logo

సమకాలీన పరిస్థితులపై అవగాహన ఉండాలి

సర్కారీ కొలువు సాధించాలంటే ప్రణాళికతో చదవాలని, తాజా పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండాలని 2018 ఎస్సై బ్యాచ్‌ శిక్షణ టాపర్‌ మాలోతు రమాదేవి తెలిపారు. జన్నారం ఎస్టీకాలనీకి చెందిన ఆమె

Updated : 21 May 2022 06:18 IST

2018 ఎస్సై బ్యాచ్‌ శిక్షణ టాపర్‌ రమాదేవి

ఏన్కూరు, న్యూస్‌టుడే

సర్కారీ కొలువు సాధించాలంటే ప్రణాళికతో చదవాలని, తాజా పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండాలని 2018 ఎస్సై బ్యాచ్‌ శిక్షణ టాపర్‌ మాలోతు రమాదేవి తెలిపారు. జన్నారం ఎస్టీకాలనీకి చెందిన ఆమె ప్రస్తుతం మహబూబాబాద్‌ జిల్లా బయ్యారం ఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. పేద కుటుంబంలో పుట్టిన రమాదేవి గురుకులాలు, ప్రభుత్వ విద్యాలయాలను వేదికగా చేసుకుని స్వశక్తితో ఉద్యోగం సాధించారు. శిక్షణలోనూ 2018 బ్యాచ్‌లో ఇండోర్‌ టాపర్‌, ఆల్‌రౌండర్‌గా ముఖ్యమంత్రి పిస్టల్‌ను బహుమతిగా పొందారు. తాను సన్నద్ధమైన తీరు, అభ్యర్థులకు ఇచ్చే సూచనలు ఆమె మాటల్లోనే..

రెండు ఉద్యోగాలు సాధించా..

చిన్నతనం నుంచి సర్కారు కొలువే లక్ష్యంగా ఉన్న నేను కానిస్టేబుల్‌, ఎస్సై రెండు ఉద్యోగాలకు దరఖాస్తు చేశా. బీటెక్‌ చివరి సంవత్సరంలో ఉండగానే ఉద్యోగ ప్రకటన వెలువడింది. పోటీ పరీక్షలకూ కొంత సమయం కేటాయించా. బీటెక్‌ పరీక్షలు పూర్తయ్యాక రోజుకు 13 గంటలు కష్టపడ్టాను. ఉదయం శారీరక పరీక్షకు, మిగతా సమయం పుస్తకాలు చదివా. గుర్తింపు పొందిన పుస్తకాలను ఎంచుకుని చదివా. తొలుత కానిస్టేబుల్‌గా నియమితులయ్యా. శిక్షణకు వెళ్లిన కొద్ది రోజులకే ఎస్సై పరీక్ష ఫలితాల్లో కూడా అర్హత సాధించాను.

* ఎస్సై, కానిస్టేబుల్‌ పరీక్షకు సిద్ధమయ్యే అభ్యర్థులకు తొలుత దేశ, రాష్ట్ర తాజా పరిస్థితులపై పూర్తి అవగాహన ఉండాలి. ఆర్థిక పరిస్థితులు, త్రివిధ దళాలు, కరోనాతో ఎగుమతులు, దిగుమతుల పరిస్థితులు? ఆర్థిక వ్యవస్థపై ప్రభావం? రష్యా- ఉక్రెయిన్‌ యుద్ధ కారణాలు, యుద్ధం తర్వాత పరిణామాలు.. ఇలా అన్ని అంశాల్లో పట్టు బిగించాలి.

* ప్రశ్నాపత్రంలో ఒక ప్రశ్నకు ఆప్షన్లలో ఒకటి నుంచి మూడు సమాధానాలు చాలా దగ్గరగా ఉంటాయి. అవగాహన ఉంటేనే సమాధానం ఇవ్వగలుగుతాం.

* పుస్తకాలు ఎంచుకోవడంతో ప్రత్యేక శ్రద్ధ చూపాలి. మార్కెట్‌లో దొరికే వాటిల్లో నిపుణులు తయారు చేసిన వాటికి ప్రాధాన్యం ఇవ్వాలి.

* మైదానంలో శారీరక దారుఢ్యంపై కూడా ఎక్కువ శ్రద్ధ చూపాలి. 2018లో మహిళా అభ్యర్థులకు 100 మీటర్లు మాత్రమే ఉంది. ప్రస్తుతం 800 మీటర్లు పరుగెత్తాలి.

‘‘ప్రస్తుత ఉద్యోగ ప్రకటన మంచి అవకాశంగా భావించాలి. సాధించాలనే పట్టుదలతోపాటు ప్రణాళికతో శ్రమిస్తే కచ్చితంగా విజయం సాధిస్తాం. కొలువు సాధించాక శిక్షణలోనూ కష్టపడ్ఢా మా బ్యాచ్‌లో ఇండోర్‌, ఆల్‌రౌండ్‌ విభాగంలో బంగారు పతకాన్ని సాధించాను.’’

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని