logo

Telangana News: నాలుగేళ్లు ఆలస్యం చేసి కేంద్రంపై నిందలా?: బండి సంజయ్‌

కేంద్రం వల్ల ఉద్యోగాల భర్తీ ఆలస్యమైందని సీఎం కేసీఆర్‌ చెప్పడం విడ్డూరంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. జోనల్‌ విధానానికి 2018లోనే రాష్ట్రపతి ఆమోదముద్ర పడిందన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు...

Updated : 09 Mar 2022 19:06 IST

హైదరాబాద్‌: కేంద్రం వల్ల ఉద్యోగాల భర్తీ ఆలస్యమైందని సీఎం కేసీఆర్‌ చెప్పడం విడ్డూరంగా ఉందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. భాజపా రాష్ట్ర కార్యాలయంలో సంజయ్‌ మీడియాతో మాట్లాడారు. జోనల్‌ విధానానికి 2018లోనే రాష్ట్రపతి ఆమోదముద్ర పడిందన్నారు. రాష్ట్రపతి ఉత్తర్వులకు విరుద్ధంగా 317 జీవోను జారీ చేశారన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయకుండా నాలుగేళ్లు ఆలస్యం చేసిన కేసీఆర్.. కేంద్రంపై నిందలు వేయడం సరైంది కాదని ఆక్షేపించారు. రాష్ట్రంలో 12 వేల మంది విద్యా వాలంటీర్లను, ఉపాధి హామీ ఫీల్డ్ అసిస్టెంట్లను తొలగించారని.. 15వేల మంది స్టాఫ్‌ నర్సులను మళ్లీ పునరుద్ధరించలేదన్నారు. 2016లో నోటిఫికేషన్‌ ఇచ్చిన ఫార్మాసిస్టులకు ఇప్పటికీ ఉద్యోగం ఇవ్వలేదని మండిపడ్డారు.

‘‘అసెంబ్లీ సమావేశాల సందర్భంగా భాజపా మిలియన్ మార్చ్ చేస్తుందని భయపడి కేసీఆర్ ఉద్యోగాల ప్రకటన చేశారు. నిరుద్యోగ యువత ఆత్మహత్యలకు రాష్ట్ర ముఖ్యమంత్రే కారణం. బిస్వాల్ కమిటీ 1.91 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని నివేదిక ఇచ్చింది. 80వేల ఉద్యోగాలే భర్తీ చేస్తానంటున్న కేసీఆర్ మిగిలిన లక్ష ఉద్యోగాలు ఎక్కడికిపోయాయి?ఇవాళ అసెంబ్లీలో నిరుద్యోగ భృతిపై ఎందుకు ప్రకటన చేయలేదు? ఆలస్యంగానైనా వచ్చిన ఉద్యోగాల ప్రకటనను భాజపా విజయంగా భావిస్తున్నాం. ప్రకటించిన ఖాళీలకు వెంటనే నోటిఫికేషన్‌ ఇచ్చి పరీక్షలు నిర్వహించాలి. నిరుద్యోగులకు ఆశపెట్టి నెరవేర్చకుంటే ఊరుకునేది లేదు. పరీక్షలు నిర్వహించి, నియామక పత్రాలు ఇచ్చే వరకు పోరాడుతాం’’ అని బండి సంజయ్‌ పేర్కొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని