
గస్తీకి సుస్తీ..!!
పర్యవేక్షణ లేక పెరుగుతున్న నేరాలు
న్యూస్‌టుడే, వరంగల్ క్రైం
ఇంటర్‌సెప్టర్ వాహనం
హనుమకొండ ఠాణా పరిధిలో 20 రోజులుగా ఇన్నోవా వాహనం రోడ్డుపై ఉంది. అందులో ఈ నెల అయిదో తేదీన ఓ వ్యక్తి మృతదేహాన్ని కుళ్లిపోయిన స్థితిలో దుర్గంధం వస్తే స్థానికులు గుర్తించారు. కనీసం పెట్రోలింగ్ పోలీసులు ముందే గుర్తించి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
కాపువాడలో కల్వర్టు కింద ఇటీవల అస్థిపంజరం దొరికింది. ఎక్కడో హత్య చేసి ఇక్కడకు తెచ్చారా..? లేదంటే ఇక్కడే హత్య చేశారు..? అనే విషయం తెలియదు. రోడ్డు పనులు జరిగితేనే ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హనుమకొండ పోలీసులు కేసు నమోదు చేశారు.
హనుమకొండ కమ్మరివాడలో రాత్రి సమయంలో కొంతమంది యువకులు రోడ్డుపై హల్చల్ చేస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు.
హైదరాబాద్ తర్వాత అతిపెద్ద కమిషనరేట్‌గా వరంగల్ కమిషనరేట్‌లో 2020తో పోలిస్తే నేరాలు 2021లో 3.84 శాతం పెరిగాయని ఆ శాఖ వార్షిక నివేదికలో వెల్లడించింది. 2015లో పోలీసు కమిషనరేట్ ఏర్పాటయ్యాక దశల వారీగా పోలీస్ అధికారుల సంఖ్య, మౌలిక వసతులను పెంచారు. కిందిస్థాయి సిబ్బంది కేటాయింపు మాత్రం పెద్దగా పెరగలేదు. జిల్లాల పునర్విభజన సమయంలో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాల్లో 48 శాంతిభద్రతల విభాగాల ఠాణాలు, 3 ట్రాఫిక్ ఠాణాలు, సీసీఎస్‌తో కలిపి పెద్ద పోలీసు కమిషనరేట్‌గా ఏర్పాటు చేశారు.
పూర్తిస్థాయిలో లేకపోవడంతోనే..
నగరంలో నిరంతర గస్తీ కోసం హైదరాబాద్ తరహాలో విజిబుల్ పోలీసింగ్ కోసం నగరంలోని ఏడు ఠాణాల పరిధిలోని ఏడు ఇంటర్‌సెప్టర్ వాహనాలు సమకూర్చారు. ప్రతి వాహనంలో ముగ్గురు నుంచి అయిదుగురు సివిల్, ఏఆర్ కానిస్టేబుళ్లుంటారు. వీటికి తోడు బ్లూకోల్ట్స్ ద్విచక్రవానాలు సైతం అందించారు. సమస్యాత్మక ప్రాంతాలపై నిరంతరం నిఘా పెట్టడం, అనుమానితులపై దృష్టి పెట్టడం, గొడవలు జరగకుండా చూడటంతో పాటు ముమ్మరంగా గస్తీ నిర్వహిస్తుంటారు. అయితే చాలా ప్రాంతాల్లో పోలీసులు గస్తీ తిరగడం లేదు. నగరంలో ఏదో ఒక్క ప్రాంతంలో వాహనం నిలిపి కాసేపు ఉండి అధికారులు తనిఖీ చేసిన సమయంలో మాత్రం రోడ్డుపైకి వస్తున్నారు. తర్వాత పెట్రోలింగ్ చేయడం లేదు. పూర్తిస్థాయిలో గస్తీ కాయడం వలన అసాంఘిక కార్యకలపాలకు పాల్పడేవారు భయపడుతారు. ఈవ్‌టీజింగ్ తగ్గుతుంది.. కాలనీల్లో దొంగతనాలు ఉండవు. పాత రౌడీలు నేరాలు చేసేందుకు భయపడుతారు.
ప్రణాళికలు తయారు చేస్తున్నాం.. - సాయిచైతన్య, శాంతిభద్రతలు, ట్రాఫిక్ అదనపు డీసీపీ
పెట్రోలింగ్ ముమ్మరం చేసేందుకు ప్రణాళికలను తయారు చేస్తున్నాం. అవసరమైన వసతుల కల్పన కోసం సీనియర్ అధికారులతో చర్చించి ఆయా ప్రాంతాల్లో పెట్రోలింగ్ పెంచేలా చర్యలు తీసుకుంటాం.
సిబ్బందిపై అదనపు భారం..
కమిషనరేట్ పరిధి పెరిగినా సిబ్బంది మాత్రం పాత విధానంలోనే విధులు నిర్వహిస్తున్నారు. గతంలో సాయంత్రం సమయంలో ఎస్‌హెచ్‌వోతో పాటు ఎస్సైలు రాత్రి సమయంలో ఠాణాల పరిధుల్లో విధులు నిర్వర్తించేవారు. నగరంలో కొన్ని ఠాణాల్లో సిబ్బంది కొరత వేధిస్తుండటంతో ఉన్న సిబ్బందిపై అదనపు భారం పడుతోంది. పోలీసు అధికారులతో పాటు సిబ్బందిపై ఒత్తిడి పెరిగింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.