Hyd News: ఎంజీబీఎస్‌లో కిడ్నాపైన బాలుడి కథ సుఖాంతం

నగరంలోని ఎంజీ బస్‌స్టేషన్‌(ఎంజీబీఎస్‌)లో కిడ్నాప్‌కు గురైన నాలుగేళ్ల బాలుడు నవీన్‌ కథ సూఖాంతమైంది. నిన్న రాత్రి ఎంజీబీఎస్‌ వద్ద నల్గొండ బస్సులో బాలుడు కనిపించాడు.

Updated : 11 May 2022 18:29 IST

హైదరాబాద్‌: నగరంలోని ఎంజీ బస్‌స్టేషన్‌(ఎంజీబీఎస్‌)లో కిడ్నాప్‌కు గురైన నాలుగేళ్ల బాలుడు నవీన్ కథ సుఖాంతమైంది. మంగళవారం రాత్రి సీబీఎస్ బస్‌ స్టేషన్‌ వద్ద నల్గొండ డిపోకు చెందిన బస్సులో బాలుడు కనిపించినట్లు పోలీసులు తెలిపారు. సోమవారం రాత్రి ఎంజీబీఎస్‌లో గుర్తుతెలియని వ్యక్తి బాలుడిని తనవెంట తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. వివరాల్లోకి వెళ్తే.. ఆంధ్రప్రదేశ్‌లోని అన్నమయ్య జిల్లాకు చెందిన లక్ష్మణ్ కుమారుడు నవీన్ హైదరాబాద్ కాచిగూడలోని తన బంధువుల ఇంట్లో ఉంటున్నాడు. ఈనెల 9వ తేదీన లక్ష్మణ్ తన కుమారుడిని తీసుకెళ్లేందుకు హైదరాబాద్‌కు వచ్చారు. ఈ క్రమంలో ఎంజీబీఎస్‌లోని ప్లాట్ ఫామ్ నంబర్ 44కు చేరుకున్నాడు. బాలుడిని అక్కడే కూర్చోబెట్టి.. లక్ష్మణ్ మూత్రశాలకు వెళ్లాడు. వచ్చేసరికి బాలుడు కనిపించకుండా పోయాడు. దీంతో బాధితుడు లక్ష్మణ్ ఎంజీబీఎస్‌లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీసీ కెమెరాల్లో గుర్తుతెలియని వ్యక్తితో బాలుడు నడుచుకుంటూ వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు.

తాను బాలుడిని తీసుకెళ్లినట్లు పోలీసులకు తెలిసిపోయిందని భావించిన వ్యక్తి... నల్గొండలో బాలుడిని బస్సు ఎక్కించినట్లు  పోలీసులు అనుమానిస్తున్నారు. మిర్యాలగూడలో బయలుదేరిన బస్సు నల్గొండ మీదుగా రాత్రి హైదరాబాద్‌కి చేరుకున్నట్లు పోలీసులు నిర్ధారించుకున్నారు. మిర్యాలగూడ నుంచి వచ్చిన బస్సులో నిద్రపోతున్న బాలుడిని గమనించిన కండక్టర్.. పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే స్పందించిన అఫ్జల్‌గంజ్‌ పోలీసులు బాలుడిని కుటుంబసభ్యులకు అప్పగించారు. నవీన్‌ను తీసుకువెళ్లిన వ్యక్తి కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని