logo

గల్లంతైన వారి మృతదేహాలు లభ్యం

పీఏపల్లి మండల పరిధిలో ఏఎమ్మార్పీ అనుసంధాన కాల్వ ఇన్‌ఫాల్‌ రెగ్యులేటర్‌ వద్ద మంగళవారం గల్లంతైన ఇద్దరు గల్లంతవగా.. వారి మృతదేహాలు బుధవారం లభ్యమయ్యాయి. కుటుంబానికి ఆసరగా నిలుస్తున్న

Updated : 27 Jan 2022 06:17 IST

పెద్దఅడిశర్లపల్లి, న్యూస్‌టుడే: పీఏపల్లి మండల పరిధిలో ఏఎమ్మార్పీ అనుసంధాన కాల్వ ఇన్‌ఫాల్‌ రెగ్యులేటర్‌ వద్ద మంగళవారం గల్లంతైన ఇద్దరు గల్లంతవగా.. వారి మృతదేహాలు బుధవారం లభ్యమయ్యాయి. కుటుంబానికి ఆసరగా నిలుస్తున్న కుమారులను ఈ విషాద ఘటన దూరం చేసి కన్నవారికి తీరని దుఃఖం మిగిల్చింది.  

శ్మశానమే ఇల్లు.. చెత్త కుప్పలే బతుకుదెరువు

రెక్కాడితే కానీ పూట గడవని కుటుంబాలు వారివి. కనీసం తలదాచుకునేందుకు సొంత ఇల్లు కూడా లేకపోవడంతో శ్మశాన వాటికే వారికి నివాసమైంది. జీవనోపాధి లేక ఇల్లు గడవాలంటే ఊరూరు తిరిగి వీధులు, చెత్త కుప్పలపైనున్న వ్యర్థాలను సేకరించి సొమ్ము చేసుకుని పొట్టపోసుకుంటూ కాలం వెళ్లదీస్తుంటారు. ఏ ఒక్కరోజూ చెత్తకుప్పలను ఆశ్రయించకపోతే ఆ రోజు పస్తులుండాల్సిన దుస్థితి వారిది. ఇంతటి దయనీయ పరిస్థితిలో బతుకుజీవుడా అంటూ కాలం వెళ్లదీస్తున్న వారి కుటుంబాలను కాల్వ రూపంలో విధి వెక్కిరించింది. నాంపల్లి మండలం నెమిళ్లగూడేనికి చెందిన కొండపల్లి సైదులు - ఎల్లమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, కుమార్తె సంతానం. వీరిలో పెద్దకుమారుడు రాము(19) వీరి ఆటో నడుపుతూ తల్లిదండ్రుల సీసాలు ఏరుకునే వృత్తిలో సాయ పడుతుంటాడు. సైదులు బంధువు కప్పెర రమేష్‌కు ఇద్దరు భార్యలు కాగా.. పెద్ద భార్య ధనమ్మ కుమారుడు సిద్ధూ (12) సైతం తండ్రికి సాయంగా ఆటోలో వెళ్తూ చెత్తకుప్పలపై సీసాలు సేకరిస్తూ చేదోడువాదోడుగా పనిచేస్తుంటాడు. ఈ క్రమంలోనే వీరు మంగళవారం అక్కంపల్లి జలాశయం సమీపంలోని ఇన్‌ఫాల్‌ రెగ్యులేటర్‌ పక్కన చెత్తకుప్పలో సీసాలు సేకరిస్తున్నారు. ప్రమాదవశాత్తు కాల్వలో రాము, సిద్ధూ గల్లంతయ్యారు. గుడిపల్లి పోలీసులు ఏఎమ్మార్పీ మోటార్లు నిలిపివేయించి బుధవారం మధ్యాహ్నం జాలరులతో తెప్పలపై గాలింపు చర్యలు చేపడుతుండగా అనుసంధాన కాల్వ చివర్లో ముందుగా సిద్ధూ, సాయంత్రం రాము మృతదేహాలు బయటపడ్డాయి. మృతదేహాలను శవపరీక్ష నిమిత్తం దేవరకొండ ఆస్పత్రికి తరలించి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి.వీరబాబు తెలిపారు. చేతికందొచ్చిన కుమారులు విగత జీవులుగా మారడంతో బాధిత తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

ప్రభుత్వపరంగా ఆదుకుంటాం: ఎమ్మెల్యే
బాధిత కుటుంబాలను ప్రభుత్వం తరఫున ఆదుకుంటామని ఎమ్మెల్యే రమావత్‌ రవీంద్రకుమార్‌ హామీ ఇచ్చారు. బుధవారం ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించి ప్రమాదానికి కారణాలు తెలుసుకున్నారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఎంపీపీ వంగాల ప్రతాప్‌రెడ్డి, కొండమల్లేపల్లి సీఐ వై.రవీందర్‌, సర్పంచి గోర్ల సైదమ్మ, పీఏసీఎస్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎస్‌.శ్రీనివాస్‌, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని