logo

అన్యాయంపై అతివ అంకుశం!

రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం.. హైదరాబాద్‌కు వలస వెళ్లి జీవనం గడుపుతుండగా గతేడాది భర్త మృతి చెందాడు.. ఇళ్లలో పని చేస్తూ జీవనం గడుపుతున్న ఆమె భర్త పేరిట ఉన్న కొద్దిపాటి భూమిని విరాసత్‌ చేసుకోవాలనుకుంది.. కానీ అధికారి

Updated : 20 Jan 2022 06:07 IST

అనిశా వలలో మరికల్‌ తహసీల్దార్‌

అదే అధికారి చేతుల మీదుగా విరాసత్‌ పట్టా అందుకున్న వైనం

న్యూస్‌టుడే, నారాయణపేట న్యూటౌన్‌, మరికల్‌

బాధితురాలు శ్రీశైల

రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబం.. హైదరాబాద్‌కు వలస వెళ్లి జీవనం గడుపుతుండగా గతేడాది భర్త మృతి చెందాడు.. ఇళ్లలో పని చేస్తూ జీవనం గడుపుతున్న ఆమె భర్త పేరిట ఉన్న కొద్దిపాటి భూమిని విరాసత్‌ చేసుకోవాలనుకుంది.. కానీ అధికారి తీరు ఆశ్చర్యంగొలిపింది.. ఎవరూ లేనిదాన్ని దయచూడండి అన్నా కనికరం చూపని అతడిని క్షమించకూడదనుకుంది.. అవినీతి నిరోధకశాఖను ఆశ్రయించి తహసీల్దార్‌ను రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టిచ్చింది.. అనిశా తహసీల్దార్‌ను విచారణ చేయడమే కాకుండా అదే అధికారి చేతుల మీదుగా విరాసత్‌ పూర్తి చేయించి ఆ మహిళకు పట్టా అందించారు.. లంచాలు అడిగిన అధికారులపై ఫిర్యాదు చేస్తే పనులు కావేమోనన్న భయం వీడాలన్న సందేశం పంపారు..

మహబూబ్‌నగర్‌ జిల్లా చిన్నచింతకుంట మండలం లాల్‌కోటకు చెందిన రాసాల సతీశ్‌ అలియాస్‌ సత్యనారాయణకు నారాయణపేట జిల్లా మరికల్‌ మండలం పెద్దచింతకుంట శివారులో 1.07 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతేడాది ఏప్రిల్‌ 26న ఆయన మృతి చెందాడు. దీంతో ఆయన పేరున ఉన్న భూమిని తన పేరు మీద మార్చుకునేందుకు భార్య శ్రీశైల గతేడాది సెప్టెంబరులో ధరణి పోర్టల్‌లో స్లాట్ బుక్‌ చేసుకున్నారు. దస్త్రాలు పరిశీలించిన తహసీల్దారు శ్రీధర్‌ ఆధార్‌ కార్డులో ఆర్‌.సతీశ్‌ అని పట్టాదారు పాస్‌ పుస్తకంలో ఆర్‌.సత్యనారాయణ ఉందంటూ రిజిస్ట్రేషన్‌ చేసేందుకు ఒప్పుకోలేదు. ఈ విషయాన్ని ఆమె తమ ఇంటి పక్కన ఉన్న రుక్ముద్దీన్‌ అనే వ్యక్తితో చెప్పుకొంది. ఆయన సహకారంతో తహసీల్దారు కార్యాలయంలో ఆర్వోఆర్‌, ఖాస్రా, పహాణీ తీసుకున్నారు. వీటన్నింటిని తహసీల్దారు ముందుంచి విరాసత్‌ చేయాల్సిందిగా కోరగా రూ.45 వేలు డిమాండ్‌ చేశారు. తన భర్త హమాలీ పని చేసేవాడని, తాను హైదరాబాద్‌లో ఇళ్లలో పని చేస్తూ జీవనం గడుపుతున్నానని దయ చూపమన్నా పట్టించుకోలేదు. రూ.25 వేలకు తక్కువైతే కుదరదని తహసీల్దారు తేల్చి చెప్పారు. దీంతో శ్రీశైల అనిశా అధికారులను ఆశ్రయించి తన గోడు వెళ్లబోసుకుంది. అధికారులు తహసీల్దారుకు ఇచ్చేందుకు గాను రూ.20 వేలు నగదు ఇచ్చారు. ఆ డబ్బును రుక్ముద్దీన్‌, శ్రీశైల బుధవారం సాయంత్రం తహసీల్దారుకు ఇవ్వబోతుండగా కాపుకాసిన అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ కృష్ణగౌడ్‌, ఎస్సైలు లింగస్వామి, రామారావు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇదే సమయంలో హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్‌లోని శ్రీధర్‌ ఇంట్లో మరో బృందం తనిఖీ చేపట్టినట్లు డీఎస్పీ చెప్పారు. తహసీల్దార్‌ను విచారించి నాంపల్లి అనిశా కోర్టులో హాజరు పర్చనున్నట్లు డీఎస్పీ కృష్ణగౌడ్‌ తెలిపారు.

డబ్బులతో పట్టుబడిన తహసీల్దార్‌ శ్రీధర్‌


విరాసత్‌  పూర్తయింది

2018లో జరిగిన భూ సర్వే కార్యక్రమంలోనే గుర్తింపు కార్డుకు అనుగుణంగా పేరు మార్పిడి జరగాలి. ఈ విషయాన్ని రాసాల సతీష్‌ అలియాస్‌ సత్యనారాయణ తాను బతికున్న సమయంలోనే పెద్ద చింతకుంట రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. తనకు సర్వే నంబరు 204-ఆ బీ2, 205-ఆ3 1.07 ఎకరాల భూమి ఉందని ఆధార్‌ కార్డు, పట్టా పాస్‌బుక్కులో పేరు వేర్వేరుగా ఉన్నందున భవిష్యత్‌లో ఇబ్బందులు ఏర్పడుతాయేమోనని భయంగా ఉందని సరిచేయాలని విన్నవించినా పట్టించుకోలేదు. శ్రీశైల ఈ చిక్కుల నుంచి బయటపడేందుకు ఆర్‌వోఆర్‌, ఖాస్రా, పహాణీలు పొందేందుకు సైతం రెవెన్యూ సిబ్బంది రూ.2,500లు డిమాండ్‌ చేశారని తెలిపారు. తప్పని పరిస్థితుల్లో రూ.1500లు ఇచ్చుకున్నట్లు బాధితురాలికి సహకరించిన రుక్ముద్దీన్‌ వెల్లడించారు. పత్రాలున్నా మళ్లీ విరాసత్‌ కోసం రూ.45 వేలు తహసీల్దారు డిమాండ్‌ చేయడంతో ఓపిక నశించిన శ్రీశైల అనిశా అధికారులను ఆశ్రయించారు. పట్టుబడ్డ తహసీల్దారు చేతుల మీదుగానే శ్రీశైలకు అనిశా అధికారులు బుధవారం రాత్రి విరాసత్‌ చేయించారు. ఈ సంఘటన తెలిసి రెవెన్యూ కార్యాలయం ముందు జనం పెద్ద ఎత్తున గుమిగూడి రెవెన్యూ అధికారుల తీరును చర్చించుకుంటూ కనిపించారు. శ్రీశైల ధైర్యాన్ని కొనియాడారు. ఆమెకు అండగా నిలిచిన రుక్ముద్దీన్‌ను అభినందించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని