
Property Tax: కొలతల కుర్చీ.. జలగలా పట్టీ!

ఆస్తి పన్ను వసూళ్ల దృష్ట్యా.. శేరిలింగంపల్లి జోన్ సంపన్నమైంది. నగరంలోని అన్ని జోన్లకన్నా అక్కడి నుంచే ఎక్కువ మొత్తంలో పన్ను వసూలవుతుంది. దాన్నే అవకాశంగా తీసుకుని కొందరు అవినీతి అధికారులు జీహెచ్‌ఎంసీకి చెందాల్సిన డబ్బును సొంత జేబుల్లోకి మళ్లించుకుంటున్నారు. నగర వ్యాప్తంగా దాదాపు అన్ని జోన్లలో ఆస్తిపన్ను మదింపు, వసూళ్ల యంత్రాంగం అటు, ఇటు బదిలీ అవుతుంటుంది. శేరిలింగంపల్లి జోన్‌లో మాత్రం అలా జరగడం లేదు. ఎవరైనా బదిలీపైనో, పదోన్నతిపైనో అక్కడికి వెళ్లాల్సి వస్తే.. వాళ్లకు అవస్థలు తప్పడం లేదు. కుర్చీలన్నీ అవినీతి జలగల చేతిలో చిక్కి ఉండటమే అందుకు కారణం.
ఏడేళ్లుగా అవినీతి చక్రం.. కొత్తగా నిర్మించే అపార్ట్‌మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్సులు శేరిలింగంపల్లి సర్కిల్‌లోనే ఎక్కువ. ఆస్తిపన్ను విభాగంలో ఓ అధికారి దాన్ని వసూళ్లకు అవకాశంగా మార్చుకున్నారు. 2016లో రాయదుర్గం, ఖాజాగూడ, గచ్చిబౌలి ప్రాంతాల బిల్ కలెక్టర్‌గా బాధ్యతలు తీసుకున్న ఆయన 2018లో ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి తీసుకున్నారు. సూపరింటెండెంట్‌గా 2020లో మరో పదోన్నతి వచ్చినా తన పరిధిని మాత్రం వదల్లేదు. సూపరింటెండెంట్‌గా పని చేయకుండా.. ఆస్తిపన్ను వసూళ్లతో ముడిపడిన సహాయ మున్సిపల్ కమిషనర్ హోదాలో నిబంధనలకు విరుద్ధంగా కొనసాగుతున్నారు. అతడికి సర్కిల్ ఉన్నతాధికారి అండదండలు ఉండటంతో.. అధికారికంగా ఆ స్థానంలో కూర్చోవాల్సిన అధికారులు వివక్షకు గురవుతున్నారు. ఓ సహాయ మున్సిపల్ కమిషనర్.. కార్యాలయంలో కుర్చీ లేక బయట కూర్చుని వెళ్లిపోతున్నారు.
ఏళ్లుగా బదిలీల్లేవు
ఆస్తిపన్ను విభాగం అదనపు కమిషనర్ ప్రియాంకనే ప్రస్తుతం శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఏళ్లుగా అమలు కాని బిల్ కలెక్టర్లు, ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్ల బదిలీల ప్రతిపాదనను ఆమె ఆమోదించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. ఆస్తిపన్ను మదింపు సవ్యంగా జరిగితే.. గ్రేటర్‌లో అధికారికంగానే రూ.2,500 కోట్ల పన్ను వసూలవుతుందని అంచనా. ఇప్పటికీ నగరంలో వందలాది నిర్మాణాలు ఆస్తిపన్ను లేకుండా కొనసాగుతున్నాయి. కొన్ని రూ.1నుంచి రూ.10 చెల్లిస్తున్నాయి. అలాగని అవి పెంకుటిల్లు, రేకుల డబ్బాలు కాదు.. అందులో కొన్ని భారీ షెడ్లు, వ్యాపార సముదాయాలు ఉండటం గమనార్హం.
ఇదీ తీరు.. అందుకే కదలరు
నిర్మాణ అనుమతులిచ్చే ప్రణాళిక విభాగానికన్నా.. ఆస్తి పన్ను విభాగంలోనే అవినీతి ఎక్కువని నగర పౌరుల అంచనా. శేరిలింగంపల్లి సర్కిల్‌కు అనధికారిక ఏఎంసీగా కొనసాగుతున్న అధికారే అందుకు సాక్ష్యం. సదరు అధికారి తాజాగా బయోడైవర్సిటీ కూడలిలోని ఓ వాణిజ్య సముదాయానికి రూ.5లక్షల మేర వార్షిక పన్ను తక్కువగా వచ్చేలా చేశారు. ఖాజాగూడలో అపార్ట్‌మెంట్ల నుంచి భారీగా వసూలుచేశారు. అపార్ట్‌మెంట్‌లోని అందరు యజమానులు రూ.25వేల చొప్పున అతడికి ముడుపులు సమర్పించుకున్నారని, బదులుగా.. ఏడాదికి రూ.5వేలు పన్ను తక్కువగా వచ్చేలా కొలతలు తీసుకున్నారని విమర్శలున్నాయి. అడ్డదారిలో సంపాదించిన డబ్బుతో మెహిదీపట్నంలో, బండ్లగూడలో ఆస్తులు కొనుగోలు చేశాడని బాధితులు ఆరోపించారు.