Hyderabad Rains: హైదరాబాద్‌ పాతబస్తీలో వర్ష బీభత్సం..

నగరంలో ఈ ఉదయం భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గంటసేపు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో నగర వాసులు ఇళ్ల నుంచి బయటికి రాలేకపోయారు.

Updated : 04 May 2022 10:46 IST

హైదరాబాద్‌: నగరంలో ఈ ఉదయం భారీ వర్షం బీభత్సం సృష్టించింది. గంటసేపు ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షంతో నగర వాసులు ఇళ్ల నుంచి బయటికి రాలేకపోయారు. భారీ వర్షం కారణంగా లోతట్టు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరద నీరు చేరింది. ముఖ్యంగా నగరంలోని పాతబస్తీని వర్షం కుదిపేసింది. యాకుత్‌పురా నియోజకవర్గంలోని మదీనానగర్, ధోభీ ఘాట్ తదితర లోతట్టు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. ఇళ్లలోకి నీరు చేరడంతో ప్రజలు అవస్థలు పడ్డారు. బహదూర్‌పురా నియోజకవర్గంలోని మక్కాకాలనీలో భారీగా నీరు చేరింది. యష్రప్‌నగర్‌ ముంపు ప్రాంతాల్లో వరద నీరు చేరింది. ముంపు ప్రాంతాల్లో యాకుత్‌పురా ఎమ్మెల్యే పాషా ఖాద్రి, జడ్సీ సామ్రాట్‌ పర్యటించారు. వరదనీటిలో ట్యూబ్‌ బోటు సాయంతో స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

జీడిమెట్ల మీనాక్షి కాలనీ, స్ప్రింగ్ ఫీల్డ్ కాలనీ, సురారం మల్లారెడ్డి ఆసుపత్రి, కుత్బుల్లాపూర్ మొదటి ఎవెన్యూ కాలనీలో వర్షం నీరు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దీంతో ఈ ప్రాంతంలో రాకపోకలకు ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈదురుగాలులకు నల్లకుంట తిలక్‌నగర్‌ వద్ద భారీ వృక్షం కూలింది. దీంతో ఈ ప్రాంతంలో విద్యుత్‌ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. బషీర్‌బాగ్‌లోని కాలేజ్ వద్ద రోడ్ల మీద వర్షం నీరు నిలిచిపోయింది. ఈ ప్రాంతంలో చెట్ల కొమ్మలు విరిగిపడటంతో ప్రజల రాకపోకలు స్తంభించిపోయాయి. జీహెచ్‌ఎంసీ సిబ్బంది పట్టించుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు హైదర్‌గూడ నుంచి బషీర్‌బాగ్‌ వైపు రాకపోకలు నిలిచిపోయాయి.

నగరంలోని పలు ప్రాంతాల్లో చిరుజల్లులు కురుస్తున్నాయి. ఉదయం కురిసిన భారీ వర్షానికి రోడ్లపై వరద నీరు పొంగి పోర్లుతుండటంలో పాదచారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైనేజీల్లో నీరు పొంగి పొర్లుతుండటంతో జీహెచ్‌ఎంసీ సిబ్బంది పూడికతీత పనులు చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని