Telangana : మాదకద్రవ్యాల నియంత్రణ.. ఎంతటివారైనా ఉపేక్షించవద్దు : కేసీఆర్‌ !

తెలంగాణలో మాదకద్రవ్యాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. సమూలంగా డ్రగ్స్‌ నిర్మూలనకు వినూత్నంగా ఆలోచించాలన్నారు. డ్రగ్స్‌ నిర్మూలనకు ప్రతి ఒక్కరి సహకారం...

Updated : 28 Jan 2022 19:22 IST

హైదరాబాద్‌ : తెలంగాణలో మాదకద్రవ్యాల విక్రయాలపై ఉక్కుపాదం మోపాలని సీఎం కేసీఆర్‌ అధికారులను ఆదేశించారు. సమూలంగా డ్రగ్స్‌ నిర్మూలనకు వినూత్నంగా ఆలోచించాలన్నారు. డ్రగ్స్‌ నిర్మూలనకు ప్రతి ఒక్కరి సహకారం తీసుకోవాలన్నారు. సామాజిక ఉద్యమంగా మలచినప్పుడే డ్రగ్స్‌ కట్టడి సాధ్యమవుతుందన్నారు. మాదక ద్రవ్యాల నియంత్రణపై ప్రగతి భవన్‌లో కేసీఆర్‌ కీలక సమీక్ష నిర్వహించారు. హోం, అబ్కారీ శాఖ మంత్రులు మహమూద్‌ అలీ, శ్రీనివాస్‌గౌడ్‌, సీఎస్‌ సోమేశ్‌కుమార్‌, డీజీపీ మహేందర్‌రెడ్డితోపాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

ప్రజల్లో చైతన్యం కోసం సృజనాత్మక కార్యక్రమాలు తేవాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు. ‘‘వెయ్యి మంది సుశిక్షుతులైన సిబ్బందిని నియమించాలి. కౌంటర్‌ ఇంటెలిజెన్స్‌ సెల్‌ ఏర్పాటు చేసుకోవాలి. డ్రగ్స్‌ నియంత్రించే విభాగం శక్తిమంతంగా పని చేయాలి. అద్భుత పనితీరు కనబరిచే సిబ్బందికి ప్రోత్సాహాకాలివ్వాలి. డ్రగ్స్‌ కట్టడిలో ఎంతటివారినైనా ఉపేక్షించవద్దు. ఏ పార్టీకి చెందిన వారైనా వదిలే ప్రసక్తే లేదు’’ అని సీఎం కేసీఆర్‌ స్పష్టం చేశారు. నేరస్థుల విషయంలో నాయకుల సిఫారసులు తిరస్కరించాలని తెలిపారు.

అధునాతన పరికరాలు వాడండి

డ్రగ్స్‌ నిర్మూలనలో సమాజం సహకారం తీసుకోవాలని కేసీఆర్‌ సూచించారు. ‘‘ సర్పంచులు, టీచర్లు, విద్యార్థులతో అవగాహన కల్పించాలి. ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా చైతన్య పరచాలి. గ్రామంలో ఏ రైతు అయినా గంజాయి సాగు చేస్తే తెలపాలి. సమాచారం ఇవ్వక పోతే గ్రామానికి రైతుబంధు రద్దు చేయాలి. డ్రగ్స్‌ నెట్‌వర్క్‌ లింక్‌ గుర్తించి నిర్మూలించాలి. డ్రగ్స్‌ మాఫియా కట్టడికి పోలీసులు అధునాతన పరికరాలు వాడాలి. స్కాట్లాండ్‌ పోలీసుల విధానాలను పరిశీలించాలి. అవసరమైతే డ్రగ్స్‌ నిర్మూలిస్తున్న దేశాల్లో పర్యటించాలి. డ్రగ్స్‌ కట్టడి చేసే రాష్ట్ర అధికారులతో శిక్షణ తీసుకోవాలి. డ్రగ్స్‌ నిర్మూలనకు ఎంత ఖర్చయినా ఫర్వాలేదు, ప్రభుత్వం అన్ని వసతులు కల్పిస్తుంది’’ అని కేసీఆర్‌ అన్నారు.

ప్రాథమిక స్థాయిలోనే ఉంది

రాష్ట్రంలో డ్రగ్స్‌ వినియోగం ప్రాథమిక స్థాయిలోనే ఉందని, ఒక వేళ పెరిగితే అభివృద్ధిని పీల్చి పిప్పి చేస్తుందని సీఎం అన్నారు. వ్యవస్థీకృత నేరాల కట్టడికి పీడీ చట్టం ప్రయోగించాలని అధికారులను ఆదేశించారు. నేరస్థుల విచారణకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌లను ఆధునీకరించాలన్నారు. ‘‘ డ్రగ్స్‌ నేరస్థులను కోర్టు ఎదుట ప్రవేశపెట్టి, కేసులు వీగిపోకుండా నేరాల రుజువుకు చర్యలు చేపట్టాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని