Telangana News: ఆ ప్రకటన ప్రగల్భమే అని అర్థమవుతోంది: బండి సంజయ్‌

తెలంగాణలోని ప్రతీ వడ్ల గింజ కొంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి 15 రోజులు కావొస్తున్నా..

Updated : 30 Apr 2022 11:59 IST

హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రతీ వడ్ల గింజ కొంటామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి 15 రోజులు కావొస్తున్నా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి లేదని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ధ్వజమొత్తారు. దీంతో ప్రభుత్వ ప్రకటన ప్రగల్భమే అని అర్థమవుతోందన్నారు. వడ్ల కొనుగోలు కేంద్రాలను, కాంటాలను వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు. ఈ మేరకు బండి సంజయ్‌ సీఎం కేసీఆర్‌కు లేఖ రాశారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో పర్యటిస్తున్న తనకు అనేక మంది రైతులు కొనుగోలు కేంద్రాలు ప్రారంభించలేదని చెబుతున్నట్లు పేర్కొన్నారు.

గద్వాల్‌ జిల్లాలో 71 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా కేవలం రెండింటినే ప్రారంభించినట్లు ఆక్షేపించారు.  వనపర్తి జిల్లాలో 225 కేంద్రాలకు గానూ 19, నారాయణపేట్‌ జిల్లాలో 91 కేంద్రాలకు 70 మాత్రమే ప్రారంభించారని బండి సంజయ్‌ లేఖలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 7 వేల వరి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాల్సి ఉండగా కేవలం 2,500 తెరిచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సర్కారు మొత్తం 60 లక్షల టన్నులు ధాన్యం కొనాల్సి ఉండగా ఇప్పటి వరకు కేవలం 2 లక్షల టన్నులు మాత్రమే కొనుగోలు చేసిందని ఆరోపించారు. దీన్ని బట్టే రాష్ట్ర ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్ల ఎంత శ్రద్ధ, చిత్తశుద్ధి ఉందో స్పష్టం అవుతోందని ఎద్దేవా చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ గింజ కొనే వరకు, రైతులకు చెల్లించాల్సిన సొమ్మును చెల్లించే దాకా వారి పక్షాన పోరాడుతామన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి క్షేత్రస్థాయిలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని బండి సంజయ్‌ లేఖలో డిమాండ్‌ చేశారు.
 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని