logo

వీరి చేతులు అద్భుతాలు చేస్తున్నాయ్‌..!

చిన్నప్పటి నుంచి కళల్లో ఉన్న నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పదునుపెడుతూ తాము ఎంచుకున్న రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. వారు గీసే చిత్రాలైనా, చేసే బొమ్మలైనా చూస్తే ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. తీక్షణంగా చూస్తే తప్ప అవి

Updated : 29 Jan 2022 05:37 IST

అభిరుచితో గుర్తింపు పొందిన యువత
మామడ/నిర్మల్‌ పట్టణం, న్యూస్‌టుడే

చిన్నప్పటి నుంచి కళల్లో ఉన్న నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పదునుపెడుతూ తాము ఎంచుకున్న రంగాల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. వారు గీసే చిత్రాలైనా, చేసే బొమ్మలైనా చూస్తే ఎవరినైనా ఇట్టే కట్టిపడేస్తాయి. తీక్షణంగా చూస్తే తప్ప అవి రంగులద్దుకున్నవని గుర్తించరు. ఇలా తమ ప్రతిభతో అందరిచే ఔరా అనిపించుకుంటున్న యువతపై ‘న్యూస్‌టుడే’ కథనం.


రమణీయ గీత.. : రమణిత

నర్సాపూర్‌ (జి) మండలకేంద్రానికి చెందిన రమణిత అందరికీ సుపరిచితురాలవడానికి కారణం ఆమెలోని కళనే. బొమ్మలు గీయడం, జానపద పాటలు పాడటం, లఘుచిత్రాల్లో నటించడం, నృత్యం, పల్లె సన్నివేశాలను ప్రతిబింబించే కార్యక్రమాలతో రాణిస్తోంది. యూట్యూబ్‌లో ఆ యువతి ప్రతిభకు ఎంతో ఆదరణ లభిస్తోంది. పల్లెటూరిలో పుట్టి సొంతంగా కళకు పదునుపెట్టి దినదినాభివృద్ధి చెందుతోంది. పట్టుదలతో ముందుకెళ్తే ఏ రంగంలోనైనా, ఎవరైనా రాణించొచ్చని రుజువు చేస్తోంది.


చమక్కుమనేలా.. : చెర్రీ

ఖానాపూర్‌ పట్టణానికి చెందిన చెర్రీ బహుముఖ ప్రజ్ఞాశాలిగా గుర్తింపు పొందాడు. చిన్నప్పటి నుంచి రంగులు, బొమ్మలపై ఉన్న ఆసక్తితో చిత్రలేఖనంలో మెలకువలు అభ్యసించి నైపుణ్యం సాధించాడు. అందమైన బొమ్మలు గీస్తూనే ఆకట్టుకునే నటనతో మెప్పించగలడు. ఇటీవల విడుదలైన అర్ధశతాబ్దం, అర్జున్‌ చక్రవర్తి సినిమాల్లో నటించి ప్రశంసలందుకున్నాడు. మంచి నృత్యకారుడిగానూ రాణిస్తున్నాడు.


మట్టితో బొమ్మలు.. బరికుంట అజయ్‌

నర్సాపూర్‌(జి)కి చెందిన బరికుంట అజయ్‌కు చిన్నప్పటి నుంచి బొమ్మల తయారీ అంటే మక్కువ. చూసిన ఏ వస్తువునైనా అచ్చుగుద్దినట్లు తయారుచేయడంలో దిట్ట. సొంతంగా నేర్చుకొని రాణిస్తున్నారు. ఏటా వినాయకచవితి, దుర్గ నవరాత్రుల సమయంలో గణపతి, అమ్మవారి విగ్రహాలను చక్కగా తీర్చిదిద్దుతాడు. పర్యావరణ పరిరక్షణతో పాటు మంచి కళను ప్రదర్శిస్తూ అందరిలో గుర్తింపు పొందారు.


ఆయన ప్రతిభ.. ‘నమ్మలేనంత’.. : అబ్దుల్‌ రాయబోస్‌

కడెం మండలం లింగాపూర్‌ గ్రామానికి చెందిన అబ్దుల్‌ రాయబోస్‌ ప్రతిభను మాటల్లో వర్ణించలేం. తమిళనాడులో బీఎఫ్‌ఏ పూర్తిచేశారు. ఆయన కుంచె నుంచి జాలువారిన చిత్రాలు నిజమైనవాటికి ఏమాత్రం తీసిపోవు. చాయ్‌- బిస్కట్‌, బ్రెడ్‌, మొక్కజొన్న కంకి, నాణేలు, కూరగాయలు.. తదితర వస్తువులు, పదార్థాల బొమ్మలను ప్రదర్శిస్తే అవి చిత్రాలని నమ్మడానికి సమయం పడుతుంది. ఇప్పటికే పలు ప్రదర్శనల్లో స్థానం పొందిన ఆయన చిత్రకళతో పలు పురస్కారాలు దక్కించుకోవడం విశేషం.


అచ్చుగుద్దినట్లుగా.. : సందేశ్‌

భైంసా మండలం పేండ్‌పెల్లి గ్రామానికి చెందిన సందేశ్‌ కర్ణాటకలో బీఎఫ్‌ఏ పూర్తిచేశాడు. చిన్నప్పటి కళకు అక్కడ మెరుగులద్దుకున్నాడు. ఎదురుగా ఉన్న మనిషిని చూస్తూ ఇట్టే ఆయన చిత్రాన్ని అచ్చుగుద్దినట్లుగా గీసేస్తాడు. ఇటీవల నిజామాబాద్‌ జిల్లా కలెక్టర్‌ సి.నారాయణరెడ్డి బొమ్మను గీసి ఆయనకు అందజేశారు. ఊహించని కానుకను చూసి కలెక్టర్‌ కాసేపు మైమర్చిపోయారు. ఆ యువకుడిని ప్రత్యేకంగా అభినందించారు. చిత్రకళనే కాకుండా పురాతన వస్తువుల సేకరణలోనూ సందేశ్‌ ప్రత్యేకతను చాటుతున్నాడు.


సహజసిద్ధంగా.. : గుండోజు సంతోష్‌

ప్రకృతిలో కనువిందు చేసే ప్రతీ అంశాన్ని ప్రతిబింబించే చిత్ర విచిత్రాలకు సంతోష్‌ జీవం పోస్తాడు. నర్సాపూర్‌ (జి)కి చెందిన ఈ యువకుడు గీసిన చిత్రాలు, తయారుచేసిన బొమ్మలు మ్యూజియాన్ని తలపిస్తాయి. గాల్లో తేలియాడుతున్నట్లు, ఆకాశంలో వేలాడుతున్నట్లు భ్రమింపజేసేలా కళాకృతులను అత్యద్భుతంగా తీర్చిదిద్దుతాడు. సమకాలీన అంశాలను, సందేశాత్మక విషయాలను సందర్భానుసారం తన చిత్రాలతో జనాలకు చేరవేస్తుంటాడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని