Hyderabad : శీతల్‌ రిఫైనరీస్‌ ఎండీ ఆస్తులను అటాచ్‌ చేసిన ఈడీ

శీతల్‌ రిఫైనరీస్‌ ఎండీ జితేందర్‌ అగర్వాల్‌ ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఇప్పటికే రూ.9.53కోట్లను అటాచ్‌ చేయగా.. తాజాగా మరో రూ.43.25 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసింది. బ్యాంకులను మోసం చేశారన్న అభియోగం..

Published : 28 Jan 2022 01:50 IST

హైదరాబాద్‌ : శీతల్‌ రిఫైనరీస్‌ ఎండీ జితేందర్‌ అగర్వాల్‌ ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది. ఇప్పటికే రూ.9.53కోట్లను అటాచ్‌ చేయగా.. తాజాగా మరో రూ.43.25 కోట్ల ఆస్తులను అటాచ్‌ చేసింది. బ్యాంకులను మోసం చేశారన్న అభియోగం మోపుతూ జితేందర్‌ అగర్వాల్‌పై కేసు నమోదు చేసింది. రుణాల పేరిట ఎస్‌బీహెచ్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంకులను మోసం చేశారని పేర్కొంది. ఈ రెండు బ్యాంకులకు రూ.86 కోట్లు నష్టం చేశారని అభియోగం మోపింది.

3కే టెక్నాలజీస్‌ డైరెక్టర్ల ఆస్తులు కూడా..

మరోవైపు విదేశాలకు అక్రమంగా నిధుల తరలింపు కేసులో హైదరాబాద్‌కు చెందిన 3కే టెక్నాలజీస్ లిమిటెడ్ డైరెక్టర్ల ఆస్తులను కూడా ఈడీ అటాచ్‌ చేసింది. కరుసాల వెంకట్ సుబ్బారావు, కొడాలి తేజేష్, కడియాల వెంకటేశ్వరరావుకు చెందిన రూ.3.19 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్‌ చేసినట్లు వెల్లడించింది. 3కె టెక్నాలజీస్ భారీ ఎత్తున ఎగుమతులు చేసినట్లు నివేదికలు రావడంతో అనుమానం వచ్చి విశాఖపట్నం సెజ్  డెవలప్‌మెంట్‌ అధికారి ఈడీకి సమాచారం ఇచ్చారు. ఈడీ దర్యాప్తులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. అమెరికాలో త్రీకే టెక్నాలజీస్ ఐఎన్‌సీ 2007 ఫిబ్రవరి 23న ఏర్పాటయింది. ఆ కంపెనీలో అమెరికాలోని ఓవర్సీస్ ప్రత్యక్ష పెట్టుబడుల పథకం కింద 2010లో హైదరాబాద్ కు చెందిన 3కే టెక్నాలజీస్ లిమిటెడ్ 1.15 కోట్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. పెట్టుబడులు చేరిన మూడు నెలల్లోనే అమెరికాలోని కంపెనీని రద్దు చేశారు. అమెరికా కంపెనీ షేర్లు జారీ చేయలేదని ఆర్‌బీఐకి వార్షిక నివేదికలు సమర్పించలేదని ఈడీ తెలిపింది. నిధులు మళ్లించిన తర్వాత కంపెనీ డైరెక్టర్లు కరుసాల వెంకట్ సుబ్బారావు, తేజేశ్ కొడాలి, కడియాల వెంకటేశ్వరరావు భారత్ నుంచి అమెరికాకు వెళ్లిపోయి అక్కడే ఉంటున్నారని ఈడీ పేర్కొంది.

ఫెమా నిబంధనలు ఉల్లంఘించి అమెరికాకు తరలించిన నిధులు ఇంకా అక్కడే ఉన్నాయని.3కే టెక్నాలజీస్ డైరెక్టర్లకు సమన్లు ఇచ్చినా స్పందించడం లేదని ఈడీ తెలిపింది. విద్యార్థి వీసా అక్రమాల అభియోగంపై తేజేష్‌కు అమెరికా కోర్టు గతంలో ఐదేళ్ల జైలు 2.5 లక్షల డాలర్ల జరిమానా విధించినట్లు దర్యాప్తులో తెలిసిందని ఈడీ పేర్కొంది. ఇమ్మిగ్రేషన్ అక్రమాల కేసులో తేజేష్‌ను న్యూజెర్సీలో ఎఫ్‌బీఐ అరెస్టు చేసినట్లు కూడా తమ విచారణలో వెలుగు చూసిందని తెలిపింది. కరుసాల వెంకట్ సుబ్బారావు, కొడాలి తేజేష్, కడియాల వెంకటేశ్వరరావుకు చెందిన తెలంగాణ, ఏపీలోని 15 ఆస్తులను ఈడీ అటాచ్‌ చేసింది.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని