రూ.1000 కోట్లు కాజేశారా?

అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం. బ్యాంకులను బురిడీ కొట్టించగల నైపుణ్యం. అందరూ ఒక్కచోటికి చేరి ముఠాగా ఏర్పడ్డారు. అనుభవమే పెట్టుబడిగా కోట్లు కొల్లగొట్టారు. ఇటీవల నకిలీ కాల్‌సెంటర్లతో విదేశీయులను బురిడీ కొట్టించిన

Updated : 18 Jan 2022 09:53 IST

ఇటీవల నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సీపీయూను పరిశీలిస్తున్న సీపీ స్టీఫెన్‌ రవీంద్ర

ఈనాడు, హైదరాబాద్‌: అద్భుతమైన సాంకేతిక పరిజ్ఞానం. బ్యాంకులను బురిడీ కొట్టించగల నైపుణ్యం. అందరూ ఒక్కచోటికి చేరి ముఠాగా ఏర్పడ్డారు. అనుభవమే పెట్టుబడిగా కోట్లు కొల్లగొట్టారు. ఇటీవల నకిలీ కాల్‌సెంటర్లతో విదేశీయులను బురిడీ కొట్టించిన సైబర్‌ముఠాను సైబరాబాద్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులు అరెస్ట్‌ చేసిన సంగతి తెలిసిందే. నాలుగేళ్ల వ్యవధిలోనే ముఠా రూ.1000 కోట్ల మేర కాజేసి ఉండవచ్చని పోలీసు అధికారులు అంచనా వేస్తున్నారు. కేసులో కీలక సూత్రధారి నవీన్‌ భుటాని కనుసన్నల్లోనే వ్యవహారం సాగింది. బ్యాంకింగ్‌ రంగంలో పనిచేయటం వల్ల ఇతడికి ఆర్థిక లావాదేవీలు, క్రెడిట్‌కార్డులపై పట్టుంది.

విదేశీ కార్డులే ఎందుకంటే
ఆన్‌లైన్‌ ద్వారా కొనుగోళ్లు, చెల్లింపులు జరిపే ఖాతాదారులను లక్ష్యంగా చేసుకున్నారు. యూకే, ఆస్ట్రేలియా, సింగపూర్‌ల్లో ఉపయోగించే అధికశాతం అంతర్జాతీయ క్రెడిట్‌కార్డులకు భారతదేశంలోని బ్యాంకులు ఫ్రాంచైజ్‌గా ఉండటంతో వీటిని ఎంపిక చేసుకున్నట్టు సమాచారం. అంతర్జాతీయంగా ఖాతాదారులు చేసే కొనుగోళ్లు, నగదు చెల్లింపునకు కార్డునంబరు, సీవీవీ, ఎక్స్‌పైరీ తేదీ ఉంటే సరిపోతుంది. ఇక్కడి మాదిరిగా ఓటీపీ ఉపయోగించాల్సిన అవసరం లేదు.ఈ అవకాశమే కాసులు కురిపించింది. టోల్‌ఫ్రీ నంబర్లు, ఐపీ చిరునామాలు విదేశాల్లో నిర్వహిస్తున్నట్టుగా ట్యాంపరింగ్‌ చేసినట్టు తెలుస్తోంది. ఈ తరహా మోసాల్లో క్రెడిట్‌కార్డుల నుంచి నగదు చెల్లింపులు జరిగినా  తాము క్రెడిట్‌కార్డు ఉపయోగించిన సమయంలో అక్కడే ఉన్నట్టుగా ఆధారాలు చూపి ఖాతాదారులు తమ నగదు వెనక్కి తెచ్చుకుంటున్నారు. అంతర్జాతీయ క్రెడిట్‌కార్డుల సొమ్ము కాజేసిన ముఠా వెనుక దుబాయ్‌కు చెందిన ముగ్గురు నిందితులు సాయపడ్డారు. పేమెంట్‌ గేట్‌వేల ద్వారా కాజేసిన నగదును విదేశాలకు చేరవేశారు. నాలుగైదు దేశాలకు చెందిన హవాలా ముఠాలతో వీరికి సంబంధాలు ఉండవచ్చనే అనుమానం వ్యక్తమవుతుంది. చీకటి కార్యకలాపాలను అటు నిఘా వర్గాలు, ఇటు బ్యాంకింగ్‌ విభాగాలు గుర్తించకపోవటంతో మొదటిసారి ఉపయోగించిన టోల్‌ఫ్రీ నంబరు ద్వారా లక్షమందిని, రెండో టోల్‌ఫ్రీ నంబరుతో 33,000 మంది నుంచి రూ.కోట్లు కాజేశారు. ప్రస్తుతం సైబర్‌ పోలీసులు విదేశాల్లోని క్రెడిట్‌కార్డు వినియోగదారుల సమాచారం సేకరించే పనిలో పడ్డారు. ప్రస్తుతం జ్యుడిషియల్‌ రిమాండ్‌లో ఉన్న నిందితులను విచారించేందుకు పోలీసులు సోమవారం న్యాయస్థానంలో కస్టడీ పిటిషన్‌ దాఖలు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని