ యాప్‌కు పూర్వ వైభవం తీసుకురావడానికి గూగుల్‌  ప్రయత్నిస్తూనే ఉంది. అందులో భాగంగా తాజాగా ‘మెసేజ్‌ షెడ్యూలింగ్‌ ’ఫీచర్‌ను తీసుకొచ్చింది. దీంతో మెసేజ్‌ను టైప్‌ చేసి... అది ఏ సమయానికి అవతలి వ్యక్తికి వెళ్లాలో నిర్ణయించొచ్చు. 

మెసేజ్‌కు టైమ్‌ సెట్‌ చేసుకునే ఫీచర్‌ ప్రస్తుతం గూగుల్‌ మెసేజింగ్‌ యాప్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని కోసం ప్లే స్టోర్‌ నుంచి మెసేజెస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుండి. యాప్‌ ఓపెన్‌ చేసినప్పుడు... ‘ఈ యాప్‌ డీఫాల్ట్‌ యాప్‌గా మార్చుకో’ అని సూచన కనిపిస్తుంది. దానిని క్లిక్‌ చేస్తే మీ పాత మెసేజ్‌ యాప్‌లోని మెసేజ్‌లన్నీ ఇందులోకి వచ్చేస్తాయి.  ఆ తర్వాత దిగువన కుడివైపు ఉన్న మెసేజ్‌ ఐకాన్‌ను క్లిక్‌ చేసి... మెసేజ్‌ పంపాల్సిన వారి నెంబరు నమోదు చేయండి. మెసేజ్‌ బాక్స్‌లో  పంపాల్సిన మెసేజ్‌ టైప్‌ చేసుకోండి. ఆ తర్వాత పక్కనున్న ‘ఎస్‌ఎంఎస్‌ సెండ్‌’ బటన్‌ను లాంగ్‌ ప్రెస్‌ చేయండి. అప్పుడు ‘షెడ్యూల్‌ సెండ్‌’ అనే ఆప్షన్‌ కనిపిస్తుంది. దానిని  క్లిక్‌ చేసి ఏ సమయానికి ఆ మెసేజ్‌ వెళ్లాలనేది ఎంటర్‌ చేయాలి. ఆ తర్వాత సెండ్‌ కొడితే... మెసేజ్‌ షెడ్యూల్‌ అయిపోతుంది.

షెడ్యూల్‌ చేసిన మెసేజ్‌ను కావాలనుకుంటే డిలీట్‌ చేసేయొచ్చు. అదే విధంగా మెసేజ్‌  వెళ్లాల్సిన సమయాన్నీ మార్చుకోవచ్చు. లేదు.. ఆ మెసేజ్‌ వెంటనే వెళ్లిపోవాలి అనుకుంటే ‘సెండ్‌ నౌ’ ఆప్షన్‌ క్లిక్‌ చేసి పంపేయొచ్చు. మీరు షెడ్యూల్‌ చేసుకున్న మెసేజ్‌ పక్కన ఉన్న ‘టైమర్‌’ ఐకాన్‌ను క్లిక్‌  చేస్తే మీకు కావాల్సిన ఆప్షన్లు కనిపిస్తాయి. గూగుల్‌ మెసేజింగ్‌ యాప్‌లో ఉన్న ఈ ఫీచర్‌ను త్వరలో అన్ని మొబైల్స్‌ తయారీ సంస్థలు తమ మెసేజింగ్‌ యాప్‌లో పొందుపరుస్తాయి. అప్పటివరకు గూగుల్‌ మెసేజెస్‌ వాడేయండి. అయితే ‘షెడ్యూల్‌ మెసేజ్‌ ’ ఆప్షన్‌ ప్రస్తుతానికి వెబ్‌ వెర్షన్‌లో  లేదు. మెసేజెస్‌ వెబ్‌ గురించి తెలుసుగా... వెబ్‌ వాట్సాప్‌ తరహాలోనే ఇదీ పని చేస్తుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని