YouTube: కొత్త లుక్‌లో యూట్యూబ్‌.. ఈ మార్పులు గమనించారా..?

యూట్యూబ్ వినియోగాన్ని సరళతరం చేస్తూ వీడియో ప్లేయర్ ఇంటర్‌ ఫేస్‌లో కీలక మార్పలు చేసింది. వాటితోపాటు లూప్ ఫీచర్‌ను కూడా పరిచయం చేసింది.   

Published : 03 Feb 2022 02:40 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నేర్చుకోవాలనే తపన, ఆసక్తి ఉన్నవారికి యూట్యూబ్ చక్కని వేదిక. ఎంతో మంది ఔత్సాహికులు యూట్యూబ్‌లో వీడియోలు చూసి నేర్చుకోవడంతోపాటు, వీడియోలు రూపొందించి ఆదాయాన్ని పొందుతున్నారు. అందుకే గూగుల్ కూడా యూట్యూబ్‌ వినియోగాన్ని సరళతరం చేస్తూ సరికొత్త ఫీచర్లను యూజర్స్‌కు, వీక్షకులకు పరిచయం చేస్తుంది. తాజాగా యూట్యూబ్‌ వీడియో ప్లేయర్‌ యూజర్‌ ఇంటర్‌ఫేస్‌ (యూఐ)లో కీలక మార్పులు చేసింది. ఇందులో భాగంగా యూట్యూబ్‌లో వీడియో ప్లేయర్‌ కింద ఉండే లైక్‌, డిస్‌లైక్‌, కామెంట్‌, ప్లేలిస్ట్‌, షేర్ ఫీచర్లను ప్లేయర్‌ స్క్రీన్‌పై కనిపించే విధంగా మార్పులు చేసింది. దీంతో యూజర్స్ సులువుగా వాటిని యాక్సెస్ చేయగలుగుతారని వెల్లడించింది.

వీటితోపాటు వీడియో ప్లేయర్‌ స్క్రీన్‌ కింద కుడివైపు చివర్లో మోర్ వీడియోస్ అనే సెక్షన్‌ను జోడించింది. యూజర్స్ మోర్ వీడియోస్ ఆప్షన్‌పై క్లిక్ చేసిన వెంటనే తర్వాతి వీడియోల జాబితా స్క్రీన్‌పై కనిపిస్తుంది. గతంలో ఇందుకోసం స్క్రీన్‌ కింది భాగంలో పైకి ట్యాప్‌ చేస్తే తర్వాతి వీడియోలు కనిపించేవి. తాజాగా వాటిని సులువుగా యాక్సెస్ చేసేందుకు యూట్యూబ్‌ మోర్‌ వీడియోస్‌ ఆప్షన్‌ను తీసుకొచ్చింది. వీటితోపాటు ప్రీమియం సబ్‌స్క్రైబర్స్‌కు అదనంగా లిజనింగ్ కంట్రోల్స్‌ను ఇస్తుంది. దీంతో యూజర్స్‌ వీడియో ఇంటర్‌ఫేస్‌ నుంచి ఆడియో ఇంటర్‌ఫేస్‌కు సులువుగా మారవచ్చు.

యూట్యూబ్ యాప్‌ ఓపెన్ చేసి వీడియో ప్లే చేసిన తర్వాత ఫుల్‌ స్క్రీన్‌ మోడ్‌లో వీడియో చూస్తున్నప్పుడు స్క్రీన్‌పై ట్యాప్‌ చేస్తే ఈ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఆండ్రాయిడ్, ఐఓఎస్‌ యూజర్స్‌కు కొత్త యూఐ అందుబాటులో ఉంది. అంతేకాకుండా యూట్యూబ్‌ లూపింగ్ ఫీచర్‌ను కూడా పరిచయం చేసింది. దీంతో యూజర్స్ ప్రతిసారీ తమకు నచ్చిన వీడియో/ఆడియోను రీప్లే చేయాల్సిన అవసరంలేకుండా అవి పూర్తయిన తర్వాత వాటంతటవే తిరిగి ప్లే అవుతాయి.

ఉదాహరణకు యూట్యూబ్‌లో మీకు నచ్చిన పాటను వింటున్నారు. పాట పూర్తిగా విన్నాక మళ్లీ వినాలనుకుంటే రీప్లే చేయడం లేదా ప్లే పాయింటర్‌ను వెనక్కు జరపాలి. అదే మీరు లూప్ ఫీచర్‌ ఎనేబుల్ చేసి వీడియో/ఆడియో ప్లే చేస్తే అవి పూర్తయిన వెంటనే తిరిగి ఆటోమేటిగ్గా మొదటి నుంచి ప్లే అవుతాయి. అలా మీరు ఎన్నిసార్లయినా వీడియో/ఆడియోను వినవచ్చు. ఈ ఫీచర్‌ కోసం డెస్క్‌టాప్‌ వెర్షన్‌లో వీడియో ప్లే చేసి దానిపై రైట్ క్లిక్ చేస్తే లూప్ ఫీచర్‌ కనిపిస్తుంది. యూట్యూబ్‌ యాప్‌లో వీడియో ప్లే చేసి కుడివైపు పైభాగంలో ఉన్న సెట్టింగ్స్‌ ఓపెన్ చేసి లూప్‌ ఫీచర్‌ను ఎనేబుల్ చేయాలి.  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని