logo

గుండెపోటు వస్తే ఇలా ప్రాణం కాపాడొచ్చు.. రాజమౌళితో సీపీఆర్‌ అవగాహన

కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌, ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం విదితమే. ఈనేపథ్యంలో గుండెపోటు వస్తే ఎలా అప్రమత్తమవ్వాలి..

Updated : 23 Feb 2022 08:36 IST

కేపీహెచ్‌బీకాలనీ, న్యూస్‌టుడే: కన్నడ నటుడు పునీత్‌ రాజ్‌కుమార్‌, ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి గుండెపోటుతో హఠాన్మరణం చెందిన విషయం విదితమే. ఈనేపథ్యంలో గుండెపోటు వస్తే ఎలా అప్రమత్తమవ్వాలి.. వెంటనే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే ప్రాణాలు కాపాడుకోవచ్చో తెలిపే వీడియోను తీయాలనుకున్నారు నగరానికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్‌ ఎంఎస్‌ఎస్‌ ముఖర్జీ. అనుకున్నదే తడవుగా ఎవరైనా ప్రముఖ వ్యక్తితో తీస్తే అందరికీ చేరుతుందనే ఆలోచనతో దర్శక దిగ్గజం రాజమౌళిని సంప్రదించగా ఆయన ఒప్పుకొన్నారు. గుండెపోటుతో ఎవరైనా కుప్పకూలిపోతే తొలి 3 నిమిషాల్లో అప్రమత్తమైతే ప్రాణం కాపాడొచ్చని ఆయన అంటున్నారు. బీఎల్‌ఎస్‌ (బేసిక్‌ లైఫ్‌ సపోర్ట్‌) పద్ధతిలో రాజమౌళితో స్వయంగా సీపీఆర్‌ (కార్డియా పల్మనరీ రీసఫిటేషన్‌) ప్రక్రియ చేసేలా అవగాహన కల్పించారు. రోగిని వెల్లికిలా పడుకోబెట్టి గట్టిగా కదపాలి. పక్కన ఉన్నవారికి 108కి ఫోన్‌ చేయాలని పురమాయించాలి. శ్వాస, పల్స్‌ తనిఖీ చేయడంతోపాటు రెండు చేతులతో ఛాతీపై గట్టిగా వత్తుతూ ఉండాలి. తలను కొంచెం పైకి లేపి నోట్లో నోరు పెట్టి గాలి ఊదితే ఫలితం ఉంటుందన్నారు. ఈలోపు ఏఈడీ యంత్రం అందుబాటులో ఉంటే వారి ఛాతీపై ఉంచి షాక్‌ ఇవ్వాలన్నారు. ఇలాంటి ప్రక్రియలను వెంటవెంటనే తొలి 3 నిమిషాల్లో చేపడితే ప్రాణం కాపాడొచ్చన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని