నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనపై హైదరాబాద్‌లో మిలియన్‌ మార్చ్‌

రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమించాలని పార్టీ అనుబంధ విభాగాలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యువ, కిసాన్‌, మహిళా, మైనార్టీ మోర్చాల

Updated : 29 Jan 2022 05:54 IST

భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో వివిధ వర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై ఉద్యమించాలని పార్టీ అనుబంధ విభాగాలకు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ పిలుపునిచ్చారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, యువ, కిసాన్‌, మహిళా, మైనార్టీ మోర్చాల అధ్యక్షులు, పదాధికారులతో శుక్రవారం రాత్రి వర్చువల్‌గా సమావేశం అయ్యారు. మోర్చాల పనితీరును సమీక్షించిన సంజయ్‌, రానున్నరోజుల్లో చేపట్టాల్సిన కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనపై వచ్చే అసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాలప్పుడు హైదరాబాద్‌లో మిలియన్‌మార్చ్‌ నిర్వహించాలని యువ మోర్చాని ఆదేశించారు. ఈలోగా నిరుద్యోగుల్లో చైతన్యం తేవాలని, నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పనకు కోటి సంతకాల సేకరణ చేపట్టాలని చెప్పారు.

తూతూమంత్రంగా వద్దు

ప్రజాసమస్యలపై పోరాడే విషయంలో పార్టీ మోర్చాల పనితీరే అత్యంత ముఖ్యమైందని సంజయ్‌ అభిప్రాయపడ్డారు. తూతూమంత్రపు కార్యక్రమాలు వద్దని.. (జనంలోనే ఉంటూ సమస్యలపై గట్టిగా పోరాడాలని సూచించారు. ఇటీవల తనపై, ఎంపీ అర్వింద్‌పై జరిగిన ఘటనల్ని ఉదహరిస్తూ అధికార తెరాస నుంచి దాడులు మరింత ఎక్కువయ్యే ప్రమాదం ఉందని అభిప్రాయపడ్డారు. భయపడకుండా ప్రజల పక్షాన ఉంటూ ధైర్యంగా ఎదుర్కొందామని అన్నారు. భాజపా వెల్లడించిన వివరాల ప్రకారం... బాయిల్డ్‌ రైస్‌ ఇవ్వబోమని కేంద్రానికి సీఎం ఇచ్చిన లేఖను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కిసాన్‌ మోర్చాకు నిర్దేశించారు. కులాల సమస్యలు, ఆత్మగౌరవ భవనాలపై ఓబీసీ మోర్చా.. మూడెకరాల భూమి, దళితబంధుపై ఎస్సీ మోర్చా.. గిరిజనులు, మహిళలు, మైనార్టీల సమస్యలపై ఆయా మోర్చాలు ఉద్యమ కార్యాచరణ రూపొందించాలని సూచించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని